WorldWonders

పశ్చాత్తాపంలో తండ్రి. నేనే శివుణ్ని అంటున్న తల్లి.

పశ్చాత్తాపంలో తండ్రి. నేనే శివుణ్ని అంటున్న తల్లి.

మూఢ భక్తితో రెండు రోజుల కిందట తమ ఇద్దరు కూతుళ్లను చంపుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తంనాయుడు ఏ1, తల్లి పద్మజ ఏ2గా పేర్కొన్నారు. నిందితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా.. పద్మజ నిరాకరించారు. ‘‘నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?. నా గొంతులో హాలాహలం ఉంది’’ అంటూ ఆసుపత్రిలోకి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసు వాహనం వద్దే పద్మజకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

‘చిన్నోడా సాయిదివ్యా.. పెద్దోడా అలేఖ్య లే.. నాన్న ఇంత బతిమాలుడుతున్నా కదా.. లెగండి అమ్మా’ అంటూ తండ్రి పురుషోత్తంనాయుడు బిడ్డలిద్దరి మృతదేహాలను పట్టుకొని విలపించడం అక్కడున్నవారందరినీ కలచి వేసింది. ‘మా చేతులతో మేమే మిమ్మల్ని చంపుకున్నామే’ అంటూ ఆ తండ్రి సోమవారం బోరుమన్నాడు. ఆదివారం మధ్యాహ్నం సాయిదివ్య (22)కు దెయ్యం పట్టిందని తల్లి పద్మజ డంబెల్‌తో కొట్టి చంపగా.. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు పెద్దకుమార్తె అలేఖ్య (27)ను నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చింది. ఆదివారం రాత్రి మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు సోమవారం ఆధారాలు సేకరించారు.

మృతదేహాలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పద్మజ అభ్యంతరం చెప్పినప్పటికీ.. తండ్రికి సర్దిచెప్పి ఆదివారం అర్ధరాత్రి తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇరుకుటుంబాలకు చెందిన బంధువులు రావడంతో వారి రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తవణంపల్లె మండలం కొండరాజుకాలువ నుంచి వచ్చిన బంధువులే ఏర్పాట్లంతా చేశారు. మృతదేహాలను నేరుగా పెద్దతోపులోకి తీసుకెళ్లారు. పురుషోత్తంనాయుడు అప్పటికీ అంతగా తేరుకోకపోవడంతో కారులో తీసుకొచ్చి సాయంత్రం 4.30 గంటలకు తలకొరివి పెట్టించారు. కుమార్తెల అంత్యక్రియలకు తల్లి పద్మజ హాజరు కాలేదు. తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేశామని రూరల్‌ సీఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఇంట్లోనే ఉంచి చికిత్స అందించిన తర్వాత అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పురుషోత్తంనాయుడు తమ్ముడు మదనపల్లె గ్రామీణ మండలంలో ఉపాధ్యాయుడిగా, అన్న వ్యవసాయం చేస్తున్నాడు. తన కుమార్తెలను కూడా ఉన్నత చదువులు చదివించాడు. పద్మజ అన్న మురళి ఐఓసీలో, మరొకరు ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తున్నారు. పురుషోత్తంనాయుడు మానవతా సంస్థలో, ఈషా ఫౌండేషన్‌లో సభ్యుడిగా ఉంటున్నారు. తన వేతనంలో పది శాతం ఈషా ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించాడని కుటుంబ సభ్యులు, తోటి అధ్యాపకులు చెబుతున్నారు.

అలేఖ్య తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ మతం రూపుమాసిపోతోందని.. శివుడు త్వరలో వస్తున్నాడని, చావు పుట్టుకలు తమ చేతుల్లోనే ఉన్నాయని సందేశాలు పెట్టింది. ఆ ఖాతాలో ఇటువంటి ఆధ్యాత్మిక సందేశాలే ఉన్నాయి. ఆమె పెట్టిన పోస్టులు సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న పురుషోత్తంనాయుడు ఈనెల 18 వరకు కళాశాలకు వచ్చాడని.. 19వ తేదీ నుంచి సెలవు పెట్టినట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌.వేణుగోపాల్‌ తెలిపారు. కళాశాలలో అందరితో బాగా ఉండేవారని, ఏరోజూ మానసిక సమస్యలున్నట్లు ప్రవవర్తించలేదని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండు రోజుల క్రితం కుమార్తెలకు అనారోగ్యంగా ఉందని.. మానసిక పరిస్థితి సక్రమంగా లేదని, ఎవరినైనా మాంత్రికుడ్ని పిలిపించాలని పురుషోత్తంనాయుడు తనతో చెప్పారని బి.కొత్తకోటలో ఉంటున్న విశ్రాంత అధ్యాపకుడు గౌరీశంకర్‌ చెప్పారు. పట్టణానికి చెందిన మంత్రాలు వేసే ఓ వ్యక్తిని వారి ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు పిల్లలకు తాయిత్తులు వేయించాం. అవి కట్టే సమయంలో ఇంట్లో దెయ్యం ఆత్మలు తిరుగుతున్నాయి అంకుల్‌.. మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్లండని సాయిదివ్య కోరడంతో ఏం కాదని ఆమెకు సర్ది చెప్పా. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆయన వివరించారు.