Agriculture

ఈ దేశి బియ్యం రకాలతో మంచి ఆదాయం

ఈ దేశి బియ్యం రకాలతో మంచి ఆదాయం

ఏం తింటున్నాం అనే దానికన్నా, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఆకుకూరల నుంచి బియ్యం వరకూ అన్నీ రసాయనాలతో నిండిపోతున్నాయి. దేశంలో సుమారు రెండు వందల రకాల పురుగు మందులను వరి పంటలపై చల్లుతున్నట్టు అంచనా. మరి, ఇంకెక్కడి ఆరోగ్యం? రసాయనాల రూపాల్లో ఉన్న విషం పంట పొలం నుంచి వంటింట్లోకి, వంటింట్లో నుంచి ఒంట్లోకి ప్రవేశిస్తున్నది. ఈ పెను ప్రమాదం నుంచి బయట పడటానికి ప్రత్యామ్నాయ ‘దేశీ వరి’ రకాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. సంప్రదాయ పంటగా, ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే ఈ ధాన్యం ఇప్పుడు రైతులకూ లాభాలు కురిపిస్తున్నది.
* స్వల్ప కాలంలోనే అధిక దిగుబడి రావాలనే ఆశతో వరి పైరుపై విశృంఖలంగా క్రిమిసంహారక మందులు చల్లేస్తున్నాడు రైతు. ఈ కారణంగా బియ్యంలో ఆరోగ్య గుణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, కాస్త వెనక్కి వెళ్లి చూసుకుంటే.. రాజులు తిన్నది దేశీ అన్నమే, ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసిన ధాన్యమే. ఆయుర్వేద గుణాలు కలిగిన దేశీ రకాలు ఆరోగ్యాన్నీ, బలాన్నీ ఇస్తాయి. మారుతున్న జీవన శైలికి తగ్గట్టు వస్తున్న కొత్త కొత్త రోగాలకు చక్కని పరిష్కారం ఈ దేశీ బియ్యమే అంటున్నారు నిపుణులు.
1.రక్తశాలి (రెడ్‌ రైస్‌)
ఇవి అరుదైన బియ్యం. ఎరుపురంగులో ఉంటాయి. సుమారు మూడు వేల ఏండ్ల నుంచి వాడుకలో ఉన్నాయి. అత్యంత పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగినవి. వాతం, పిత్తం, కఫం.. ఈ మూడింటిని నియంత్రిస్తాయి. ఈ బియ్యాన్ని ఎర్రశాలి, చెన్నేల్లు అని కూడా అంటారు. ఎరుపు రకాల్లో ఇవి చాలా విలువైనవి.
2.కర్పూకవుని
ఈ బియ్యం నలుపు రంగులో ఉంటాయి. పోషకాలు పుష్కలం. 18 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇందులోని జింక్‌, ఐరన్‌ రక్త సరఫరాను పెంచుతాయి. బరువు తగ్గడానికి ఈ రకం ఉపయోగపడుతుంది. క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బుల నివారణకు సహకరిస్తాయి. వీటిని ‘యాంటీ ఏజింగ్‌ రైస్‌’ అని కూడా అంటారు.
3.మైసూర్‌ మల్లి
ఈ బియ్యం లేత ఎరుపు రంగులో ఉంటాయి. పోషకాలు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలం.
4.కుళ్లాకార్‌
ఈ బియ్యం ఎరుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. సంవత్సరానికి మూడు సీజన్లలో పండించవచ్చు. తెలుపు బియ్యం కంటే దీంట్లో జింక్‌, యాంటి ఆక్సిడెంట్లు, ఐరన్‌ ఎక్కువ. ఈ బియ్యం గర్భిణులకు చాలా మంచివి. సాధారణ ప్రసవానికి తోడ్పడుతాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మాంగనీసు, విటమిన్‌ బి-6, క్యాల్షియం, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, పొటాషియం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి.
5.పుంగార్‌
ఈ బియ్యాన్ని ‘పుంగార్‌ అరిసి’ అని కూడా అంటారు. ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి తమిళనాడుకు చెందిన దేశీ రకం. రైతులు పూర్తి ఆర్గానిక్‌ పద్ధ్దతిలో పండిస్తారు. గర్భిణుల ఆరోగ్యానికి మంచివని అంటారు. మహిళల హార్మోన్ల సమస్యలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, వీటిని ‘విమెన్‌ రైస్‌’ అని కూడా పిలుస్తారు.
6.రత్నచోడి
ఈ బియ్యం తెలుపు సన్నరకం. అపార పోషక విలువలుంటాయి. కండపుష్టికి, శరీర సమతౌల్యానికి ఉపయోగపడుతాయి. శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి.
7.నవార
ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. గేట్‌వే ఆఫ్‌ కేరళగా పేరు గాంచిన పాలక్కడ్‌లో ఇవి ప్రసిద్ధం. అక్కడికి వెళ్లిన పర్యాటకులకు కనిపించే పంటలన్నీ ‘నవార’ రకమే. వీటిని ఇతర ప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చు. ఈ విత్తనం త్రేతాయుగం నాటిదని అంటారు. ఆయుర్వేద వైద్యంలో నవారా రైస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అనేక మూలికలతో ఈ బియ్యాన్ని కలిపి ఔషధాలు తయారు చేస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ లెవెల్స్‌ నియంత్రించడానికి పని చేస్తాయి. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతాయి. కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యాన్ని బాడీ మసాజ్‌లో వాడుతారు. సంతాన సాఫల్యానికి సహకరిస్తాయి. ఈ బియ్యాన్ని ‘ఇండియన్‌ వయాగ్రా రైస్‌’ అని కూడా అంటారు. అన్ని వయసుల వారూ తినవచ్చు. అయితే, ఒక పూట మాత్రమే తినాలి. మొలకలు రావడం ఈ బియ్యం ప్రత్యేకత.
8.నారాయణ కామిని
ఈ బియ్యం సన్నరకంగా ఉంటాయి. ఇందులో పోషకాలు, పీచు పదార్థాలు, క్యాల్షియం ఎక్కువ. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
9.ఘని
ఈ బియ్యం చిన్నగింజ రకం. అధిక పోషకాలు, క్యాల్షియం, ఐరన్‌ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. వర్షాకాలానికి అనువైన విత్తనం. చేనుపై గాలికి పడిపోదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
10.ఇంద్రాణి
ఈ బియ్యం తెలుపు సన్నరకం. సువాసన కలిగి ఉంటాయి. బి, బి3, బి6 విటమిన్లు పుష్కలం. మాంగనీస్‌, ఐరన్‌, క్యాల్షియం ఎక్కువ. గుండె వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతాయి. పిల్లలు ఇష్టపడి తింటారు. ఈ బియ్యం ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడుతాయి. జీర్ణక్రియనూ మెరుగు పరుస్తాయి.
11.చిట్టి ముత్యాలు
ఈ బియ్యం తెలుపు చిన్న గింజ రకం. కొంచెం సువాసన కలిగి ఉంటాయి. ప్రసాదాలు , పులిహోర, బిర్యానీలకు బాగుంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
12.పంచరత్న
ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని ప్రసాదిస్తాయి. అమైనో ఆమ్లాలు అపారం. ఔషధ విలువలు ఉంటాయి.
13.కుంకుమ సాలి
ఈ రకం బియ్యం తెలుపు రంగులో ఉంటాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
14.కెంపు సన్నాలు
ఈ బియ్యం ఎరుపు సన్నరకం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, కార్బొహైడ్రేట్స్‌, క్యాల్షియం, జింక్‌ , ఐరన్‌, తదితర పోషకాలు ఉంటాయి.
15.దేశీ బాసుమతి
ఈ బియ్యం తెలుపు పొడవు రకం. సువాసన కలిగి ఉంటాయి. బిర్యానీలకు అనుకూలం.
16.దూదేశ్వర్‌, అంబేమెహర్‌
ఈ బియ్యం తెలుపు రంగులో ఉంటాయి. బాలింతల్లో పాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతాయి. తద్వారా పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీ పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి