Politics

శ్రీవారికి చంద్రబాబు ₹30లక్షల విరాళం-తాజావార్తలు

News Roundup - Chandrababu Family Donates To TTD

* తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి తమ వంతు సాయంగా రూ.30లక్షలు దేవాన్ష్‌ పేరు మీద విరాళం ఇచ్చారు. ఈమేరకు చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.

* మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అనంతరం అక్కడి రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ‘మహా వికాస్‌ అగాఢీ’ కూటమి మరోసారి ఇరుకున పడినట్లు తెలుస్తోంది. తాజా ఘటనలు ప్రభుత్వానికి కళంకం తెచ్చాయని అంగీకరిస్తోన్న నేతలు, కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎన్‌సీపీ అధినేత పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

* అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో (2020లో) 47 శాతం మంది భారత్, చైనా దేశస్థులేనని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో కొత్తగా చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిపింది. ఈ మేరకు ‘యూఎస్‌ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’లో భాగంగా ‘స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌’ వార్షిక నివేదికను వెల్లడించింది. ‘సెవిస్‌’ పేరిట వెబ్‌ ఆధారిత విధానంలో అమెరికాలోని అంతర్జాతీయ నాన్‌ఇమ్మిగ్రెంట్‌ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు సంబంధించిన ఈ సమాచారాన్ని పొందుపరుస్తారు.

* పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్నికల్లో భాజపాను అడ్డుకోవడానికి ₹వందల కోట్లు ఖర్చు చేశారు. తెరాసకు, కేసీఆర్‌కు భాజపా సత్తా ఏంటో చూపిస్తాం. పీవీ గెలిచినట్టా? కేసీఆర్‌ గెలిచినట్టా? తెరాస చెప్పాలి. భాజపాను ఓడించేందుకు చాలా మంది పోటీ చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే. పీఆర్సీపై సీఎం కేసీఆర్‌వి అన్నీ నాటకాలే. తెరాస గెలుపు తాత్కాలికమే.. మా లక్ష్యం 2023. డబ్బుతోనే ఎన్నికల్లో తెరాస గెలిచింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. సాగర్‌ ఎన్నికల్లో భాజపా గెలిచితీరుతుంది’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

* బ్యాంకు ఖాతాదారులకు మరో షాక్‌ తగలనుంది. ఇప్పటికే మార్చి నెలలో వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ లావాదేవీలకు బ్రేక్‌ పడగా… మరో 7 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 వరకు చూస్తే.. కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్‌బీఐ బ్యాంక్‌ హాలీడేస్‌ ప్రకారం.. బ్యాంకులు దాదాపు వారం రోజులు పనిచేయకపోవచ్చు. అయితే.. ఈ సెలవులు ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. మార్చి 27 నుంచి 29 వరకు అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం కాగా… 28న ఆదివారం, 29న హోలీ పండుగ. అందువల్ల ఈ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే మార్చి 30న పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉండగా.. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్‌ 1న కూడా బ్యాంక్‌ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఇక ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పనిచేయవని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖాతాదారులు ఇప్పుడే ఏమైనా లావాదేవీలు ఉంటే త్వరపడండి. లేకపోతే.. అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది

* ఇసుక సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఇసుకను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించలేకపోయిందని.. ఇక ప్రైవేటువాళ్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జేపీ సంస్థను ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యుడికి ఎలా భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా భవన నిర్మాణ కార్మికులు మరోసారి రోడ్డున పడే అవకాశాలున్నాయని నాదెండ్ల వ్యాఖ్యానించారు.

* కోలీవుడ్‌ విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘పితామగన్‌’(తెలుగులో ‘శివపుత్రుడు’)ఎంతటి సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. ముఖ్యంగా చియాన్‌ విక్రమ్‌ నటించిన తీరు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే మిగతా నటీనటులైన సూర్య, లైలా, సంగీత అద్భుతంగా నటించారు. తాజాగా ఈ సినిమాపై నటి లైలా ఒక ట్వీట్‌ చేసింది. చెన్నై కేటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు ‘పితామగన్‌’ ప్రసారం చేశారని, ఆ సినిమా చూస్తుంటే నాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూర్య కాంబినేషన్‌లో రైల్లో వచ్చే సరదా సన్నివేశాల కోసం పదిరోజుల పాటు రైళ్లలోనే తిరిగామని చెప్పుకొచ్చింది. తేని పరిసర ప్రాంతాల్లోని రైల్వే రూట్లలో ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కు వెళ్తూ షూటింగ్‌ చేసినట్టు తెలిపింది. మీరు కూడా సినిమా చూడండంటూ అభిమానులను కోరింది.

* పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సువేందు అధికారి కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు ఆ కుటుంబ నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంతి దక్షిణ్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఆ కుటుంబం రూ.5వేల కోట్లతో ఒక సామ్రాజ్యం నిర్మించుకుందన్న ఊహాగానాలు తనకూ వినిపించాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అంశంపై విచారణ జరిపిస్తానని చెప్పారు. అధికారి కుటుంబాన్ని ద్రోహులుగా అభివర్ణించారు.

* రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పాలమాకులలోని గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడి జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 44కి చేరింది. మూడు రోజుల క్రితం కొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో యజమాన్యం వారికి కొవిడ్‌ పరీక్షలు చేయించించింది. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 900 బాలికలు ఉండగా.. వారిలో దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో మూడు రోజుల కిందట 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఇవాళ మరో 21 మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉందని గురుకుల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు శివగీత తెలిపారు. పాఠశాలలో మిగిలిన 400 మంది విద్యార్థులకు కూడా కొవిడ్ పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

* నవరత్నాల అమలు కోసం వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ.. ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. తిరుపతి భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆక్షేపించారు.

* కొవిడ్‌ టీకా తీసుకున్నవారు రక్తదానం చేసే విషయంలో జాతీయ రక్తదాన మండలి (ఎన్‌బీటీసీ) కీలక సూచన చేసింది. రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదానం చేయొద్దని సూచించింది. గత నెలలో జరిగిన ఎన్‌బీటీసీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్‌బీటీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ గుప్తా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

* దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రానున్నరోజులు చాలా ప్రమాదకరంగా మారతాయని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తమై కరోనా కట్టడికి సహకరించాలని మంత్రి సూచించారు. ‘ప్రజలు పూర్తి స్థాయిలో మాస్క్‌లు ధరించడం లేదు. కొందరు మాస్క్‌ను మెడ భాగానికి, జేబుకే పరిమితం చేస్తున్నారు. దీని వల్ల వైరస్‌ సులువుగా వ్యాపిస్తోంది. కొవిడ్‌పై ప్రాథమిక జాగ్రత్తలు పాటించినపుడే వైరస్‌ను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు దేశంలో అందుబాటులో ఉన్న ఆ రెండు టీకాలను తీసుకోవాలి. రానున్నరోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీని మరింత వేగవంతం చేయనున్నాం’ అని మంత్రి వివరించారు.

* రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ తెలిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఉద్యోగులు, అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను తెరాస పార్టీయే నిలబెట్టిందన్నారు. గెలుపు కోసం తెరాస ఇంత చేసినా అరకొర మెజార్టీనే సాధించిందని.. నైతికంగా తాను విజయం సాధించినట్లు చెప్పారు. రాజకీయంగా ప్రభుత్వం బలహీనమైందని వ్యాఖ్యానించారు. ఓట్లను చీల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని సమర్థంగా నిలువరించగలిగామన్నారు. లక్షమంది ఓటర్లు తమకు అండగా ఉన్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు.

* మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించిన కాలికి కొద్దిపాటి వాపు రావడంతో శనివారం తన ప్రచారాన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. కోవై దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆయన కోవైలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.