Politics

నిమ్మగడ్డ దెబ్బకు కొడాలి వివరణ-తాజావార్తలు

Kodali Nani Explains No Bad Intentions Towards SEC In Letter

* పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తృణమూల్‌కు గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీఎంసీ ఎంపీ దినేశ్‌ త్రివేది తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా నేడు ఆయన సభలో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది తెలిపారు.

* ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్‌ తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సొరంగం నుంచి ఇప్పటికే ఇద్దరిని రక్షించగా, మరో 30మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, వీటికి ప్రతికూల వాతావరణం తీవ్ర అడ్డంకిగా మారింది. ఈ దుర్ఘటన జరిగి ఆరు రోజులు అయినప్పటికీ కార్మికుల ఆచూకీ కోసం భారత ఆర్మీతో పాటు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా ముమ్మరం గాలింపు చేపట్టాయి.

* తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేటర్‌ హత్య కలకలం రేపింది. కాకినాడ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్ ను అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి హతమార్చారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం… కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కార్పొరేటర్‌ రమేష్‌, అతని స్నేహితులు సతీష్‌, వాసులతో కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్‌ ఫోన్‌ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. తన తమ్ముడి పుట్టిన రోజు అని, కేక్‌ కటింగ్‌కు రావాలని చిన్నా ఆహ్వానించగా .. రమేష్‌ తిరస్కరించారు. అంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేష్‌ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు. కార్పొరేటర్‌ను హత్య చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. తాడేపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఎస్‌ఈసీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై స్పందించిన కొడాలి నాని.. ఎస్ఈసీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఎస్‌ఈసీ పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టడంలో భాగంగానే మీడియా సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్‌ను తప్పు పట్టాలన్న దురుద్దేశాలు తనకు లేవని.. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై తనకు గౌరవం ఉందన్నారు. తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఎస్‌ఈసీకి మంత్రి విజ్ఞప్తి చేశారు.

* విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన బాట పట్టారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పల్లా దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… లక్ష కోట్ల విలువైన ప్లాంటు భూములను దోచుకునేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూములను దోచుకునేందుకే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఆరోపించారు. ఓబుళా పురం గనులు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. 32 మంది స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు.

* కులం, మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, రైతు బంధు అందుతోందని గుర్తు చేశారు. తెలంగాణలో మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఉందా అని కేటీఆర్‌ నిలదీశారు.

* ‘మూవింగ్‌ ఫార్వార్డ్‌ విత్‌ మెమొరీస్‌ ఆఫ్‌ మెయిడెన్‌ ఇయర్’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా గవర్నర్‌గా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళా సాధికారత సాకారమవుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, ఉపమేయర్‌ మహిళలే కావడం హర్షణీయమని చెప్పారు.

* రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 20న పీజీఈసెట్‌, జూలై 1న ఈసెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు టీఎస్‌ ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌, టీఎస్‌పీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉంది.

* దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. గతేడాది భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రైవేటు సంస్థలను ఆహ్వానించినా.. కరోనా పరిస్థితులు, అంతర్జాతీయంగా కుదేలైన మార్కెట్ల కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ఏడాది ఆ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్‌ పెట్టుబడుల ఉపసంహరణల ద్వారానే 1.70 లక్షల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు ఉన్నా స్వదేశీ ఉత్పత్తి నామమాత్రంగానే ఉందని మదనపడుతున్న మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, నిధుల ఉపసంహరణతో ఆ లోటు భర్తీ చేస్తామని ధీమాగా చెబుతోంది.
* చైనా.. యూకేల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్‌ లైసెన్స్‌ను బ్రిటన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు డ్రాగన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన బీబీసీ వరల్డ్ న్యూస్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. తమ కవరేజీ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా టెలివిజన్‌ అండ్‌ రేడియో రెగ్యులేటర్‌(ఎన్‌ఆర్‌టీఏ) గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

* ఘట్‌కేసర్‌ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కేసుకు సంబంధించి యువతిని ప్రశ్నించడంతో కొత్త కోణం వెలుగు చూసింది. తనను అపహరించి, అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది. తాజా సమాచారం ప్రకారం.. యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆమె అనుమతితోనే వారంతా ఏకాంతంగా గడిపినట్లు తెలుస్తోంది.

* ఏపీ రాజధాని అమరావతి పరిధిలో అసంపూర్తి భవనాల కోసం రూ.2,154 కోట్లు అవసరమని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలోని కమిటీ నివేదించింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం రూ.300 కోట్లు అవసరమని వివరించింది. బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీ కావాలని ఏఎంఆర్డీఏను ఆదేశించింది. అసంపూర్తి నిర్మాణాలు, నిధుల సమీకరణపై చర్చించాలని ఆదేశించింది. 70 శాతంపైగా పూర్తయిన భవనాలను పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. మార్చి రెండో వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

* రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఖాతాలను కట్టడి చేయాలన్న కేంద్రం ఆదేశాలను ట్విటర్ పాటించినట్లు తెలుస్తోంది. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం, ట్విటర్‌కు మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రోజున కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విటర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు కేంద్రం గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాకుండా భారత చట్టాలను పాటించాల్సిందేనని గురువారం ఐటీ శాఖ మంత్రి పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేశారు. తాజాగా ట్విటర్ కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ట్విటర్ స్పందించలేదు.

* నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తాము కొందరిలా ‘అల్లుళ్ల’ కోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ పేదల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈమేరకు బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు.

* తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా హామీల వర్షం కురిపించడం తెరాసకు పారిపాటిగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలను జానారెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ అనవసర ఆరోపణలు చేశారని.. నెల్లికల్‌ ఎత్తిపోతలకు తానే అనుమతులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస పూర్తిగా విఫలమైందన్నారు. రుణ మాఫీ, మూడెకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నందుకు అభినందిస్తున్నారని.. బంగారుతల్లి పథకాన్ని కల్యాణలక్ష్మిగా మార్చి అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపైనే కేసీఆర్‌ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని గెలిపిస్తే.. ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెరాస ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

* పోస్కో సంస్థకు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్యవర్తిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పోస్కో యాజమాన్యాన్ని కలిసేందుకు విజయసాయిరెడ్డి పుణె ఎన్ని సార్లు వెళ్లారో సాక్ష్యాలున్నాయన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు అయ్యన్న పాత్రుడు సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత నిధులు లేవంటున్నారని, పోస్కోకు మన రాష్ట్రంలో గనులు ఉన్నాయా? అని నిలదీశారు.ఈ సందర్భంగా పోస్కో కంపెనీ సీఎండీకి విజయసాయిరెడ్డి సన్మానం చేస్తున్న పోటోలను అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు. వైకాపా నాయకులు విశాఖ భూములను క్కొంటున్నారని, అందులో భాగంగానే ఇవాళ స్టీల్‌ప్లాంట్‌పై పడ్డారని అయ్యన్న విమర్శించారు.

* తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని ఖరసగుత్తిలో గిరిజన పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జమిలి గ్రామస్థులు నీళ్ల బిందెలు పట్టుకొని పొలాల వద్దకు వస్తుండటంతో.. వాహనం దిగి వారి వద్దకు వెళ్లారు. మీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్‌, రేషన్‌ సరకులు సమయానికి అందుతున్నాయా? ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి తదితర వివరాలను వాకబు చేశారు. అక్కడి స్థానికులు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ వారి సమస్యలను విన్నవించారు.