Politics

రఘురామరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ-నేరవార్తలు

రఘురామరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ-నేరవార్తలు

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే, బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారని సమాచారం. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది.

* విజయనగరం వేపాడ మండలం నల్లబెల్లిలో తీవ్ర విషాదం. కరోనా పాజిటివ్ రావటంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య.

* సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి సమీపంలో వేచి ఉన్న ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.

* రాష్ట్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందడంతో పాటు 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కరప మండలం పెనుగుదురుకు చెందిన మాత శ్రీనివాసవర్మ రాజమహేంద్రవరంలో జట్టు మేస్త్రీగా పని చేస్తున్నారు. ఆయన రాజమహేంద్రవరం గ్రామీణ మండలం దివాన్‌చెరువు వద్ద సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారు. దీని కోసం రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది గురువారం తెల్లవారుజామున పెనుగుదురు నుంచి అద్దె కారులో బయలుదేరారు. ఉదయం ఐదింటి ప్రాంతంలో వారి కారు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసవర్మ ఐదు నెలల కుమార్తెతోపాటు మామ అరతాడి స్వామి(50), బావ వనమాడి ఈశ్వరరావు(40), అక్క అన్నపూర్ణ(32) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసవర్మ భార్య రామలక్ష్మి, అత్త బేబీ, తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణ, డ్రైవర్‌ జ్యోతికుమార్‌ గాయపడ్డారు. వారికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించి కాకినాడకు తరలించారు. ప్రమాద ప్రాంతంలో విస్తరణ పనులు జరుగుతుండటంతో రహదారి ఇరుకుగా ఉంది. కారు డ్రైవర్‌ కునికిపాట్లు పడుతూ ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొన్నాడని పోలీసులు తెలిపారు.

* యూపీలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు కొనేందుకు ఓ జంట తమ కన్నపేగునే అమ్మకానికి పెట్టిన హృదయ విదారక ఘటన కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, కారు కొనుగోలు చేసేందుకు గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కుమార్తె, అల్లుడు కలిసి పసివాడిని రూ.1.5లక్షలకు విక్రయించినట్టు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ శిశువు ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ శైలేంద్ర కుమార్‌ మిశ్రా తెలిపారు. శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆ దంపతులు పాత కారును కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.