Politics

మదనపల్లె పిల్లలకు రాష్ట్రపతి పరీక్ష

మదనపల్లె పిల్లలకు రాష్ట్రపతి పరీక్ష

విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, వివిధ భాషలు నేర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. ఎంతోమంది విద్యార్థులు చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సత్సంగ్‌ విద్యాలయంలో చదివి ఉన్నతస్థాయికి వెళ్లారని గుర్తుచేశారు. ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా సత్సంగ్‌ ఫౌండేషన్‌లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు భారత యోగావిద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆశ్రమంలోని శివాలయం వద్ద నిర్వహించిన పూజలో పాల్గొని హారతి ఇచ్చారు. విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్సంగ్‌ ఫౌండేషన్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు వ్యాయామం అవసరమని.. విద్యార్థులు రోజూ ఉదయం యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా 6-10 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు, వృత్తి వంటి విషయాలను రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. మంచి విద్యాలయంలో చదువుతున్నారని, తనలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. విద్యార్థుల్లో ఒకరిద్దరితో సరదాగా సంభాషించారు. నువ్వు రోజూ వస్తున్నావా.. రావట్లేదని నాకు తెలిసిందని ఓ విద్యార్థినిని అడగ్గా తాను రోజూ వస్తున్నట్లు ఆమె చెప్పింది. మరో విద్యార్థినితో హిందీలో మాట్లాడగా సమాధానమిచ్చింది. నీ పేరు రాయగలవా అంటే రాసి చూపిస్తానంది. కార్యక్రమంలో పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సత్సంగ్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, అనంతపురం రేంజి డీఐజీ కాంతి రాణాటాటా, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌, సత్సంగ్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ తదితరులు పాల్గొన్నారు. సదుం మండలం గొంగివారిపల్లె వద్ద ఉన్న పీపల్‌ గ్రోవ్‌ స్కూలుకు చేరుకున్న రాష్ట్రపతి విద్యార్థులతో 30 నిమిషాల పాటు ముఖాముఖి నిర్వహించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఉదయం ఆయన అమరావతి నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా మదనపల్లెకు వచ్చారు. అక్కడి నుంచి చిపిలి హెలిపాడ్‌ వద్దకు వచ్చారు. బెంగళూరు నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో వచ్చిన రాష్ట్రపతికి ఆయన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట, చిత్తూరు ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి సత్సంగ్‌ ఫౌండేషన్‌కు వెళ్లగానే ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సత్సంగ్‌ ఫౌండేషన్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రపతికి దక్షిణాది వంటకాల రుచి చూపించేలా ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమం వంటగదిలోనే వీటిని తయారు చేయించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేశారు.