DailyDose

ఆల్టో అద్భుత రికార్డు-వాణిజ్యం

ఆల్టో అద్భుత రికార్డు-వాణిజ్యం

* ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తయారుచేసే ఆల్టో కారు తిరుగులేని రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 40 లక్షల యూనిట్లు అమ్ముడైన ఆల్టో, దేశంలో ఇన్ని యూనిట్లు అమ్ముడైన ఏకైక మోడల్ గా ఘతన సాధించింది. ఆల్టో కారును మధ్యతరగతి ప్రజల ముచ్చటైన కారుగా పేర్కొంటారు. ఎందుకంటే అందుబాటులో ఉండే దీని ధర ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ప్రారంభ ధర రూ.3 లక్షలు కాగా, దీంట్లో టాప్ మోడల్ ధర రూ.4.36 లక్షలు మాత్రమే. మార్కెట్లో ఈ ధరల శ్రేణిలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఆల్టో అమ్మకాల పరంగానూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆల్టో కారును మారుతి సుజుకి 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

* నిషేధిత చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ కు సంబంధించి సంచలన విషయం మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది.  ఈ మేరకు టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ ‌డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

* దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపన్ను వ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారికత లభించే విధంగా ఓ కొత్త వేదికకు శ్రీకారం చుట్టినట్లు కేంద్రం ప్రకటించింది. ‘పారదర్శక పన్ను విధానం’ను ఉదయం 11 గంటలకు ప్రధాని వీడియో సమావేశ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

* ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ‘మోటో రేజర్‌ 5జీ’ పోల్డబుల్‌ ఫోన్‌ విడుదల కానుంది. ఇది తమ కంపెనీ నుంచి రానున్న తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ అని సంస్థ తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.38 సమయంలో నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,355 వద్ద, సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 38,505 వద్ద ఉన్నాయి. ఇక్లోరక్స్‌ సర్వీసెస్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఐడీఎఫ్‌సీఎల్‌, కేపీఆర్‌ మిల్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ షేర్లు లాభపడుతుండగా.. సుజ్లాన్‌ ఎనర్జీ, ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, యస్‌బ్యాంక్‌, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, అరబిందో ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

* కరోనా వైరస్‌ చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌ ధర మరింత తగ్గింది. ‘రెమ్‌డాక్‌’ పేరుతో జైడస్‌ క్యాడిలా సంస్థ దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో లభిస్తుందని జైడస్‌ ప్రకటించింది. 100 ఎంజీ పరిమాణం గల ఒక వయల్‌ ధర రూ.2800 అని ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ కంపెనీలు విడుదల చేసిన రెమిడెసివిర్‌ ధరతో పోలిస్తే ఇది తక్కువని సంస్థ వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఔషధ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కొవిడ్‌ ఔషధాన్ని దేశవ్యాప్తంగా పటిష్టమైన సరఫరా వ్యవస్థ ద్వారా అందిస్తామని సంస్థ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ తెలిపారు.

* లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన తర్వాత కంపెనీల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వడంతో నియామకాల పరిస్థితి కాస్త మెరుగైంది. జూన్‌తో పోలిస్తే జులైలో ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ ఆధారంగా తెలుస్తోంది. ఈ సూచీ ప్రకారం.. జూన్‌లో 1,208 ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడగా, జులైలో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 1,263గా నమోదైంది. అయితే 2019 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో నియామకాల ప్రకటనలు 47 శాతం తక్కువగానే ఉండటం గమనార్హం. నౌకరీ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌కు వచ్చే ఉద్యోగ ప్రకటనల ఆధారంగా నియామకాల పరిస్థితి ఎలా ఉందో నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీ అంచనా వేస్తుంది.

* అమెరికాలో మీడియా దిగ్గజం సమ్నర్‌ రెడ్‌స్టోన్‌ (97) మృతిచెందారు. వయాకామ్‌ సీబీఎస్‌ ఇంక్‌.కు దశాబ్దాల పాటు నేతృత్వం వహించిన రెడ్‌స్టోన్‌ మంగళవారం రాత్రి తనువు చాలించినట్లు ఆయన కంపెనీలు బుధవారం ప్రకటించాయి. పలు భారీ స్థాయి టేకోవర్ల ద్వారా మీడియా సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారు. 1980ల్లో వయాకామ్‌నును బలవంతపు టేకోవర్‌ ద్వారా పొందిన రెడ్‌స్టోన్‌ కేబుల్‌ టెలివిజన్‌లో ప్రధాన కంపెనీగా ఎదిగారు. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ అందులో భాగమే. ఆ తర్వాత ఆయన పారామౌంట్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లను కొనుగోలు చేయడంతో పాటు సీబీఎస్‌తో వాటిని విలీనం చేశారు. గతేడాది వయాకామ్‌, సీబీఎస్‌లను తిరిగి జతచేసి వయాకామ్‌ సీబీఎస్‌గా మార్చారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై కొన్ని వదంతులు వచ్చాయి. అయిదేళ్ల కిందట ఆయన మానసిక పరిస్థితి దృష్ట్యా ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగి.. గౌరవ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

* నాలుగేళ్ల కిందట మొబైల్‌ వ్యాపారాన్ని నిలిపివేసిన తర్వాత మళ్లీ మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లోకి వచ్చింది. బుధవారం సర్ఫేస్‌ డ్యూయో అనే సరికొత్త రెండు తెరలుండే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. సెప్టెంబరులో అమ్మకాలు మొదలయ్యే ఈ ఫోన్‌ ధర 1399 డాలర్లు(దాదాపు రూ.1,05,000). సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ కంటే మరింత ఎక్కువ ఉపయోగాలు ఈ ఫోన్‌తో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ అంటోంది. రెండు వేర్వేరు యాప్‌లు లేదా రెండు వెబ్‌పేజీలు ఒకే సారి వినియోగించుకోవచ్చని తెలిపింది. ఉదాహరణకు ఒక తెరపై అమెజాన్‌ కిండిల్‌ యాప్‌లో పుస్తకాన్ని చదువుతూనే, మరో తెరపై నోట్స్‌ తీసుకోవచ్చని తెలిపింది.