Politics

కేటీఆర్ నిరాశ. భాజపా కులాసా-GHMC-TNI బులెటిన్

కేటీఆర్ నిరాశ. భాజపా కులాసా-GHMC-TNI బులెటిన్

* హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్‌ పరిధిలో గతంలో ఎన్నడూ లేనంత బలాన్ని చేజిక్కించుకుంది. చాలా చోట్ల స్పష్టమైన ఆధిక్యం కనబరచిన భాజపా 48 స్థానాల్లో గెలిచింది. ప్రచారంలోనూ, విమర్శలను తిప్పికొట్టడంలోనూ అధికార పార్టీకి పోటీగా మారిన భాజపా తెలంగాణలో తన ఉనికిని బలంగా చాటుకుంది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలకే పరిమితమైంది. అలాంటిది ఈసారి నుంచి గ్రేటర్‌లోనూ, రాష్ట్రంలో తమ ఉనికిని చాటుతూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది.

* జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాండిది. కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఈ విజయంతో తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ గెలుపు బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్‌ను నింపింది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఎన్నికల కమిషనర్‌, డీజీపీలకు అంకితం ఇస్తున్నానని అనడం గమనార్హం. పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీ పక్షంగా ఉండి అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు.

* తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, గ్రేటర్‌లో తమ పార్టీ బలం పుంజుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని, లేకపోతే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేవాళ్లమన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరో 20-25 స్థానాలు అదనంగా వస్తాయని భావించినట్లు చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ తెరాసే గెలుస్తుందని చెప్పాయని.. కొన్ని డివిజన్లలో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు. బీఎన్‌ రెడ్డిలో 18, మౌలాలి 200, మల్కాజిగిరి 70, అడిక్‌మెట్‌లో సుమారు 200, మూసాపేట్‌లో సుమారు 100 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యామన్నారు. కనీసం 10-12 స్థానాల్లో 200-300 ఓట్ల వ్యవధితో తెరాస ఓటమి చెందిందని కేటీఆర్‌ చెప్పారు. అయితే పార్టీ శ్రేణులు దీనికి నిరాశ చెందాల్సిన అవసరంలేదని.. ఎక్కువ సీట్లు వచ్చిన అతిపెద్ద పార్టీగా తెరాసకు ప్రజలు అవకాశం కల్పించారన్నారు. ఫలితాలను పార్టీలో విశ్లేషించుకుంటాని తెలిపారు. మేయర్‌ పీఠంపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. జీహెచ్‌ఎంసీ పాలకమండలికి ఇంకా 2నెలల సమయముందని బదులిచ్చారు. అన్ని అంశాలను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. పార్టీకి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌కు వచ్చి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన తెరాస నేతలు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

* మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పరిస్థితిని వలసలు దారుణంగా దెబ్బతీశాయి. ఇవి కూడా భాజపాకు బలం చేకూర్చాయి. గతంలో మేయర్‌గా చేసిన అనుభవం ఉన్న బండ కార్తీకరెడ్డి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ అతని కుమారుడు రవికుమార్‌యాదవ్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. గత తెరాస ప్రభుత్వంలో శాసనమండలి స్పీకర్‌గా ఉన్న స్వామిగౌడ్‌ కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇవి కూడా పరోక్షంగా కొంతవరకు భాజపా మెరుగుపడేందుకు దోహదపడ్డాయని చెప్పొచ్చు.