NRI-NRT

కోవిడ్‌పై అమెరికా సరికొత్త నిర్ణయం

కోవిడ్‌పై అమెరికా సరికొత్త నిర్ణయం

కొవిడ్‌ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను అమెరికా మరోసారి సవరించింది. కరోనా వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం(సీడీసీ) తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, కరోనా సోకిన వ్యక్తులకు ఆరడుగులలోపు 15నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితేనే కొవిడ్‌ టెస్ట్‌కు వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా నెగటివ్‌ రిపోర్టు వచ్చినంత మాత్రాన వైరస్‌ సోకలేదనుకోవడంగా భావించవద్దని, తర్వాతి కాలంలో వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వెల్లడించింది. అందుకే, లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోనట్లుయితే పదిరోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారు లక్షణాలు లేకున్నా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గతంలో సీడీసీ ప్రకటించింది. అంతేకాకుండా కరోనా సోకిన వారితో కలిసినట్లు అనుమానం ఉన్నా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. లక్షణాలు లేనివారు కూడా వైరస్‌వ్యాప్తికి కారణమవుతారని నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సీడీసీ అభిప్రాయపడింది. ఈ పరీక్షల ద్వారా కరోనా వైరస్‌ను వీలైనంత త్వరగా గుర్తించి వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది. అయితే, తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో మాత్రం లక్షణాలు లేనివారు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోనవసరం లేదని చెప్పడం గమనార్హం.