DailyDose

అమరావతికి నిధులిచ్చి…ఇప్పుడు మాకు సంబంధం లేదంటారా?-తాజావార్తలు

Jayadev Questions Modi Govt In Parliament - Telugu Breaking News

* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో గానీ లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే అర్హత 248 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆయన లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే నిధులిచ్చిందన్న ఆయన.. ఇప్పుడు తమకు సంబంధంలేదంటే ఆ సొమ్ములకు, ప్రజలకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసేవిధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లులను గట్టిగా వ్యతిరేకించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ, వాస్తవానికి వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం బిల్లులో ఉందన్నారు. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని విమర్శించారు. రైతులు తమ సరకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు… నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటి సరకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని సీఎం వివరించారు.

* కరోనా మహమ్మారితో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. తాజాగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన ప్రకటన మరింత కలవరానికి గురిచేస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ(సెకండ్‌ వేవ్‌) ప్రారంభమైందని తెలిపారు. పరోక్షంగా మరోసారి కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చునని సంకేతాలు ఇచ్చారు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు తిరిగి విజృంభించాయని.. అదే తరహాలో బ్రిటన్‌ కూడా రెండో దశ ఎదుర్కోవడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భౌతిక దూరం వంటి కొవిడ్‌ కట్టడి నిబంధనల్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దనే నిబంధనలు అక్కడ ఇప్పటికే అమలులో ఉన్నాయి.

* ఇప్పటికే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన రష్యా.. తాజాగా మరో ఔషధానికి అనుమతించింది. మోతాదు లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ‘కరోనావిర్‌’ అనే ఔషధాన్ని తీసుకొచ్చింది. వచ్చే వారం నుంచి దీన్ని సాధారణ మెడికల్‌ షాపుల్లో విక్రయించేందుకు అనుమతించింది. ఈ మందును ఆర్‌-ఫార్మ్‌ అనే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. మేలో అవిఫవిర్‌ అనే జనరిక్‌ ఔషధానికి కూడా రష్యా అనుమతించింది. అయితే, దీన్ని సాధారాణ మందుల దుకాణాల్లో కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడాలని సూచించింది. ఈ రెండు ఔషధాలు ఫవిపిరవిర్‌ ఆధారంగా అభివృద్ధి చేసినవే.

* చైనా ఇంటిలిజెన్స్‌ విభాగానికి రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది వరకే ఈ కేసులో ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రాజీవ్‌ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ, మరో నేపాలీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరిద్దరూ సమాచారాన్ని చేరవేసిన సదరు జర్నలిస్టుకు పెద్ద మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు.

* అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమైంది. దీంతో ఆరు నెలల తర్వాత అసలు సిసలైన క్రికెట్‌ సందడి మొదలైంది. యూఏఈ వేదికగా 53 రోజుల పాటు జరగనున్న ఈ సుదీర్ఘ టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో ముంబయి, చెన్నై తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, చాలా మంది ఆటగాళ్లు నెలల పాటు ఆటకు దూరమవడంతో తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రాక్టీస్‌ సమయం తక్కువైనా ధోనీసేన ముంబయితో పోటీపడేందుకు సిద్ధమైంది.

* ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన సర్కార్‌.. మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు పిలిచి.. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికాలేదని.. ఎక్కువ విలువైన పనుల్లో గుత్తేదార్లు తక్కువగా పాల్గొంటారని చెప్పారు. ఎన్డీబీ ద్వారా చేపట్టిన పనులను 26 ప్యాకేజీలుగా పిలిచామనీ.. మరింత మందికి అవకాశం కల్పించేందుకే రీటెండర్లు పిలిచినట్టు స్పష్టంచేశారు. ఈ టెండర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే రీటెండర్లకు పిలుస్తున్నామన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్‌ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.

* లక్ష రెండు పడక గదుల ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమకు లక్ష రెండు పడకగదుల ఇళ్లు చూపిస్తామని చెప్పి రెండ్రోజులు చూపించి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు.

* తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్‌కు సంబంధించి ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సమాజానికి అరిష్టమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. అది అధ్యాత్మిక ద్రోహం అని మండి పడ్డారు. ఎవరైనా స్వామివారిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారని గుర్తు చేశారు. మతం అంటనే నమ్మకం.. మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమమేనని స్పష్టం చేశారు.

* అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదన్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. శనివారం దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ….వెంకన్నకు అన్యాయం చేసిన వాళ్లెవరూ బాగుపడిన దాఖలాలు లేవని హెచ్చరించారు.

* దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రత్యేకంగా జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కొవిడ్ బారిన పడినందున కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు పార్లమెంట్‌ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్నెళ్ల వ్యవధిలో తొలిసారిగా ఈ నెల 14న సమావేశమైన పార్లమెంట్‌ ఉభయసభలు అక్టోబర్‌ 1వరకు కొనసాగుతాయని తొలుత కేంద్రం ప్రకటించింది.

* బెంజ్‌ కారు నడిపినంత మాత్రాన ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు అడిగాడు కాబట్టే సరదాగా ఆ కారు నడిపాడని జయరాం వివరించారు. బెంజ్‌ కారు బహుమానంగా ఇచ్చారంటూ తనపై అభియోగం మోపుతున్నారనీ.. 2019 డిసెంబర్‌లో కార్తీక్‌ కారు కొన్నాడని తెలిపారు. కానీ ఈ కేసు నమోదైంది 2020 జూన్‌లో అని చెప్పారు.

* తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

* తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎమ్‌సీ) రూ.2 కోట్లు నష్ట పరిహారంగా ఇవ్వాలని బాలీవుడ్ కంగనా రనౌత్‌ ముంబయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చట్టపరంగా చేపట్టిన కూల్చివేతకు నష్టపరిహారం చెల్లించమని కోరుతూ కంగన చట్టాన్ని అవమానించారని బీఎమ్‌సీ హైకోర్టుకు విన్నవించింది. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కంగనా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని శుక్రవారం కోర్టును కోరింది.

* ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్ ‌ప్లాయిడ్ మృతి అనంతరం నిరసనకారులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనకారులను ‘దుండగుల ముఠా’ అంటూ మండిపడ్డారు. శ్వేతజాతీయుడైన పోలీసు కర్కశత్వానికి మే 25న ఫ్లాయిడ్ బలైన సంగతి తెలిసిందే.

* అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గంపై అక్కడి కోర్టులో దావా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా యాప్‌పై నిషేధం విధించారని ఫిర్యాదులో పేర్కొంది. నిషేధం ఎత్తివేసేలా ట్రంప్‌ పాలకవర్గాన్ని ఆదేశించాలని ఫెడరల్‌ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్‌పై టిక్‌టాక్‌ కోర్టుకు వెళ్లడం ఇది రెండోసారి.