Food

ఈ బొగ్గు తినవచ్చు

ఈ బొగ్గు తినవచ్చు

బొగ్గుల మీద మొక్కజొన్నలు కాలుస్తాం, పాలను మరిగిస్తాం… కానీ ఆ బొగ్గుల్ని చాకొలెట్లుగా చప్పరిస్తారా అనిపించడం సహజమే. ఆఖరికి వేపుడులోని కూరగాయముక్కలో, పిండివంటలో కాస్త మాడిపోతేనే… మసిబొగ్గుల్లా ఉన్నాయవి… అవతల పారేయండి… అనడమే మనకు తెలుసు. కానీ పాశ్చాత్యదేశాల్లో ముఖ్యంగా ఇటలీ, చుట్టుపక్కల దేశాల్లో కేకుల్నీ కుకీల్నీ బొగ్గుల్లా చేసుకుని తింటుంటారు. క్రిస్‌మస్‌ రోజుల్లో ఈ రకమైన క్యాండీల్ని చేసి పిల్లలకు బహుమతులుగా ఇస్తారట. అచ్చం బొగ్గులా ఉండే వీటినే కార్బన్‌ డాల్సె డెలా బెఫానా, డి జుకెరొ, రిసెట్టా… వంటి పేర్లతో పిలుస్తుంటారు.పూర్వం శాంటాక్లాజ్‌ తాత మాదిరిగానే బాగా వయసైపోయిన ఓ బామ్మ చీపురూ బుట్టా చేతపట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ క్రిస్‌మస్‌ తరవాత చేసుకునే ఎపిఫనీ అనే వేడుకలో భాగంగా మంచి పిల్లలకు చాకొలెట్లనీ క్యాండీలనీ, చెడు ప్రవర్తన కలిగి ఉన్న పిల్లలకి బొగ్గుల్నీ వెల్లుల్లిపాయల్నీ ఇచ్చేదన్న నమ్మకం ఐరోపా దేశాల్లో ఉండేది. **క్రీ.పూ. ఆరో శతాబ్దంనాటి ఈ సంప్రదాయమే క్రమంగా క్రిస్‌మస్‌ రోజుల్లో పిల్లలకు ఇతర చాక్లెట్లతోబాటు ఈ బొగ్గు చాక్లెట్లనీ బహుమతిగా ఇవ్వడంగా మారింది. మొదట్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఆ బొగ్గు క్యాండీలు, నెట్టింటి పుణ్యమాని అందరికీ పరిచయమయ్యాయి. పైగా వీటిని కొన్ని వెబ్‌సైట్లలోనూ విక్రయించడంతో చిన్నాపెద్దా అందరికీ ఈ తియ్యని బొగ్గుల్ని తినడం క్రేజీగా మారింది. యూట్యూబుల్లో బ్లాగుల్లో చూసి వీటిని ఇంట్లోనే స్వయంగా చేసి మరీ పిల్లలకు పంచుతున్నారు. పంచదార, గుడ్లు, బేకింగ్‌ పౌడర్‌, మైదా, ఈస్ట్‌, కొద్దిగా బొగ్గుపొడి వేసి చేసే ఈ క్యాండీలను రకరకాల రుచుల్లో చేస్తుంటారు. అదీగాక, బొగ్గూ ఆరోగ్యానికి మంచిదే అన్న కారణంతో కొబ్బరిపెంకుల్ని కాల్చిన యాక్టివేటెడ్‌ చార్కోల్‌ను ఇటీవల కొన్ని రకాల ఆహారపదార్థాల తయారీలో వాడటం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందులో భాగంగా ఔత్సాహిక షెఫ్‌లు ఈ సంప్రదాయ బొగ్గు క్యాండీలనూ రకరకాలుగా చేస్తున్నారు. కొన్ని గట్టిగా క్యాండీల్లా చప్పరించేలా ఉంటే, మరికొన్ని కేకు మాదిరిగా లోపల కాస్త మెత్తగా ఉండేలానూ ఉంటాయి. రాతి బొగ్గూ, గ్రానైట్‌ రాళ్లూ, కంకరా… ఇలా రకరకాల ఆకారాల్లో వీటిని తయారుచేస్తుంటారు. మొత్తమ్మీద ఈ తియ్యని బొగ్గుల్నీ కంకరనీ ప్లేటులో పెట్టి ఇంటికొచ్చినవాళ్లకుగానీ పెడితే, ఓ క్షణం వాళ్లకు ఏమీ అర్థంగాక- మీకేమైందో అనుకోవడమే కాదు, వివరించి చెప్పినా ఓ పట్టాన నమ్మరు… మీరు తిని చూపిస్తే తప్ప!