DailyDose

తెలంగాణా మద్యం షాపులకు నూతన షెడ్యూల్-తాజావార్తలు

తెలంగాణా మద్యం షాపులకు నూతన షెడ్యూల్-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది.

* గూఢచర్యం కేసులో పాక్‌ చెరలో ఉన్న భారత నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో మరో ముందడుగు పడింది. మరణశిక్ష పునఃసమీక్ష అంశంలో ఆయన తరఫు వాదనలు వినిపించేందుకు లాయర్‌ను నియమించుకునే అవకాశాన్ని భారత్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు కల్పించింది. అయితే, అతడు పాకిస్థానీ న్యాయవాదే అయి ఉండాలని షరతు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3కు వాయిదా వేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 7,822 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76,377 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 88,672 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 5,786 మంది కోలుకున్నారు. తాజాగా 63 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,537కి చేరింది.

* ప్రభుత్వ కార్యకలాపాలు సులభంగా, పారదర్శకంగా జరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో.. పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-సేవలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్‌లో ఈ సేవలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు.

* కొద్ది రోజుల క్రితం మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు కేంద్రం హోం శాఖ అనుమతించింది. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

* తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సైతం కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన తల్లి, తమ్ముడు, డ్రైవర్‌, పీఏకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థరణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

* ప్రభుత్వ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిని సందర్శించి మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కరోనా వైరస్‌ సోకిన అనంతరం హోం మంత్రి అమిత్‌ షా ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందడాన్ని థరూర్ తప్పుబట్టారు. ‘‘హోం మంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వెళ్లకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని శశిథరూర్‌ అన్నారు.

* కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిభాషా విధానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ నూతన విధానాన్ని రాష్ట్రంలో అమలుచేయమని స్పష్టం చేశారు.

* ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో మాత్రం పరిస్థితులపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే చైనా కూడా కరోనా ఆర్థికంగా కుంగిపోయినట్లు అక్కడి ఆర్థికరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. మార్చి నెలలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో చైనాలో చాలాచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి. ఈ సమయంలో దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

* మహిళా స్వయం సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ తదితర కంపెనీలతో సీఎం జగన్‌, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అనంతరం సీఎం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 12న వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభిస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద రూ.4,500 కోట్లు ఇస్తున్నామన్నారు.

* అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. 11 మంది పూజారుల శాస్త్రోక్త మంత్ర పఠనం మధ్య, ఈ ఉదయం ఎనిమిది గంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం.. గౌరీ గణేశ పూజతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా అయోధ్య పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రామాలయాల్లో కూడా రామాయణ పారాయణం కొనసాగింది.

* కరోనా సోకితే దారుణమైన నేరంగా భావించొద్దని తెలంగాణ మంత్రి కె. తారకరామరావు అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిమిత్తం సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్‌ వార్డు, కొవిడ్‌ అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

* మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ సైనిక్‌ పురిలోని ఓ స్థిరాస్థి వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఆ ఇంటి వాచ్‌మెన్‌ దంపతులే నిందితులుగా తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి వాచ్‌మెన్‌ దంపతులే చోరీ చేశారని పోలీసులు గుర్తించారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. తాజాగా వైరస్‌ ప్రభావం మరింత పెరిగిందని వైట్‌ హౌజ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరాలనే కాకుండా గ్రామీణ ప్రాంతాలల్లోనూ వైరస్‌ అసాధారణ రీతిలో వ్యాపిస్తోందని వెల్లడించారు. తొలుత కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ మహమ్మారి తీవ్రత ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిందని ఇప్పటికే అక్కడి అధికారులు పేర్కొన్నారు.

* ఏపీ రాజధాని విషయంలో రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదేన్నారు.

* తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం దీని బారిన పడుతున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. కాగా, ఇప్పుడు మరో దర్శకుడు తేజకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల ముంబయి వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా, కరోనా సోకినట్లు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. నేలపాడులో ఉద్దండరాయునిపాలెంకు చెందిన రైతు పూర్ణచంద్రరావు వినూత్నంగా నిరసన తెలిపారు. భారీ క్రేన్‌పైకి ఎక్కి రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు దిగేది లేదని స్పష్టం చేశారు.

* రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే.. సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతారా? అని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోచుకోవడానికే విశాఖలో రాజధానిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఆరు వేల ఎకరాలు కాజేశారని, ధరలు పెంచి అమ్మేందుకు చూస్తున్నారని విమర్శించారు.

* ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా మరో సేల్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రైమ్‌ డే సేల్‌ పేరిట ఈ నెల ఆరు నుంచి అమెజాన్‌ సేల్‌కు సిద్ధమవ్వగా.. సరిగ్గా అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌ కూడా ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్’ పేరిట సేల్‌ ప్రారంభించనుంది. ఈ సేల్‌ 10వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుపై కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది.