Politics

మేము అహోరాత్రులు శ్రమిస్తుంటే…ఏందివయ్యా మీ లొల్లి?

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అహోరాత్రులు కష్టపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజలంతా తమ జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. శాసనసభలో కరోనాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. వైద్యసేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా మరణాలను దాచేస్తున్నామంటూ విమర్శలు చేస్తున్నారని.. వాటిని ఎవరైనా దాచేస్తారా? ఎవరైనా మృతిచెందితే ఆయా కుటుంబసభ్యులు, బంధువులకు తెలియదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మొదట్లో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడ్డామని.. ఆ తర్వాత త్వరగానే దాని నుంచి బయటపడినట్లు చెప్పారు. అన్‌లాక్‌ తర్వాత ఇతర రాష్ట్రాల కంటే ఆర్థికంగా రికవరీలో ముందంజలో ఉన్నామని.. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు. డబ్బులకు గతిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి మించి ఇంకేదీ తమకు ప్రాధాన్యం కాదని సీఎం స్పష్టం చేశారు.