Food

మధుమేహుల్లారా….కిళ్లీ కిల్స్!

Diabetics Must Stay Away From Pan

మధుమేహంతో బాధపడుతున్నారా? కిళ్లీ నమిలే (పాన్‌) అలవాటు కూడా ఉందా? అయితే వెంటనే మానెయ్యండి. ఇది జీవక్రియలపై విపరీత ప్రభావం చూపుతోందని, నడుం చుట్టుకొలత పెరగటానికి దారితీస్తోందని భారతీయ వైద్యుల సంఘం పత్రికలో ప్రచురితమైన కథనం హెచ్చరిస్తోంది. సాధారణంగా మధుమేహ నియంత్రణలో ఆహారం, వ్యాయామం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే మార్చుకోదగిన జీవనశైలి అంశాల్లో కిళ్లీ అలవాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిళ్లీతో మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు తైవాన్‌ అధ్యయనంలో బయటపడటం.. కిళ్లీలో వాడుకునే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో తేలటం గమనార్హమని వివరిస్తున్నారు. ప్రత్యేకించి యువతరంలో మధుమేహానికీ కిళ్లీ నమలటానికీ సంబంధం ఉంటుండటం మరింత ఆందోళన కలిగిస్తోందనీ చెబుతున్నారు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి కిళ్లీ అలవాటు కూడా ఉందేమో చూడటం తప్పనిసరని.. ఒకవేళ కిళ్లీ అలవాటు వదల్లేని స్థితిలో ఉంటే మానసిక నిపుణులకూ సిఫారసు చేయాలని సూచిస్తున్నారు.
* పాన్‌ అలవాటుతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు సైతం పెరుగుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. ఇందుకు తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావొచ్చని భావిస్తున్నారు. వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బు కూడా ఎక్కువగానే కనబడుతోంది. పొగ అలవాటు, మద్యపానం, మధుమేహం వంటి ఇతరత్రా ముప్పు కారకాలను మినహాయించినా వక్కలతో దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పు కనబడుతుండటం గమనార్హం. అంతేకాదు, వక్కలు ఎక్కువగా తినేవారిలో విటమిన్‌ డి స్థాయులు కూడా తక్కువగానే ఉంటున్నట్టు తేలటం విశేషం.