NRI-NRT

మళ్ళీ వీసా ఆంక్షలు విధించిన ట్రంప్

Trump Imposes Visa Restriction Again For Second Time

అమెరికా కరోనా కేసులు, మరణాల విషయంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ పౌరులను వెనక్కు రప్పించుకునేందుకు నిరాకరిస్తున్న కొన్ని దేశాలపై.. వీసా ఆంక్షల నిషేధాన్ని అమెరికా నిరవధికంగా పొడిగించింది. గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆయా దేశాలపై డిసెంబర్‌ 31 వరకు నిషేధం అమలులో ఉంది. ప్రస్తుతం స్వైరవిహారం చేస్తున్న కొవిడ్‌-19 మహమ్మారికి తోడుగా.. ఆయా దేశాల వైఖరి వల్ల అమెరికన్‌ ప్రజల ఆరోగ్య సమస్యలు మరింత పెరగకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివరించారు. ఈ వీసా ఆదేశాలు, అధ్యక్షుడు ఉపసంహరించుకునేంత వరకు కొనసాగుతాయని అధికారిక ప్రకటనలో ఆయన వెల్లడించారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన విదేశీయులను వాపస్‌ పిలిచేందుకు నిరాకరిస్తున్న దేశాలను అగ్రరాజ్యం ముప్పుగా భావిస్తోంది. ఈ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. అందుకే సదరు దేశాలకు వీసా జారీ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో అధ్యక్షుడు ఏప్రిల్‌ 10న జారీ చేసిన ఆదేశాలు మరికొంతకాలం కొనసాగనున్నాయి. వీటి ప్రకారం ఆయా దేశాల పౌరులకు వీసాల జారీని తిరస్కరించే అధికారాన్ని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌, ప్రభుత్వ భద్రతా సంస్థ హోమ్‌ల్యాండ్‌‌ సెక్యూరిటీ సెక్రటరీలకు కల్పిస్తోంది.