Kids

ప్రస్తుత విద్యావ్యవస్థను వివరించే చిలుక కథ

ప్రస్తుత విద్యావ్యవస్థను వివరించే చిలుక కథ

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భం గా..

రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిలుక కథ

పిల్లలని చదివిస్తున్న ప్రతి తల్లీతండ్రీ చదవాల్సిన కథ ..

ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది.

కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక.

ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ‘ఎడ్యుకేట్ ఇట్’ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.

ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే… మొదట అది కుదురుగా ఉండాలి. అంటే…. అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు.

కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ‘ ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు’ అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.

పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ‘ అబ్బా… భలే చిలుక’ అనటం లేదు. ‘ అబ్బా… ఏం పంజరం!’ అంటున్నారు. లేదంటే ‘ అబ్బా … ఎంత చదువు!’ అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ‘ ఆహా… ఓహో ‘ అని కీర్తిస్తున్నారు.

రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు… ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.

‘ అలాగే ‘ అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.

ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. ‘చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ‘ అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు.

రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది.

ఆ రోజైతే …. రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.

రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ‘ చిలుక ఎలా చదువుతోంది? ‘ అని అడిగాడు.
‘ చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి’ అన్నాడు మేనల్లుడు

రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.
‘ ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?’
‘ ఎగరరదు’
‘ ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా?

‘పాడదు’
‘ సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా’
తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.

” ఆ కడుపులోనిది ఏమిటి!” అని అడిగారు రాజు గారు.
‘ జ్ఞానం మామయ్య ‘ అని చెప్పాడు మేనల్లుడు.

‘ చిలుక చనిపోయినట్లు ఉంది కదా ‘ అన్నారు రాజుగారు.
చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.

నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా….!