Business

అమెరికాలో భారీ ఆర్థిక సంక్షోభం-వాణిజ్యం

అమెరికాలో భారీ ఆర్థిక సంక్షోభం-వాణిజ్యం

* అమెరికా మరోసారి చరిత్రాత్మక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆ దేశ కాబోయే ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ తెలిపారు. వీలైనంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోకపోతే మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తమ బృందంపై ఉన్న బాధ్యతను గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ తమ పాలక వర్గంలోని ఆర్థిక బృందాన్ని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యెల్లెన్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తమపై ఉన్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమించనున్నారో వివరించారు.

* భారత్‌లోని రెండో అతిపెద్ద ఇంధన సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ నియంత్రణ స్థాయి వాటాల కొనుగోలుకు మూడు బిడ్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే మైనింగ్‌ దిగ్గజం వేదాంతా 52.98శాతం ప్రభుత్వవాటాల కొనుగోలుకు నవంబర్‌ 18న దీని కొనుగోలుకు ఈవోఐను వెల్లడించింది. మిగిలిన రెండు గ్లోబల్‌ ఫండ్స్‌ సంస్థలు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థ బిగ్‌ బాస్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా కొనుగోలుకు టాటా గ్రూప్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలీబాబా గ్రూప్‌ లిమిటెడ్‌ వాటాలు కలిగి ఉన్న బిగ్‌ బాస్కెట్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు సుమారు 1.3 బిలియన్‌ డాలర్లను వెచ్చించేందుకు టాటా గ్రూప్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. అయితే, అటు టాటా గ్రూప్‌ గానీ, బిగ్‌బాస్కె‌ట్‌ గానీ ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.

* దేశీయ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. క్రితం సెషన్‌లో భారీ లాభాల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు.. చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 37 పాయింట్ల స్వల్ప నష్టంతో 44,618 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 5 పాయింట్లు లాభపడి 13,114 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, టైటాన్‌ షేర్లు లాభపడగా.. కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, శ్రీసిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.

* నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నట్లు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రైతులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లకు న్యాయం చేయాలని పేర్కొంది. కనీస మద్దతు ధర పొందడం రైతులకు న్యాయపరమైన హక్కుగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. శాంతియుతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే దేశంలో ఆహార భద్రతతోపాటు ఇతర జాతీయ ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని పేర్కొంది.

* జపాన్‌కు చెందిన నిస్సాన్‌ సంస్థ భారత్‌లో సరికొత్త మోడల్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.9.35 లక్షల వరకు ఉంటుంది. ఇది కేవలం ప్రారంభ ఆఫర్‌ ధర మాత్రమే. డిసెంబర్‌ 31 కంటే ముందు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. మాగ్నైట్‌ను సీఎంఎఫ్‌-ఏప్లస్‌ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై రేనాల్ట్‌ ట్రైబర్‌ కూడా తయారైంది. ఈ కారు ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్‌,ఎక్స్‌వీ,ఎక్స్‌వీ ప్రీమియం అనే నాలుగు ట్రిమ్‌ల్లో లభించనుంది. తర్వాత వీటిలోని ఫీచర్లను బట్టి మరిన్ని రకాలుగా వర్గీకరించనుంది. ఇంజిన్‌, ట్రాన్స్‌మిషిన్లలో కూడా ఆప్షన్లను ఇవ్వనుంది.