Fashion

ముక్కుపుడక కోసం కుట్టించుకోనక్కర్లేదు

ముక్కుపుడక కోసం కుట్టించుకోనక్కర్లేదు

ముక్కుపుడక.. మగువ అందాన్ని పెంచే ముచ్చటైన ఆభరణం. ముక్కుపుడక వెనుక ఎన్నో కథలు.. ప్రాచీన గాథలు! ఫ్యాషన్లు వస్తుంటాయీ, పోతుంటాయీ! జేజమ్మ, అమ్మమ్మ, అమ్మ.. తరాలూ మారిపోతుంటాయి. ముక్కుపుడక మాత్రం.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఫ్యాషనే. రకరకాల డిజైన్లు, పరిమాణాల్లో ముక్కుపుడకలు అందుబాటులో ఉంటున్నాయి.
*ముక్కుపుడకను సంస్కృతంలో నాసాభరణంగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ముక్కు దూలాన్ని కుట్టించుకునే సంప్రదాయం ఉండేది. అలా ధరించే ఆభరణాన్ని అడ్డబాస అనీ బులాకీ అనే వ్యవహరిస్తారు. బులాకీ చివర్లో మంచి చిన్న ముత్యం వేలాడుతూ ఉండేది.
*బంగారంతో చేసినవే కాదు.. వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగినవి కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. పువ్వులు, పక్షులు, ఆకులు, చేపలు.. ఇలా రకరకాల ఆకృతుల్లో లభిస్తున్నాయి. జీన్స్‌ మీద ముక్కెర నప్పదు.. అన్నది అపోహ మాత్రమే. చిన్నసైజులో.. ఒకటి లేదా రెండు రాళ్ళు పొదిగిన పుడకలు ఆధునిక వస్ర్తాల మీద కూడా బావుంటాయి.
*మహిళల సౌభాగ్యానికి గుర్తు ముక్కుపుడక. దక్షిణాది మహిళలు ముక్కుకు కుడివైపున పెట్టుకుంటే, ఉత్తరాది మహిళలు ఎడమవైపున అలంకరించుకుంటారు. అంతే తేడా! మరాఠీ మహిళల అలంకరణలో ముక్కుపుడక స్థానం మరీ ప్రత్యేకం. తాళిబొట్టు మాదిరిగానే ముక్కుపుడక కూడా మాంగళ్య సౌభాగ్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు. పెండ్లి సమయంలో ధరించిన ముక్కుపుడకని ఎట్టిపరిస్థితుల్లోనూ తీయరు. బెంగాలీల ముక్కుపుడకలు దాదాపుగా గాజులంత పెద్దగా ఉంటాయి.
*గిరిజనులు ధరించే ముక్కు పుడకలను ఆధునిక మహిళలు చాలా ఇష్టపడుతున్నారు. కోరికోరి ‘ట్రైబల్‌ నోస్‌ రింగ్‌’ ఎంచుకుంటున్నారు. ముక్కుపుడక పేరుతో తెలుగులో ఓ సినిమా కూడా ఉంది. భానుచందర్‌ కథా నాయకుడు. సుహాసిని, విజయశాంతి కథా నాయికలు.
*ముక్కుపుడకల్లో చాలా రకాలున్నాయి. రెండు ముక్కులను కలుపుతూ పెట్టే ముక్కెర ఒకానొక సమయంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం పెండ్లిళ్ల సమయంలో రింగ్‌ వంటి ముక్కుపుడకకి చైన్‌ అమర్చి జడలో తగిలించుకోవడం ఫ్యాషన్‌.
*అప్పట్లో రెండు వైపులా ముక్కెర ధరించేవారు. ముక్కుకు ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది కాబట్టి, నెలవంక ఆకృతిలోని ముక్కెరనూ, కుడివైపున సూర్యనాడి ఉంటుంది కాబట్ట్టి, సూర్యాకారంలోని ముక్కెరనూ అలంకరించుకునేవారు. కృష్ణుడి అందచందాలను వర్ణిస్తూ నాసాగ్రే నవ మౌక్తికం.. అన్నారు కాబట్టి, ఒకప్పుడు పురుషులు కూడా ముక్కెర ధరించేవారేమో!
*ముక్కుపుడక పెట్టుకోవాలంటే ముక్కు కుట్టించుకోవడం తప్పనిసరి అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడా అవసరంలేదు. ముక్కు కుట్టుకోకుండానే అందమైన ముక్కుపుడకల్ని ధరించవచ్చు. ఇందుకోసం రకరకాల డిజైన్లలో ప్రెస్సింగ్‌ ముక్కుపుడకలు లభిస్తున్నాయి.