Politics

తెమ్మంటే…తీసుకెళ్తున్నారు. నాది ప్రజాబలం.

తెమ్మంటే…తీసుకెళ్తున్నారు. నాది ప్రజాబలం.

ప్రత్యేక హోదా తెమ్మని అడిగితే.. విశాఖ ఉక్కునూ పోగొట్టే పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీˆ ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. ఉపకార వేతనాలు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్‌, చంద్రన్న బీమా నిలిపేశారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది రూ.10 వేలైతే.. లాక్కునేది రూ.30 వేలని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో శుక్రవారం రెండో రోజు ఆయన కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కుప్పం పట్టణం నుంచి శాంతిపురం, రామకుప్పం మీదుగా ర్యాలీగా వచ్చిన ఆయన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని నాకు చెబుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ అభిమానులు మిమ్మల్ని ఏదైనా చేస్తే తమ బాధ్యత కాదంటున్నారు. ఈ బెదిరింపులకు నేను భయపడాలా? నన్నే బెదిరిస్తావా? నీ చరిత్ర ఎంత? మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు. పోలీసులు లేకుండా వీధుల్లోకి రండి.. నేనూ వస్తాను.. ప్రజలే నన్ను రక్షించుకుంటారు. ప్రజాబలం శాశ్వతం.. పోలీసు బలం కాదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.