Fashion

భవబంధాలు అంటే ఇవే మరి

భవబంధాలు అంటే ఇవే మరి

తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే. పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.

రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం.

సంతానం ఎదుగుతూ విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలని తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు.
గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.

కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు… కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు… అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.

జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.

భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.

కాలచక్రం ఎవరికోసం ఆగదు… పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.