Movies

ఈషా రెబ్బా ఛాన్స్ కొట్టిందబ్బా

ఈషా రెబ్బా ఛాన్స్ కొట్టిందబ్బా

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకంటే పొరుగు రాష్ట్రాల వారికే అవకాశాలు ఇస్తారని టాక్‌ ఉంది. ఇందులో కొంతవరకూ నిజం ఉందనిపించినా.. ఇక ఈ పరిస్థితి మారనుందని అంటోంది ఈషా రెబ్బా. అందం, అభినయం ఉన్నా తెలుగులో సరిపడా అవకాశాలు రాని ఆమె ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ ఛాన్స్‌ కొట్టేసింది. తెలుగులో పలు సినిమాల్లో నటించినా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడు ఉత్తరాదిన సత్తా చాటేందుకు హిందీ సినిమాల్లో అడుగుపెట్టనుంది. మహిళా సాధికారత నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఈషా రాజస్థానీ అమ్మాయి పాత్రలో పోషించనుందట. సోనమ్‌కపూర్‌ సోదరుడు హర్షవర్దన్‌కపూర్‌ సరసన అమె కనిపించనుందని సమాచారం. జాతీయ పురస్కార గ్రహీత రాజ్‌సింగ్‌ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో 2013లో అరంగేట్రం చేసిందీ వరంగల్‌ పిల్ల. ఆ తర్వాత అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. రాగల 24గంటల్లో సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో ఈషా రెబ్బా నటన చూసిన బాలీవుడ్‌ నిర్మాత ఒకరు.. ఆమెను ఆడిషన్‌కు పిలిచి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి.