Kids

ఏడుపు చాలా ఆరోగ్యవంతం

ఏడుపు చాలా ఆరోగ్యవంతం

లోపల కాన్పు జరుగుతున్నది.ఆపరేషన్‌ థియేటర్‌ బయట ఉద్విగ్నత.లోపల నిశ్శబ్దం పెరిగే కొద్దీ బయట కంగారు.ఇంతలో ఓ ఏడుపు వినిపించింది. అంతే! పట్టలేని ఆనందమేదో ముంచెత్తింది . ఏడుపు కొత్త జీవితానికి సంకేతం! తల్లి నుంచి ఒక్కసారిగా విడివడిన బాధకు సాక్ష్యం. తనని తాను ఓదార్చుకునేందుకు మనిషి ఎంచుకున్న మార్గం. ఊహ తెలిసేకొద్దీ అదే ఏడుపును బలహీనతగా భావిస్తారు. కండ్లకు కంచెలు వేసి, కన్నీటిని ఆవిరిచేసేస్తారు. అలా చేయడం అంటే, బాధను బలవంతంగా అణచివేయడమే అంటున్నారు. గుండె మంటలను కన్నీటితో చల్లార్చకపోతే, అవి ఆరోగ్యాన్ని నిలువెల్లా దహించివేస్తాయని హెచ్చరిస్తున్నారు.
** కొత్త ఉద్యోగం వచ్చింది. సంతోషంతో పార్టీ చేసుకున్నాం. కొన్నాళ్లకి ప్రమోషన్‌ వస్తే ఎగిరి గంతేసి స్వీట్లు పంచి పెట్టుకున్నాం. బిడ్డకి పెండ్లయితే వాడంతా విస్తరాకులు వేశాం. ఇలా ప్రతి సంతోషాన్నీ వ్యక్తం చేస్తాం. మరి విషాదం మాటేమిటి? మనస్ఫూర్తిగా నవ్విన మనం, బాధ బరువు కరిగేలా ఏడ్చేందుకు ఇష్టపడమెందుకు? నలుగురిలో ఏడవటం నగుబాటు, ఓటమిని ఒప్పుకొనేందుకు నామోషీ, బలహీనుడిగా అంచనా వేస్తారనే అనుమానం. మగవాడు ఏడిస్తే ‘ఆడపిల్లలా ఏడుస్తావేంటి’ అనే ఎగతాళి ఎదురవుతుంది. ఆడపిల్ల ఏడిస్తే ఇంటి లక్ష్మీదేవి కంటతడి పెట్టకూడదనే హెచ్చరిక వినిపిస్తుంది. మొత్తానికి ఏడుపును ఓ అపశకునంగా, బలహీనతగా భావించే రోజులు వచ్చేశాయి. కానీ, బాధను నయం చేసుకునేందుకు ఏడుపును మించిన థెరపీ లేదనే సలహాలు మొదలవుతున్నాయి.
**సృష్టిలో భావోద్వేగాలతో ఏడ్చే ప్రాణి మనిషి మాత్రమే అన్నది శాస్త్రజ్ఞుల మాట. వీటిని ‘ఎమోషనల్‌ టియర్స్‌’ అంటారు. ఉద్వేగాలకీ, కన్నీటికీ మధ్య సంబంధం ఇప్పటికీ మిస్టరీనే! దానికి సరైన కారణాన్ని కనుక్కొనేందుకు వందల ఏండ్లుగా రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. క్రీస్తు పూర్వం హిప్రొక్రేట్స్‌ సమయం నుంచే వాటికి కారణం కనుగొనే ప్రయత్నాలు జరిగాయి. మెదడులో అధికంగా స్రవించే రసాయనాలు, కన్నీటి ద్వారా విడుదల అవుతాయని అప్పట్లో అనుకునేవారు. కారు రేడియేటర్‌లాగా గుండె వేడెక్కినప్పుడు, ఆవిరులు బయటకు వచ్చి దాన్ని చల్లార్చే ప్రక్రియే కన్నీరు అనే వాదన ఒకటి క్రీ.శ 1600లలో బయల్దేరింది. మనిషి కూడా జలచరం నుంచే వచ్చాడు కాబట్టి సముద్రపు ఉప్పదనాన్ని తట్టుకునేందుకు కన్నీరు రాల్చడం అలవాటు అయిపోయిందనే మరింత వింత వాదనా వినిపించింది. ఇలాంటి సిద్ధాంతాలు విని నిజంగానే ఏడుపు రావడం ఖాయం.
**విజ్ఞానం, సాంకేతికత పెరిగే కొద్దీ ఏడుపు మూలాన్ని కనుక్కొనేందుకు సీరియస్‌ ప్రయత్నాలు జరిగాయి. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా మనిషి జీవితంలో ఏడుపు ఎలా భాగమైందో ఊహించే ప్రయత్నం చేశాయి.
*పాల్‌ మెక్‌లీన్‌ అనే శాస్త్రవేత్త ప్రకారం కన్నీ టికీ, మంటకీ దగ్గర సంబంధం ఉంది. మానవ నాగరికత నిప్పుతోనే ఊపందుకుందని తెలిసిందే! రాత్రివేళ జంతువులు భయపడాలన్నా, పగలు వాటిని వేడివేడిగా వండుకోవాలన్నా చితుకులే గతి. ఎవరన్నా చనిపోతే దహనం చేసేందుకు కూడా మంట కావాలి. ఇలా ‘నిప్పు అతని ఉద్వేగాలతో ముడిపడిపోయింది’ అంటాడు పాల్‌. పొగమంటకి కన్నీరు రావడం ఎంత సహజమో, ఉద్వేగాలకి కూడా ఏడుపు రావడం ఓ సహజాతంగా మారిపోయిందని చెబుతాడు. గమనించారో లేదో చాలా జంతువులు నేల మీద పడిన కొద్ది గంటలకే తమ కాళ్లమీద తాము నిలబడతాయి. ప్రమాదం వస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ, శిశువు మాత్రం అత్యంత నిస్సహాయ స్థితిలో ఉంటుంది. దానిని ఎవరో ఒకరు సాకాలి. ఆకలి, అనారోగ్యం, అలసట ఏది వచ్చినా పెద్దవాళ్లు హాజరు కావాల్సిందే. ఆ బేలతనాన్ని వ్యక్తపరిచేందుకే ఏడుపుని సాధనంగా ఎంచుకున్నాడని జొనాథన్‌ రొటెన్‌బర్గ్‌ అనే సైకాలజిస్ట్‌ తీర్మానించాడు.మనకు దగ్గరైన మనిషిని చూసినప్పుడు మెదడులో ఏ భాగం స్పందిస్తుందో ఏడ్చినప్పుడు కూడా అదే భాగం స్పందిస్తుందని ట్రింబుల్‌ అనే ప్రొఫెసర్‌ కనుగొన్నారు. మానవ పరిణామక్రమంలో అనుబంధాలు, బాధ, జాలి లాంటి భావాలకు అనుబంధంగా తమ ఉద్వేగాలను వ్యక్తీకరించేందుకు, ఎదుటివ్యక్తి బాధకు స్పందించేందుకు ఏడుపు ఒక పరికరంగా మారిందని అర్థమవుతున్నది. ఆ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన ఓ దోపిడీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇద్దరు ఆగంతకులు ఓ డెలివరీ బాయ్‌ని దోచుకుని వెళ్లబోయారు. కానీ అతను బేలగా ఏడవడం చూసి వాళ్ల గుండె కరిగిపోయింది. లాక్కున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడమే కాదు, అతన్ని హత్తుకుని ఓదార్చి మరీ వెళ్లారు. అనువుగాని చోట బలవంతుడి నుంచి శరణు కోరేందుకు, దాడి జరిగే సమయంలో దారినపోయేవాళ్లలో సానుభూతిని రగిల్చేందుకు కన్నీరు ఉపయోగపడుతుంది. టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఒరెన్‌ హాసెన్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్న విషయమిది.
***కన్నీరు వేరు! ఏడుపు వేరు..
ఓస్‌ ఇందులో విశేషం ఏముంది. ఉల్లిపాయలను కోస్తే కన్నీరు వస్తుంది. మనసుకు కోత పడితే ఏడుపు వస్తుంది అనుకోవచ్చు. కన్ను పొడిబారకుండా ఉండేందుకు కనురెప్పలు మూసిన ప్రతిసారీ ఏర్పడే తేమ ఎలాగూ ఉంటుంది. కానీ ఈ మూడు రకాల సందర్భాలకీ వేర్వేరు రసాయనిక చర్యలు జరుగుతాయి.కంటిని తేమగా ఉంచే కన్నీటిని బేసెల్‌ అంటారు. కనుపాపను ఆరోగ్యంగా ఉంచేందుకు, ఇందులో తగినన్ని ప్రొటీన్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు కంట్లోకి చేరిన బ్యాక్టీరియాను చంపేందుకు లైసోజైమ్‌ లాంటి యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రవాలు ఉంటాయి.కంట్లో ఏదన్నా బయటి వస్తువు (ఫారిన్‌ బాడీ) పడినప్పుడు దాన్ని బయటికి పంపేందుకు వచ్చే కన్నీటిని రిఫ్లెక్స్‌ టియర్స్‌ అంటారు. ఒక్కసారిగా కంట్లో వెలుతురు పడటం, ఉల్లిపాయలు తరిగేటప్పుడు వెలువడే ఆవిర్లు కూడా రిఫ్లెక్స్‌ టియర్స్‌కు కారణం అవుతాయి. ఇవి కాస్త పలుచగా ఉండి, బేసిల్‌ టియర్స్‌ను పోలి ఉంటాయి.
*భావోద్వేగాలకు అనుగుణంగా వచ్చే ఎమోషనల్‌ టియర్స్‌ పూర్తిగా భిన్నం. వీటి ద్వారా మనసును ఒత్తిడికి లోనుచేసే కార్టిజాల్‌, అడ్రినలిన్‌ అనే రసాయనాలు (స్ట్రెస్‌ హార్మోన్స్‌) బయటకు వచ్చేస్తాయని ఓ వాదన. అంతేకాదు! సాధారణ కన్నీటికంటే ఇవి మరింత చిక్కగా ఉంటాయి. బుగ్గలమీద చారికలు ఏర్పడతాయి. ఎదుటివారు వాటిని గమనించి, స్పందించేందుకే ఈ ఏర్పాటు అంటారు.
**ఏడుపు సంఘం
ఏడుపు వల్ల ఇన్నేసి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సైకాలజిస్టులు దాన్ని కూడా ఒక థెరపీలాగా ఉపయోగిస్తున్నారు. సూరత్‌కు చెందిన కమలేశ్‌ మసాలవాలా.. మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఓ క్రయింగ్‌ క్లబ్‌నే స్థాపించాడు. కమలేశ్‌ రెండేండ్ల క్రితం వరకు తను ఓ లాఫింగ్‌ క్లబ్‌ని నడిపేవాడు. నవ్వు నాలుగు విధాలా ఆరోగ్యం అంటూ జనాలని బలవంతంగా నవ్వించేవాడు. కానీ ఎందుకో అకస్మాత్తుగా ఓ ఐడియా తట్టింది. జీవితం ఒక నాణెం అయితే నవ్వుతో పాటు ఏడుపు కూడా ముఖ్యమే కదా! నవ్వుని ఆస్వాదించే మనిషిని ఏడుపుని ఎందుకు దూరం చేసుకుంటున్నాడు లాజిక్కే కదా. అందుకే సూరత్‌లో ప్రతి నెలా చివరి ఆదివారం రెండు గంటల పాటు.. తనివితీరా ఏడుద్దాం రండి అంటూ ఆహ్వానం పలికాడు. ఓ అయిదు నిమిషాల ధ్యానం తర్వాత మీ జీవితంలో జరిగిన ఏదన్నా విషాదాన్ని తల్చుకుని తనివితీరా ఏడవండి అంటూ ప్రోత్సహించాడు. ఆ సెషన్స్‌లో ఏడ్చినవాళ్ల మనసు తేలికపడటమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు కూడా నెమ్మదించాయి. అది దేశంలోనే మొట్టమొదటి క్రయింగ్‌ క్లబ్‌గా రికార్డుకెక్కింది. ఈ విజయోత్సాహంతో హైదరాబాదులో కూడా ఒక శాఖను ప్రారంభించారు కమలేశ్‌. ఈ లాక్‌డౌన్‌ హడావుడి పూర్తయిపోతే ఇలాంటి మరిన్ని క్రయింగ్‌ క్లబ్స్‌ రావడం ఖాయం. పసిపిల్లలు తమ మనసులో ఉన్న బాధనీ, అసంతృప్తినీ ఎప్పటికప్పుడు ఏడుపు ద్వారా బయటకి వెళ్లగక్కేస్తుంటారు. అందుకే పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటున్నారు కమలేశ్‌. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే!
***తిరుగులేని సాక్ష్యం!
జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌. ఒక ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌! రోగ నిరోధకక్తి పొరపాటున మన శరీరం మీదే దాడి చేసే వ్యాధి. ఈ సిండ్రోమ్‌తో గొంతులో లాలాజలాన్ని, కంట్లో నీటినీ స్రవించే గ్రంథులు దెబ్బతింటాయి. దాంతో వీళ్లు ఏడవలేరు. ఇలా ఏడవలేకపోవడం, వారి మానసిక స్థితిమీద తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిసింది. ఇతరుల భావోద్వేగాలను గ్రహించడంలో కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లు బయటపడింది.
**మొసలికన్నీరు నిజమే!
అమాయకులను పొట్టన పెట్టుకుని ఏమీ ఎరగనట్టుగా కన్నీరు ఒలికించేస్తే ‘మొసలి కన్నీరు’ అంటూ ఈసడించుకుంటాం. ఎందుకంటే మొసళ్లు తాము జంతువులను కరకరా నములుతూనే, వాటిమీద జాలి చూపిస్తాయని వందల ఏండ్ల నాటి నమ్మకం. ఇందులో జాలి అబద్ధం, కన్నీరు నిజం. మొసలి నేలమీద ఉన్న ఆహారాన్ని తినేటప్పుడు, వేడి గాలి దాని కన్నీటి గ్రంథులమీద ఒత్తిడి కలిగించడం వల్ల అవి ఏడుస్తాయని తేలింది. మాల్కం షానర్‌ అనే పరిశోధకుడు, ఓ నాలుగు మొసళ్లని వీలైనంత దగ్గరగా పరిశోధించి తేల్చిన విషయమిది.
*తెలుగులో ఏడు
అభిమన్యుడి కథ గుర్తుందా! కడుపులో ఉండగానే పద్మవ్యూహాన్ని నేర్చుకున్న పాత్ర అది. ప్రహ్లాదుడి కథా ఇంచుమించు ఇలాంటిదే. పిల్లవాడు తల్లి కడుపున ఆరో నెలలో ఉండగానే ఆమె మాట్లాడే శబ్దాలను గ్రహిస్తాడని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆ శబ్దాలకు అనుగుణంగానే అతని మెదడులో భాషకు సంబంధమైన భాగాలు రూపుదిద్దుకుంటాయంటున్నారు. ఆఖరికి వాళ్ల ఏడుపు కూడా భాషను పోలి ఉంటుందని తేల్చారు. కొన్ని భాషలలో ఒకే మాటని వేర్వేరుగా పలికితే వేర్వేరు అర్థాలు వస్తాయి. వీటిని టోనల్‌ లాంగ్వేజెస్‌ అంటారు. చైనీస్‌, పంజాబీ వంటి భాషలు ఈ కోవలోకి వస్తాయి. మిగతా పిల్లలను చైనీస్‌ పిల్లలతో పోల్చినప్పుడు భాషను బట్టి ఏడ్చే తేడా చాలా స్పష్టంగా బయటపడింది.ఏడుపు చాలారకాల మానసిక సమస్యలకు చికిత్సగా మారుతున్నది. సమస్యలు తగ్గేందుకు… రోగులను అప్పుడప్పుడూ ఏడిపించడమే మందు అంటున్నారు.
***అందమైన ఓదార్పు
మనసుకు ఏదో ముల్లు గుచ్చుకుని బొటబొటా కన్నీరు రాలితే ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా, ఏడిస్తె నీ కళ్లు నీలాలు కారు’ అంటూ ఎవరన్నా ఆదరిస్తే ఎంత ఓదార్పుగా ఉంటుందో కదా! ఈ పాట విన్నాడో లేదో కానీ, అందులో ఓ వ్యాపార సూత్రాన్ని కనుగొన్నాడో మేధావి. అతనే హిరోకి టెరాయ్‌. జపాన్‌కు చెందిన ఈ యువకుడు ఓదార్చే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దాని పేరు రుయ్‌ కట్సు. లలనలను లాలించడమే ఈ సేవ. అమ్మాయిలు సుతారంగా ఏడుస్తూ ఉంటే, ఓ అందమైన అబ్బాయి కర్చీఫు పట్టుకుని వాళ్ల కన్నీటిని అంతే సున్నితంగా అద్దుతూ ఉంటాడు. స్త్రీపురుషులు అందరికీ ఈ సర్వీస్‌ అందుబాటులో ఉన్నా మహిళా కస్టమర్లే ఎక్కువ. చింతలతో సతమతం అవుతున్న చిన్న కుటుంబాలు, కెరీర్‌ సవాళ్లతో అలసిపోయిన స్త్రీలు ఈ సేవలను అందుకుంటున్నారు. ఈ విజయోత్సాహంతో తన వ్యాపారాన్ని మిగతా దేశాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు హిరోకి టెరాయ్‌.
****ఏడిస్తే లాభాలెన్నో
ఒకసారి మీరు తనివి తీరా ఏడ్చింది ఎప్పుడో గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. గుర్తుకు రావడం లేదు కదా! పదిమంది మధ్యే కాదు ఒంటరితనంలో ఏడ్చేందుకు కూడా నామోషీ పడిపోతాం. కానీ తనివితీరా ఏడిస్తే ఆరోగ్యపరంగా అనేక లాభాలు అంటున్నారు వైద్యులు.బాధతో ఏడ్చినప్పుడు లూ ఎన్‌కెఫెలిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది నొప్పి మాత్రలా పనిచేస్తుంది. ఆక్సిటోసిన్‌ అనే రసాయనం, మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. వేదన ఓ ప్రక్రియ. పశ్చాత్తాపం, కోపం, అవమానం ఇలాంటివన్నీ వేదనకు కారణమైతే ఆ వలయానికి సహజమైన ముగింపు ఏడుపే అంటారు నిపుణులు. ఏడుపులో లయబద్ధంగా వెక్కుతూ ఉంటాము, శరీరం వణుకుతుంది, గుండె వేగం పెరుగుతుంది, కన్నీరు చెంపల్ని తడుముతుంది. ఇదంతా వ్యాయామం లేదా మసాజ్‌ లాగా పనిచేస్తుందని అంటున్నారు పరిశోధకులు. ఏడుపు ఓ మంచి వర్కౌట్‌ అని హామీ ఇస్తున్నారు. వెక్కివెక్కి ఏడవడం మనుషులకు మాత్రమే సాధ్యం అని గుర్తుచేస్తున్నారు.ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే శరీరంలోని కండరాలు బిగుసుకుంటాయి. చాలా రకాల వ్యాయామాలు, ధ్యాన పద్ధతులు ఈ కండరాల పట్టు సడలించి శరీరానికి విశ్రాంతిని ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. కానీ ఏడ్చేటప్పుడు, మనకు తెలియకుండానే బిగిసిన కండరాలన్నీ వదులవుతాయి. తనువుతో పాటు మనసు కూడా తేలికపడుతుంది. తల్లి కడుపులో ఉన్న శిశువు, బయట వాతావరణంలోకి అడుగుపెట్టగానే తనంతట తానుగా ఊపిరి పీల్చుకోవాలి. ఒక్కసారిగా ఏడవడం వల్ల, ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేందుకు సిద్ధపడతాయి. ఆ ఏడుపుతో పాటు ముక్కు, నోట్లో ఉన్న ద్రవాలు బయటకి వచ్చేస్తాయి. ఇది పెద్దలకు కూడా వర్తిస్తుంది. ఏడ్చేటప్పుడు మనకు తెలియకుండానే గుండెల నిండా ఊపిరి తీసుకుంటాం, శ్వాస వేగం నిదానిస్తుంది. కఫం కరిగిపోతుంది. ఏడవడం వల్ల మూడ్‌ మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం ఓ అరవై మందిని ఎంచుకున్నారు. వాళ్లకి గుండెల్ని పిండేసే రెండు సెంటిమెంటల్‌ సినిమాలు చూపించారు. వాళ్లలో ఓ 28 మంది ఎమోషనల్‌ సన్నివేశాలలో కంటతడి పెట్టుకుంటే, మిగతావాళ్లు అంతలా చలించలేదని గుర్తించారు. సినిమా పూర్తయ్యాక కర్చీఫులు తడిపిన ప్రేక్షకులు, తమ మనసు చాలా తేలికగా ఉందని చెప్పారు. మిగతావాళ్లు పెద్ద తేడా లేదని పెదవి విరిచారు. గంటన్నర తర్వాత కూడా కన్నీటిరాయుళ్ల మూడ్‌ హాయిగానే ఉన్నట్లు తేలింది. దాదాపు 90 శాతం సందర్భాలలో, ఏడుపు మన మూడ్‌ని మెరుగుపరుస్తుందని మరో పరిశోధనలో రుజువైంది.ఎవరన్నా చనిపోయినప్పుడు, ఏడ్చేయమంటూ
కుటుంబ సభ్యులను బలవంతం చేస్తారు. ఇలా ఏడవడం వల్ల శరీరంలోని మాంగనీస్‌, పొటాషియం వంటి ఖనిజాలు ప్రొలాక్టిన్‌ వంటి హార్మోనులు విడుదల అవుతాయి. అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఏడవడాన్ని రికవరీ థెరపీగా పేర్కొంటారు.
****ఆడవాళ్లే ఎందుకు?
ఓ నివేదిక ప్రకారం ఆడవాళ్లు మగవారి కంటే అయిదు రెట్లు ఎక్కువ సందర్భాలలో ఏడుస్తారట. దీనికి ప్రత్యేకించి నివేదిక అవసరం లేదనుకోండి. పైగా ఏడ్చే సమయం, మగవారితో పోలిస్తే దాదాపు రెట్టింపు ఉంటుంది. ఇంతకీ ఆడవారు ఎందుకంత ఎక్కువగా ఏడుస్తారు? హార్మోన్లలో ఉండే తేడాల వల్లనే! మగవారిలో ఉండే టెస్టోస్టెరోన్‌ ఏడుపును ఆపే ప్రయత్నం చేస్తే, ఆడవారిలో ఉండే ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్‌ అనే హార్మోనులు వారిని ఒత్తిడిని వదిలించేసుకోమని ప్రోత్సహిస్తాయి. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్‌ మరింత చురుగ్గా ఉంటాయి. అందుకే వారు మరింత త్వరగా కన్నీటి కుండలను ఒలికించేస్తుంటారు.
*ఏడుపు విషయంలో ఆడమగ తేడాలకి స్థానిక సంస్కృతి కూడా కొంత పాత్ర పోషిస్తుంది. మగవాళ్లు ఏడవకూడదనే కనిపించని కట్టుబాటేదో అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే నైజీరియా, ఘనా లాంటి దేశాల్లో మగవాళ్లు మరింత తక్కువగా ఏడవటాన్ని గమనించారు. కానీ ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నదని చెబుతున్నారు. 9/11 లాంటి సంఘటనలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ప్రతిదీ మన చేతిలో లేదనీ, జీవితం ఊహించినదానికంటే సున్నితమైందనే గ్రహింపు మొదలైంది. అందుకే జండర్‌ తేడాలు లేకుండా అందరూ తమ మనసును సేదతీర్చుకునేందుకు ఏడుపు అనే ఓదార్పును ఎంచుకుంటున్నారట. ఒబామాలాంటి దేశాధ్యక్షులు సైతం విషాద వార్తలను వెల్లడించేటప్పుడు, బహిరంగంగానే కన్నీరు పెట్టుకోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
**ఆనంద బాష్పాలు
బాధలో ఏడిస్తే వేదన మటుమాయం అవుతుంది. అదే సంతోషంలో ఏడిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. ఆ సంతోష క్షణాలు మరికొంత కాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. ఆరగాన్‌ అనే శాస్త్రవేత్త చెప్పిన విషయమిది. ఆనంద బాష్పాలు కూడా లూసిన్‌ ఎన్‌కెఫలిన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయట. ఇది నొప్పి మాత్రతో సమానంగా ప్రభావం చూపుతుంది. తట్టుకోలేని బాధకైనా, విపరీతమైన సంతోషానికైనా మన మెదడులోని హైపోథాలమస్‌ అనే భాగం ఒకేలా స్పందించడమే ఈ ఆనంద బాష్పాలకు కారణం అంటున్నారు ఆరగాన్‌!
**ఇలా ఏడవండి!
ఏడుపు మంచిది కదా అని మాటిమాటికీ కుమిలి కుమిలి ఏడవాల్సిన పని లేదు. మనసు డిప్రెషన్‌లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. కానీ ఎప్పుడన్నా ఓసారి మనసులో బరువు మరీ ఎక్కువగా ఉంది ఏడిస్తే బాగుండు అనుకున్నప్పుడు ఇలా చేసి చూడమంటున్నారు కౌన్సెలర్లు.
***నలుగురిలో ఏడవటం నామోషీ కాబట్టి ఓ ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోండి. బెడ్‌రూమ్‌ దగ్గర నుంచి షవర్‌ వరకు అది ఎక్కడైనా కావచ్చు. ఏకాంతమే కాదు, మధ్యలో మీ దృష్టిని మరల్చే పరిస్థితులు కూడా లేకుండా చూసుకోండి
ఈ మధ్య కాలంలో అమితమైన బాధకి గురిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. అలాంటిదేదీ గుర్తుకు రాకపోతే పాత ఫొటోలు చూడటం, విషాదకరమైన సంగీతాన్ని వినడం, ట్రాజెడీ సినిమాలు చూడటం లాంటివి కూడా కన్నీళ్లని రాజేస్తాయి.
*గుండెల్లో ఉన్న బాధలన్నీ కరిగిపోయేలా, తనివి తీరేలా ఏడవండి. ఏడుస్తున్న కొద్దీ మీ మనసు తేలికపడటాన్ని గ్రహించండి.కాసేపటికి ఏడుపు నిదానంగా దానికదే ఆగిపోతుంది. అంతేకానీ బలవంతంగా దాన్ని ఆపుకొనే ప్రయత్నం చేయవద్దు.
*ఏడ్చేసిన తర్వాత కూడా చాలామంది ఏమిటిది చిన్నపిల్లవాడిలా ఏడ్చాను అంటూ పశ్చాత్తాప పడిపోతుంటారు. అలాంటి గిల్టీ ఫీలింగ్స్‌ ఏవీ పెట్టుకోవద్దు. మీలో వచ్చిన మార్పును ఆస్వాదించండి.
*నవ్వు నాలుగు విధాలా చేటు అంటారు. కానీ, ఏడుపు మాత్రం నలభై విధాలా రైటు అని ఒప్పుకోవాల్సిందే. ఏడుపు మన బాధను తరిమేస్తుంది. బంధాలు విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదంలో కన్నీరే ఫెవిక్విక్‌లా మారి మనసుల్ని కలిపేస్తుంది. ఎదుటి వ్య బాధలో ఉన్నప్పుడు మనం పెట్టే కన్నీరు ‘నీకు నేను తోడుగా ఉన్నాను’ అనే భరోసా కల్పిస్తుంది. అదీ ఇదీ అని ఏముంది. కన్నీరు జీవితంలో ఉన్న ప్రతి మలినాన్నీ కడిగి పారేస్తుంది. కొత్తజీవితాన్ని అందించే అమృతంలా పనిచేస్తుంది. అందుకే అప్పుడప్పుడూ కాసేపు ఏడవండి బాబులూ!