Fashion

కంచి పట్టు ఎందుకు అంత ఖరీదు?

కంచి పట్టు ఎందుకు అంత ఖరీదు?

పట్టు అంటేనే కంచి పట్టు! బీరువాలో ఎన్ని చీరలున్నా, కంచిపట్టు స్థానం కంచిపట్టుదే! ఆ అరల్లో వీఐపీ గ్యాలరీలా కంచిపట్టు చీరలను ప్రత్యేకంగా దాచుకుంటారు మహిళలు. వార్డ్‌రోబ్‌ తీసిన ప్రతిసారీ ఆమె, ఒకసారైనా తడిమి మురిసిపోతుంది. భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుంటూ సంబరపడుతుంది. ఆ మెరుపు బంగారం, జరీ బంగారం! సింగారించుకున్న పడతి కూడా.. బంగారు బొమ్మే! తమిళనాట పుట్టినా.. ప్రపంచ నలుమూలలకూ చేరింది కంచిపట్టు. చారెడు కండ్ల మీనాక్షులు ఈ పట్టులో కంచి కామాక్షిలా మెరిసిపోతారు.
****కాంచీపురం కామాక్షి దయగల తల్లి. అమ్మ కన్నులు అమృతం కురిపిస్తాయని నమ్మకం. అందులో ఓ అమృత బిందువు కంచి పట్టుపై పడిందేమో! అందుకే ఈ పట్టుకు చిరంజీవత్వం వచ్చిందేమో!! తమిళనాడు రాజధాని చెన్నైకి 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాంచీపురం. ఇక్కడే ప్రాణం పోసుకుంటుంది కంచి పట్టు. వీటినే కాంజీవరం పట్టు చీరలనీ పిలుస్తారు. కంచికి దగ్గర్లోని వేగావతి నదీ జలాలతో ఈ చీరలకు రంగులద్దుతారు. ఆ నీటి ప్రభావమే ఈ వైభోగమంతా అని భావిస్తారు కంచి నేతన్నలు. ఒకప్పుడు, ఐదారు రంగులత్లో మాత్రమే లభించే కంచిపట్టు.. ఇప్పుడు యాభై రంగుల్లో మెరిసిపోతోంది. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా మార్పుచేర్పుల్ని స్వాగతిస్తూ.. ఈ తరానికీ చేరువైందీ సంప్రదాయ పట్టు.
**సహజమైన పట్టు..
కంచిపట్టు.. బంగారమంత స్వచ్ఛం! వెన్నెలంత సహజం. శతాబ్దాల చరిత్ర వీటి సొంతం. పట్టు పురుగుల నుంచి తీసే సహజసిద్ధమైన పట్టుకు, బంగారు జరీ కలిపి మగ్గంపై నేస్తారు. కర్ణాటక పట్టు, సూరత్‌ బంగారు జరీ కలబోత ఈ కళనేత. చీర, కొంగు, అంచులను విడివిడిగా నేసి మూడింటినీ కలిపే సంప్రదాయం కాంచీపురం పట్టు నేతన్నలది. ప్రకృతిలోని సమస్త వర్ణాలను సమ్మిళితం చేసినట్టు ఉంటాయీ చీరలు. మొదటిసారి కట్టినప్పుడు గరుకుగా అనిపించినా.. తర్వాత మెత్తదనాన్ని సంతరించుకుంటాయి. చలికాలంలో వెచ్చని స్పర్శనూ, వేసవిలో చల్లటి అనుభూతిని ఇవ్వడం మరో ప్రత్యేకత. అందుకే కంచిలో నేసే చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆరు మీటర్ల పొడవు.. ఎనిమిది వందల గ్రాముల నుంచి కిలో బరువుతో ఈ చీరలను నేస్తారు. ఒక గ్రాము, రెండు గ్రాముల బంగారం చీరలు కూడా నేస్తున్నారు.
**మార్కండేయుడే మూలపురుషుడు
పురాణాల ప్రకారం.. కంచి పట్టు నేతకారులు మార్కండేయ మహాముని సంతతికి చెందినవారని చెబుతారు. మార్కండేయుడు దేవతల నేతకాడు. కమలాల పోగులను దారంగా చేసుకుని.. అతి సున్నితమైన, మహా సుందరమైన వస్త్రాలను అల్లి, ముక్కోటి దేవతలకూ ముస్తాబులో సహకరించేవాడట. ఇప్పటికీ స్థానిక దేవాంగ, సాలె కులాలవారు మార్కండేయ మహర్షికి దండం పెట్టుకున్న తర్వాతే.. నేత పనిని ప్రారంభిస్తారు.
**ఇదీ పద్ధతి..
కాంచీపురం చీరలను శుద్ధమైన మల్బరీ పట్టుతో నేస్తారు. మల్బరీ పట్టును పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి, జరీని గుజరాత్‌ నుంచి తెప్పిస్తారు. చీర నేయడం మాత్రం కాంచీపురంలోనే. చీర నేతకు షటిల్‌ని ఉపయోగిస్తారు. నేత పనివాళ్లు కుడివైపు పని చేస్తే ఎడమ వైపు షటిల్‌ పని చేస్తుంది. చీర అంచు రంగు, డిజైన్‌లు చీర మధ్య భాగంలో కంటే భిన్నంగా ఉంటాయి. చీర కొంగును వైవిధ్యంగా నేయడం ఇక్కడ ప్రత్యేకత. మొదట విడిగా నేసి, తర్వాత దానిని చీరకు కలుపుతారు. చీర.. కొంగు కలిసే చోటును జిగ్‌జాగ్‌ లైన్‌ అంటారు. కచ్చితమైన కాంచీపురం పట్టు చీరకు.. దాని అంచు విడివిడిగా నేసి కలుపుతారు.
**భౌగోళిక గుర్తింపు..
కంచి పట్టు చీరలకు భౌగోళికమైన గుర్తింపు ఉంది. సూర్యుడు, చంద్రుడు, రథాలు, నెమళ్లు, చిలుకలు, హంసలు, సింహాలు, నాణాలు, మామిడి పండు, ఆకులు .. ఇలా అనేక కళాత్మక నమూనాలతో నేస్తారు. మల్లెమొగ్గలు చతురస్రాకార లేదా వృత్తాకార చట్రం మధ్యలో ఉండేట్లు నేస్తారు. ఈ చీరను స్థానికంగా ‘మల్లినాగ్గు’ అని పిలుస్తారు. మరొక శైలిలో చీర అంతా సమాంతర రేఖలు విస్తరించి ఉంటాయి. ఇలా ఆకర్షణీయంగా నేసిన ‘పల్లూ’ చీరలు రాజా రవివర్మ చిత్రాలలోనూ, మహాభారత, రామాయణ గాథలతోనూ కనువిందు చేస్తాయి.
***కంచి ైస్టెలింగ్‌..
పెండ్లి కూతురి ముస్తాబులో కంచిపట్టు చీర ఉండాల్సిందే. ఈ చీరలకి మగ్గం వర్క్‌ చేసిన బ్లౌజ్‌ ధరిస్తే వధువు మహారాణిలా కనిపిస్తుంది. ఈ చీరలను లెహంగాలుగా కూడా కుట్టిస్తున్నారు. ఓణీ నెట్‌తో కలిపి ైస్టెలిష్‌ లుక్‌ తీసుకొస్తున్నారు. కొందరు దుపట్టాలు, ఓణీలుగా కూడా ఈ కంచి పట్టు ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా రిచ్‌ లుక్‌ను తీసుకొస్తుంది. లాంగ్‌గౌన్‌లా కూడా కంచి పట్టు చీరను డిజైన్‌ చేసుకోవచ్చు. పాత తరం కంచి పట్టు చీరలు ఈ గౌన్లకు మరింత ఆకర్షణను తీసుకొస్తాయి. వీటికి కట్‌ వర్క్‌తో చేసిన దుపట్టా వాడాలి. మగ్గం వర్క్‌ చేసిన వెయిస్ట్‌ బెల్ట్‌ వాడితే సూపర్‌ లుక్‌ సొంతం అవుతుంది.