Politics

జగన్ సర్కార్ రుణావేశం

YS Jagan Government Taking Loans In Huge Amounts

9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ తెచ్చిన అప్పు 80,600 కోట్లు
సర్కారుకు ఇదేం.. రుణావేశం?
వచ్చే 3 నెలల్లో మరో 30,900 కోట్లు
అప్పుడు ఏడాదిలోనే 1,11,500 కోట్ల కొత్త అప్పు
2020 నవంబరు చివరికి రెవెన్యూ లోటురూ.57,925 కోట్లు
రాష్ట్ర విభజన నాటికి రుణ భారం ₹.97వేల కోట్లు
2020 డిసెంబరు నాటికి రాష్ట్ర స్థూల రుణభారం 3.83 లక్షల కోట్లు
2020-21లో తొలి తొమ్మిది నెలల్లో తెచ్చిన రుణం 80,600 కోట్లు
జగన్‌ వచ్చాక తొలి ఆర్థిక సంవత్సరం చేసిన అప్పు 80,000 కోట్లు
చంద్రబాబు సగటున ఒక్క ఏడాదిలో చేసిన అప్పు 32,400 కోట్లు
చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో చేసిన అప్పు 1,62,000కోట్లు
వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు (2019 మార్చి) 2.59 లక్షల కోట్లు
భారీ రుణానికి ఆర్థికశాఖ సన్నాహాలు
రాష్ట్రస్థూల రుణ భారం 3.74 లక్షల కోట్లు
వస్తున్న ఆదాయం ఏమవుతోందో?తెస్తున్న అప్పులు ఎటు పోతున్నాయో?
అంతా సంక్షేమానికే అంటున్న సర్కారు
ఇప్పటికే తలకు 70వేల చొప్పున భారం
అప్పు దొరికితే వదలడం లేదు. ఎక్కడ, ఎలా, ఏ రూపంలో దొరికినా రెండోమాట లేకుండా తీసేసుకుంటున్నారు. అవి తీర్చకుండానే మళ్లీ అప్పులకు తయారయిపోతున్నారు. దీంతో రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అప్పుల సంక్షోభంలో కూరుకుపోతోంది. ‘రుణా’వేశంతో దూసుకుపోతోంది. కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.80,600 కోట్లు అప్పులు తెచ్చి తన అప్పుల రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరో మూడు నెలల్లో రూ.30 వేలకోట్లకు తగ్గకుండా రుణం సేకరించేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. అదే జరిగితే ఒక్క ఏడాదిలో తెచ్చిన అప్పులు లక్ష కోట్ల రూపాయలు దాటిపోతాయి.
ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రంలో కనిపించని అభివృద్ధి అప్పుల్లో మాత్రం కనిపిస్తోంది. ఆదాయం తగ్గితే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలన్న మౌలిక ఆర్థిక సూత్రాన్ని పక్కన పెట్టిన ఆర్థిక శాఖ అప్పులు పుట్టించేందుకు నానా తంటాలు పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల అప్పులు చేసిన ఆర్థిక శాఖ.. ఈ ఏడాది తన రికార్డు తానే బ్రేక్‌ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.80,600 కోట్ల అప్పులు తెచ్చింది. మరో మూడునెలల్లో రూ.30,900 కోట్లు అప్పు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేసిన రుణాలు రూ.1,11,500 కోట్లకు చేరనున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. రాబోయే మూడు నెలల్లో ఖజానాకు వచ్చే ఆదాయం కాకుండా అదనంగా నెలకు రూ.10,000 కోట్ల చొప్పున అప్పు తెచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది.
అప్పు చేస్తేనే…
అమరావతిని అటకెక్కించారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా రోడ్లు వేయడంలేదు. గతుకుల రోడ్లే గతి! రాష్ట్రానికి ఆస్తులు సమకూర్చే ‘క్యాపిటల్‌ ఎక్స్‌పెండించర్‌’ (మూలధన వ్యయం) పెద్దగా కనిపించడంలేదు. మరి… అప్పు చేసి తెస్తున్న వేల కోట్లు ఏం చేస్తున్నారు? ఆ సొమ్ములు ఎటు పోతున్నాయి? ఈ ప్రశ్నకు ప్రభుత్వం చెబుతున్న ఏకైక సమాధానం… ‘సంక్షేమం’. ఈ లెక్కన ప్రతినెలా ప్రభుత్వం రూ.8,955 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్న మాట! ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి పనీ అప్పులతోనే నడుస్తోంది. ఉచిత పథకాల కోసం.. .ఒక్క నవంబరు నెలలోనే రూ.13,000 కోట్ల అప్పులు చేశారు. ప్రస్తుతం అప్పు చేస్తే తప్ప ఒక్కపనీ చేయలేని పరిస్థితి నెలకొంది.
చెల్లింపులకే 35,000 కోట్లు
ప్రస్తుతం ప్రతి నెలా ఆర్థిక శాఖ అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపులకోసం 2,600 నుంచి 2,800 కోట్లు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి దాదాపు రూ.32,000 కోట్లు చెల్లిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ భారం 35,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక్కొక్కరిపై 70,000 భారం
వైసీపీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచే… పట్టపగ్గాల్లేకుండా అప్పుల వేట సాగిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర వాటా రుణభారం రూ.97 వేల కోట్లు కాగా… జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏకంగా 80 వేల కోట్లు అప్పు చేసింది. అంటే… రాష్ట్రావిర్భావం నుంచి ఐదు దశాబ్దాల్లో చేసిన అప్పును ఒక్క ఏడాదిలోనే చేసేశారన్న మాట!
ఇక 2020-21లో పాత రికార్డులను జగన్‌ సర్కారు బద్దలు కొట్టింది. 2020 నవంబరు నాటికి ఏపీ స్థూల అప్పు రూ.3,73,140 కోట్లకు చేరుకుందని కాగ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. డిసెంబరు నెలదీ కలిపితే… ఇది 3.83 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ మొత్తం అప్పును రాష్ట్రంలోని 5.39 కోట్ల మందికి విభజిస్తే ఒక్కొక్కరిపై రూ.70,000 వరకు భారం పడుతుంది.
దొరికినంత తెచ్చుకో!
2020-21లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.47,000 కోట్లు అప్పు సమీకరించవచ్చు. ఈ తొమ్మిది నెలల్లో రూ.36,000 కోట్లు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతించింది. మిగిలిన రూ.11,000 కోట్ల పరిమితిని చివరి త్రైమాసికంలో వాడుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కేంద్రం మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు రాష్ట్రాలకు నాలుగు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
ఇందులో ఏపీ రూ.17,500 కోట్లను వాడుకుంది. మున్సిపాలిటీల్లో సంస్కరణల ద్వారా మరో రూ.2,500 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్‌బీఐతో సంబంధం లేకుండా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ పేరుతో వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.23,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. ఇందులో రూ.14,700 కోట్లు అప్పు తెచ్చారు.
ఇంకా ఈ పరిమితి కింద రూ.8,300 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రూ.21,500 కోట్లు అప్పు తెచ్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 12,400 కోట్లు తెచ్చారు. ఇంకా 9,100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది.