Politics

మోడీని ప్రశ్నించిన జగన్-తాజావార్తలు

మోడీని ప్రశ్నించిన జగన్-తాజావార్తలు

* రాష్ట్రంలో కరోనా నియంత్రణ టీకాల కొరత వేధిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. టీకా కొరతతో ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని.. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకా ప్రక్రియ ప్రారంభించలేకపోయామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయని, ఒక్కో డోసుకు రూ.2వేల నుంచి 25వేలు వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తప్పుడు సంకేతాలు ఇస్తోందని, ప్రభుత్వ నియంత్రణ లేకుంటే టీకాలను నల్లబజారుకు తరలిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన సీఎం జగన్‌.. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రధానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీకా కార్యక్రమం జరగాలన్నారు.

* శనివారం నల్గొండలో పోలీసులు ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు. ఈ నేపథ్యంలో ఓ విద్యుత్‌ ఉద్యోగిపై దాడి చేయటంతో ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు.

* తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్త ఉపకులపతులను (వీసీ)నియమించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వీసీల నియమక యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సిఫారసు చేశాయి. కరోనా కారణంగా కొంత ఆలస్యం జరిగిందని, కసరత్తు పూర్తిఅనంతరం ఆమోదం కోసం గవర్నర్‌కు పంపినట్టు ప్రభుత్వం తెలిపింది. 10మంది వీసీల నియామకానికి గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు.

* తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరోసారి 3వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 63,120మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3308మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా 21మంది మృత్యువాతపడగా.. 4723మంది కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 513 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 200లకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

* ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభవార్తను పంచుకుంటూ.. ‘‘ఈ మధ్యాహ్నం దేవుడు మాకు విలువైన బిడ్డను ఇచ్చాడు. గతంలో అనుభవించని భావోద్వేగం ఇది. షీలాదిత్య, నేనూ మా కుటుంబంతో పాటు పూర్తి ఆనందంలో ఉన్నాం. ఈ వార్తను మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని పేర్కొంది. శ్రేయా ఘోషల్ 2015లో షీలాదిత్యను పెళ్లిచేసుకొంది. ఆరు సంవత్సరాల తర్వాత వీరికి బిడ్డ పుట్టింది. శ్రేయ హిందీతో పాటు, తెలుగులోనూ ఎన్నో మంచి హిట్‌ సాంగ్స్‌ ఆలపించారు.

* ప్రధాని నరేంద్ర మోదీ బయటకు రావాలని.. రాష్ట్రాల్లో తిరిగి కరోనా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ప్రధానికి గుజరాత్‌ తప్ప ఏ రాష్ట్రం కనిపించడం లేదని విమర్శించారు. భాజపా నేతలు కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి టీకాలు తెప్పించాలని డిమాండ్‌ చేశారు. హన్మకొండలో ఎర్రబెల్లి మీడియా సమావేశం నిర్వహించారు.

* లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ విద్యుత్ సిబ్బందిని పోలీసులు ఆపొద్దని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డితో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలకు మంత్రి ఆదేశించారు. చేయి చేసుకున్నవారిని గుర్తించాలని సూచించారు.అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. నల్గొండ సంఘటనలపై ఎస్పీతోనూ మంత్రి మాట్లాడారు. విద్యుత్‌ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను ఆయన తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని తెలిపారు. రఘురామకృష్ణరాజుకు జనరల్‌ ఎడిమా ఉందని.. కాలి వేలికి ఫ్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ అన్నారు.