Politics

లోకేశ్ నోటికి ప్లాస్టర్ వేసుకో-తాజావార్తలు

లోకేశ్ నోటికి ప్లాస్టర్ వేసుకో-తాజావార్తలు

* మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడిన భాష బాధాకరం అన్నారు. ఇదే సమయంలో లోకేష్‌పైనా మండిపడ్డారు. లోకేష్ వాడుతున్న భాష పరమ నీచంగా ఉందన్నారు. చంద్రబాబు తన తనయుడి నోటికి ప్లాస్టర్ వేయాలని హితవు చెప్పారు. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. హుద్‌హుద్ తుపాన్ తర్వాత విశాఖ భూముల రికార్డులు తారుమారవ్వడం నిజం కాదా? అని చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అతిపెద్ద దోపిడీ దారుడు అని ధ్వజమెత్తారు. జీవీఎంసీ బిల్డింగ్‌ను తాకట్టు పెట్టి నిధులు తీసుకు వచ్చారని విమర్శించారు. ‘విశాఖ, అమరావతి, హైదరాబాద్ అన్నీ నా గుండెల్లో ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు.. ఆయన గుండె ఏమైనా చెరువా?’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

* ఆదివారం నాడు నగరి నియోజకవర్గం పరిధిలో గల నిండ్రలో కబడ్జీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా అక్కడికి వెళ్లారు. అయితే, చిన్ననాటి నుంచే కబడ్జీ పట్ల ఆసక్తి ఉన్న రోజా.. ఆటగాళ్లతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. గ్రౌండ్‌లోకి ఎంటరై.. కబడ్డి.. కబడ్డి అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. స్కూల్ రోజులు బాగా ఆడేదానని అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల టెన్షన్‌లో ఉన్న తాను రిలాక్సేషన్ కోసమే కబడ్డీ ఆడుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

* మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామ సమీపాన చికెన్ లో వుండే వ్యర్థ పదార్థాలను సేకరించి పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దాణాగా అందిస్తున్నారు. పక్కనే గోదావరి ఉండడంతో వీటిని ‘గంగ చేపలుగా చెప్పి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. కానీ చికెన్ వేస్టేజ్ తో పెంచిన ఈ చేపలు తింటే మాత్రం రోగాలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

* మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుపుకుంటుంది. అయితే తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సాయుధ దళాల దుస్తుల్లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా తమ అభిమాన హీరో ఈ దుస్తుల్లో కనిపించడంతో మెగాస్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

* బీజేపీలో నేడు చేరిన నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు నక్సలైట్ అని, అతనికి ప్రజల్లో విశ్వసనీయత గానీ, ఆదరణ గానీ లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. నాడు మిథున్ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ స్వతహాగా నక్సలైట్ అని, నాలుగుసార్లు పార్టీ మారాడని ఆయన అన్నారు. మిథున్ ఇప్పుడు స్టార్ కాదు.. లోగడకొన్ని మూవీల్లో నటించాడు.. అంతే ! మొదట సీపీఎం లో ఉన్నాడని, ఆతరువాత టీఎంసీలో చేరాడని ఆయన అన్నారు. పార్టీ అతడిని రాజ్యసభకు పంపిందని, అయితే ఈడీ ద్వారా కేసులు పెడతామని బీజేపీ బెదిరించడంతో రాజ్యసభను వదిలి ఇప్పుడు బీజేపీలో చేరాడని సౌగత రాయ్ పేర్కొన్నారు. ప్రజలలో అతడంటే ఎవరికీ గౌరవం లేదని, అతడు బీజేపీలో చేరినా ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

* మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసహనంతో ఊగిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. టీడీపీకి ఓట్లు వేయలేదని ఉక్రోశంతో ప్రజలను దూషించారు. కోపం రాదా? రోషం రాదా? అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. పాచి పనులు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు వెళ్లండంటూ ప్రజలకు చంద్రబాబు శాపనార్ధాలు పెట్టారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకుని ఊడిగం చేయండంటూ ప్రజలను దూషించారు. చంద్రబాబు తీరుపై ప్రజలు విస్తుపోయారు. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వన్‌టౌన్‌ నైజాం గేట్ మసీదు సెంటర్ వద్ద ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సంస్థ సభ్యుడు.. చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు హయాంలో 35 గుళ్లతో పాటు రామవరప్పాడు వద్దనున్న అబూబకర్ మసీద్‌ను కూడా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారని చంద్రబాబును ఆయన నిలదీశారు.

* మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలకపాత్ర అని కొనియాడారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు.

* రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు లేని పథకాలేంటో సీఎం కేసీఆర్‌ చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు తెరాసపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. రూ.17వేల కోట్ల వ్యయంతో 350 కి.మీ రీజినల్‌ రింగు రోడ్డు ఏర్పాటు కానుందని.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గొప్ప కానుక ఇది అని కిషన్‌రెడ్డి అన్నారు.

* ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7174కి చేరింది.

* పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే రోజు పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలో భారీ బహిరంగ సమావేశం చేపట్టగా.. మరోవైపు సిలిగురిలో దీదీ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

* మోహన్‌లాల్‌-మీనా జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘దృశ్యం-2’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ఇటీవల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వెంకటేశ్‌-మీనా జంటగా రానున్న ఈ చిత్రానికి మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

* దేశంలోని స్టీలు కంపెనీలు తమ సిబ్బందికి కొవిడ్‌-19 టీకా వేయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ కార్యాలయాలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న వేలమంది సిబ్బందికి టీకా వేయించే ప్రణాళికలకు తుది రూపం ఇచ్చే పనిలో ఆయా కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీల్, ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా, రాష్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(విశాఖ ఉక్కు).. ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమానికి మద్దతు ఇస్తామని, టీకా తమదాకా వచ్చే వరకు ఎదురు చూస్తామని తెలిపాయి.

* కొవిడ్‌ నిబంధనల నడుమ పార్లమెంట్ రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గం.నుంచి రాత్రి 9గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ సచివాలయం బులిటెన్‌లో ప్రకటించింది. జనవరి 29న ప్రారంభమైన పార్లమెంట్‌ తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 13వరకు కొనసాగాయి.

* సెంట్రల్ ఆఫ్రికాలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఓ బంగారు కొండ వెలుగు చూసింది. దక్షిణ కివు ప్రావిన్స్‌ లుహిహిలో బయటపడిన ఆ బంగారు కొండలో 60 నుంచి 90 శాతం వరకు పసిడి ఉందని కొందరు చెబుతున్నారు. ముందుగా ఒకరిద్దరికి తెలిసిన ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆ ప్రాంత వాసులందరికీ తెలిసిపోయింది. అంతే.. చేతికందిన వస్తువులతో ఆ బంగారు కొండపైకి దండెత్తారు.

* ఏడాది తర్వాత తిరిగి ప్రారంభమైన మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్‌ఇండియా మిథాలీరాజ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం లఖ్‌నవూ వేదికగా అటల్‌ బిహారి వాజ్‌పేయీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై పర్యాటక జట్టు ముందు తలవంచింది.