DailyDose

ప్రధాని కార్యాలయ అధికారిణిగా ఆమ్రపాలి-తాజావార్తలు

* యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

* మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రంగప్రవేశం చేశారు. కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేసి వివరాల సేకరణ ప్రారంభించారు. ఆ ఇద్దరూ బినామీ పేర్లతో అడ్డగోలు ఆదాయార్జనకు దిగినట్లు అనుమానించి.. ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. దాఖలాల సేకరణ అనంతరం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలున్నాయి. కోట్లాది రూపాయల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుండటంతో స్వయం ప్రేరితంగా కేసు దాఖలు చేసినట్లు కర్ణాటక- గోవా విభాగ ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీసీబీ కస్టడీలో ఉన్న వీరేశ్‌ఖన్నా, రాహుల్‌, ప్రశాంత్‌ రంకా, ప్రతీక్‌శెట్టినీ విచారిస్తారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.

* ‘‘సమంతా’’ నువ్వు చాలా అందంగా ఉంటావు.. క్వీన్‌లా ఉంటావు అంటుంటారు చాలా మంది. కానీ, నేనేం గొప్ప అందగత్తెని కానని చెబుతుంటా. మేకప్‌ చేసి, మంచి కాస్ట్యూమ్స్‌ వేసి కెమెరా ముందు పెడితే నా వయసున్న అమ్మాయిలంతా అందంగానే ఉంటారు. కాలేజీ రోజుల్లో అందంపై బాగా ఆసక్తి ఉండేది. రానురానూ దానిపైనున్న మోజు పూర్తిగా తగ్గిపోయింది. రెండు, మూడేళ్లు పోతే ఈ అందం, నాజూకుదనం ఏమైపోతాయో? కాబట్టి దాని గురించి నేనేం పట్టించుకోను. ప్రతి వ్యక్తికీ క్యారెక్టర్‌ ముఖ్యం. అది ఎప్పటికీ మారదు. అందుకే దాని గురించే ఆలోచిస్తుంటా’’.

* పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, వాస్తావాధీన రేఖ అంశాలపై చర్చపెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్ కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా పీఎం-కేర్స్‌ నిధులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. భారత్‌- చైనాల మధ్య లద్దాఖ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నప్పటికీ చైనా కంపెనీలు పీఎం కేర్స్‌కు నిధులెలా ఇస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

* కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. దిల్లీ అల్లర్ల కేసులో సహ కుట్రదారుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుతోందని విమర్శించారు. దిల్లీ అల్లర్లుకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

* నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైకాపా మారిపోయిందని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజాప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతలకు భయం పట్టుకుందన్నారు.

* నిర్వాహకులు చేసిన తప్పిదానికి ఓ విద్యార్థిని జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్)’ పరీక్ష రాయకుండా కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన వరంగల్‌ పరిధిలోని హన్మకొండలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నిఖాత్‌ ఫాతిమా అనే విద్యార్థిని నీట్‌ పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలిసి అద్దె కారులో హన్మకొండ వచ్చింది. హాల్‌ టికెట్‌లో పరీక్షాకేంద్రం అడ్రస్‌ ఏవీవీ కళాశాల, వరంగల్‌ అని ఉండటంతో అక్కడికి వెళ్లింది. అయితే అక్కడ పరీక్షా కేంద్రం లేదని తెలియడంతో కంగుతింది. అధికారుల తప్పిదంతోనే తాను పరీక్ష రాయలేకపోయానంటూ అక్కడి నుంచి కన్నీళ్లతో వెనుదిరిగింది.

* ఏపీలో హిందూ ఆలయాలకు వెళ్లే పేద భక్తులను లూటీ చేయడం ఆపాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. భగవంతుణ్ణి సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తితిదే బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌ సతీసమేతంగా ఎందుకు పాల్గొనట్లేదని ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ‘సనాతన స్వదేశీ సేన’ సంస్థను స్థాపించామన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, వాస్తావాధీన రేఖ అంశాలపై చర్చపెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్ కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా పీఎం-కేర్స్‌ నిధులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. భారత్‌- చైనాల మధ్య లద్దాఖ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నప్పటికీ చైనా కంపెనీలు పీఎం కేర్స్‌కు నిధులెలా ఇస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోందని తెలిసి కూడా, ఆ దేశం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటూ మోదీ ప్రకటన విడుదల చేసి దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని జైరాం మండిపడ్డారు.

* మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. కరోనా వైరస్‌తోపాటు రాజకీయ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొంటానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టంచేశారు. కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనావైరస్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌, తాజాగా కంగనా వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ భాజపా ఎదురుదాడికి దిగింది. కంగనాపై కాకుండా కరోనావైరస్‌పై పోరాడాలని భాజపా హితవు పలికిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పందిస్తూ.. రాష్ట్రప్రజలనుద్దేశించి ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.

* కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. దిల్లీ అల్లర్ల కేసులో సహ కుట్రదారుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుతోందని విమర్శించారు. దిల్లీ అల్లర్లుకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఫిబ్రవరి 24న ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.

* కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఇరాన్‌ మరో ముందడుగేసింది. ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ స్వతంత్రంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రి క్లినకల్‌ ట్రయల్స్‌ను విజయంతంగా పూర్తి చేసుకుంది. దీనిని ఇటీవల జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో మనుషులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మూడు దశల్లో ఈ ప్రయోగాలను జరపనున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇరాన్‌ ప్రభుత్వం కోరింది.

* అమెరికాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా చేపడుతున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరుపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రపంచంలో ఏ దేశం చేపట్టని విధంగా అమెరికా కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోందని ట్రంప్‌ వెల్లడించారు. బహిరంగ సభలు, రోడ్‌షోలతో బిజీగా ఉన్న ట్రంప్‌, ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కరోనా టెస్టులను అమెరికా భారీస్థాయిలో చేపట్టడం గొప్పవిషయమని నరేంద్ర మోదీ కూడా కొనియాడినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.

* 2018 దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆ తర్వాత కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయాడని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ ఆకాశ్‌చోప్రా అన్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున కెప్టెన్‌గా సేవలందించి ఆ లోటును భర్తీ చేసుకొని తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నాడని చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన చోప్రా.. ఈ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ జట్టు బలాబలాలపై స్పందించాడు. ఈ సందర్భంగా వార్నర్‌ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

* కొన్ని నిర్మాణ సంస్థలు విజయ్‌ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నాయని కథానాయకుడి బృందం పేర్కొంది. అలాంటి వారిని నమ్మొద్దని.. విజయ్‌ సినిమా అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. విజయ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారని చెప్పింది. ‘విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ.. నటీనటులను సంప్రదిస్తున్నాయి. విజయ్‌ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు. ఏదైనా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు’ అంటూ విజయ్‌ దేవరకొండ బృందం పేర్కొంది.

* సెప్టెంబర్‌ 14వ తేదీ నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్‌ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురషుకో విలేకర్లకు వెల్లడించారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌ టీకాలను పరీక్షల నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఇప్పుడు పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ తొలిబ్యాచ్‌లు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరుకొంటాయన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందకు రష్యా ఈ టీకాను విడుదల చేసిన వారానికి ఈ ప్రకటన వెలువడింది.