Business

యెస్ బ్యాంకుపై ₹25కోట్లు జరిమానా-వాణిజ్యం

యెస్ బ్యాంకుపై ₹25కోట్లు జరిమానా-వాణిజ్యం

* ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకుకు మరోషాక్‌ తగిలింది. బాండ్లకు సంబంధించిన మోసపూరిత చర్యల పాల్పడిందంటూ యస్‌ బ్యాంకుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించారనేది ఆరోపణ.

* 2020-21లో జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలే ఈ క్షీణతకు కారణమని జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) తెలిపింది. 2019–20లో ఈ పరిశ్రమ స్థూల ఎగుమతులు రూ.2,50,319.89 కోట్లుగా ఉన్నాయి.

* సూయజ్‌ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’పై ఈజిప్ట్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెలలో సూయజ్‌ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్‌ ప్రభుత్వ అధికారులతో ఎవర్‌ గివెన్‌ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్‌ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని చెబుతున్నారు.

* దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా సూచీల్లో మధ్యాహ్నం వరకూ ఊగిసలాట ధోరణి కనిపించింది. కొవిడ్‌, లాక్‌డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు మంగళవారం ఊపిరి పీల్చుకున్నాయి. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్‌ను మరింత సానుకూలంగా కదిలేలా చేసింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు మన దేశంలో కూడా అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలన్న నిర్ణయంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 660 పాయింట్లు లాభపడి, 48,544 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,504 వద్ద స్థిరపడింది.