Business

5సెకన్లలో ₹20లక్షల రుణం-వాణిజ్యం

5సెకన్లలో ₹20లక్షల రుణం-వాణిజ్యం

* బంగారం కొనాలనుకునే వారికీ శుభవార్త. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12న తగ్గిన బంగారం ధరలు తర్వాత నాలుగు రోజులు స్థిరంగా ఉన్నాయి. మళ్లీ నాలుగు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.45,900కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ రేట్లు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

* దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఇక నుంచి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఎస్‌బీఐ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద కేవలం 5 సెకన్లలో 20లక్షల రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లోన్ కోసం వినియోగదారులు మిస్డ్ కాల్ లేదంటే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. దీనితో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. పెళ్లి, ఎమర్జెన్సీ, ఏదైనా ప్రొడక్టుల కొనుగోలు వంటి వాటికీ త్వరితగతిన రుణం లభిస్తుంది. ఈ విషయాన్నీ ఎస్‌బీఐ తన ట్విటర్ ద్వారా పేర్కొంది.

* పెట్రో ధర మంటలు వినియోగదారులను వణికిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు కూడా ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 15) దేశ వ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర 23-26 పైసలు, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల మేర ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.73కు పెరగ్గా డీజిల్ లీటరుకు రూ .79.35 (29 పైసల పెరుగుదల)కు చేరుకుంది. గత ఏడు రోజుల్లో, పెట్రోల్ ధర లీటరుకు 2.06 రూపాయలు పెరగగా, డీజిల్ రేటు లీటరుకు 2.56 రూపాయలు పెరిగింది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్‌ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 400 పాయింట్లు లేదా 0.77 శాతం నష్టపోయి 51,704 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా చివరకు 105 పాయింట్ల లేదా 0.68 శాతం క్షీణించి 15,208కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81గా ఉంది. ఇంట్రాడేలో 52,068 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ 51,600 వద్ద కనిష్ఠాన్ని తాకింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్ఐఎల్ తదితర సంస్థలు లాభాలను చూడగా.. నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్స్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి), కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.