Politics

భాజపా వాళ్లు…తెలంగాణాను కూడా అమ్మేస్తారు

భాజపా వాళ్లు…తెలంగాణాను కూడా అమ్మేస్తారు

భారతీయ జనతా పార్టీ దేశాన్ని అమ్మేస్తోందని, ‘సేల్‌ ఇండియా’ ఆ పార్టీ కొత్త విధానమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను భాజపా తెగనమ్ముతోందని, ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవకాశమిస్తే హైదరాబాద్‌ను గంపగుత్తగా అమ్మేస్తుందని ఆరోపించారు. గోల్కొండ కోట, చార్మినార్‌నూ విక్రయిస్తుందని ధ్వజమెత్తారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విశేష కృషితో ఆరేళ్లలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలను భాజపా కేంద్ర మంత్రులంతా ప్రశంసించగా.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జావడేకర్‌ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెరాస, మజ్లిస్‌ సర్కార్‌ అని జావడేకర్‌ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. దీనిద్వారా ఆ పార్టీ ముస్లిం వ్యతిరేకత బయటపడుతోందని విమర్శించారు. తాము తెలంగాణకు, హైదరాబాద్‌కే ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నామని.. భాజపాకు ఆ దమ్ముందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మతతత్వాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ఆ పార్టీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మజ్లిస్‌ పార్టీతోనే అసలు పోటీ అని తెలిపారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భాజపాపై 50 ప్రశ్నలు సంధించారు.