Devotional

అగ్రహారం అంటే ఏమిటి ? అగ్రహారీకులని ఎవరిని అంటారు ?

అగ్రహారం అంటే ఏమిటి ? అగ్రహారీకులని ఎవరిని అంటారు ?

నాచనసోమన అష్టభాషలలో కవిత్వం చెప్పగలడు. ఆ ఎనిమిది భాషలు ఏమిటంటే (1) సంస్కృతం (2) తెలుగు (3) కన్నడ (4) మహరాష్ట్ర (5) శౌరసేని (6) మాగధి (7) ప్రాచ్య (8) అవంతి. అష్టభాషా కవితా దురంధర ఆయనకు గల బిరుదు.

శ్లోకం.
అష్టభాషకవిత్వ శ్రీవాణి విజిత సంపదే సోమయచానాం బోధే: సోమయామిత తేజసే.

గ్రామభోగాష్టకమంటే :- పూర్వం నిష్ణాతులైన గ్రామస్తులకు ఆ గ్రామంలో ఎనిమిది రకాలైన భోగాలను ఇచ్చేవారు. భోగం అంటే అనుభవం అని అర్థం. ఆ అష్టభోగాలు ఏమిటంటే (1) పౌరోహిత్యం (2) యజ్ఞయాగాదుల వంటి క్రతువులు నిర్వహించుట (3) స్వామిత్వం అంటే గ్రామాధికారం (4) జ్యోతిష శాస్త్ర పదవి (5) నాణెముల పరీక్ష చేయుట, దొంగనాణెములను గుర్తించుట (6) సాముద్రికం > చేతిరేఖల ఆధారంగా జ్యోతిష్యం చెప్పుట. (7) ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ప్రతులు వ్రాయుట (coping) (8) యజ్ఞయాగాలలో బుుత్విక్కులుగా వుండుట.

శ్లోకం..
పౌరోహిత్యం యాజకత్వం ప్రభుత్వం జ్యోతిస్సారం హేమముద్రాI
పరీక్షా:సాముద్రాఖ్యం లేఖకం యాజమానం ప్రోక్తం సద్భిర్గగ్రామ బోగాష్టకం హి ॥

నారాయణభట్టు సాయంలేకపోతే నన్నయ మహాభారతాన్ని ప్రారంభించేవాడు కాదేమో. రాజరాజనరేంద్రుని నందంపూడి శాసనం ప్రకారం నారాయణభట్టుకు అష్టాదశావధారణ చక్రవర్తి అనే బిరుదుంది. 18 విద్యలు లేదా శాస్త్రాలలో నిర్ణయాత్మకశక్తి కలవాడు. పురాణములు, ఉపపురాణములు, విద్యలు, మహాభారతం, భగవద్గీత, అష్టాదశస్మ్రతులు, కవిత్వం, తెలుగు సంస్కృతాలలో పాండిత్యం మొదలైన 18 విద్యలలో నిర్ణయాత్మిక శక్తి కలిగివుండేవాడు.

నారాయణభట్టుకు రాజరాజనరేంద్రుడిచ్చిన నందంపూడి అగ్రహారం శాసనాన్ని నన్నయభట్టే వ్రాశాడు. అందులో “సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర ఇతి ప్రథిత సుకవిత్వ విభవేన్” అని నారాయణభట్టుగురించి చెప్పాడు.

ఏకభోగఅగ్రహారం అంటే వేదాలలోనో పౌరోహిత్యంలోనో, పురాణ ఇతిహాసాలలోనో, కవిత్వంలోనో, పాండిత్యంలోనో నిష్ణాతులైన బ్రాహ్మణుడికి లేదా అతని కుటుంబానికి మాత్రమే సర్వహక్కులతోనూ ఎలాంటి పన్ను విధించకుండా, ఇతరులేవరికి అధికారం లేకుండా ఇచ్చిన గ్రామం.
దీనినే అగ్రహారం అని అంటారు. ఆ గ్రామాన్ని పొందిన కుటుంబాన్ని అగ్రహారీకులంటారు.
కొన్ని సందర్భాలలో కొంతమంది బ్రాహ్మణులకు కూడా సమిష్టిగా సర్వహక్కులు కల్పించి గ్రామాన్ని దానం చేయడం జరుగుతుంది.అలాంటి గ్రామం కూడా అగ్రహారమే. నివసించే బ్రాహ్మణులను అగ్రహారీకులంటారు.
ఇలాంటి గ్రామాన్నే శోత్రియం గ్రామమని కూడా పిలుస్తారు.