ScienceAndTech

జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగం-తాజావార్తలు

జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగం-తాజావార్తలు

* జంతువుల‌పై మొద‌లైన ఆనంద‌య్య మందు ప‌రిశోధ‌న‌. మంగాపురం వ‌ద్ద యానిమ‌ల్ ల్యాబ్‌లో జంతువుల‌పై ప‌రిశోధ‌న‌. 14 రోజుల్లో నివేదిక రావోచ్చంటున్న తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.

* మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి.

* ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సెంటర్లో మల్కాపురం ఆటో నగర్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో భాగంగా ఏలూరు రూరల్ S I చావా సురేష్ వాహన తనిఖీలు నిర్వహిస్తూ సహేతుక కారణములు లేకుండ వాహనాల్లో తిరుగుతున్న వాహన దారులను అపి వారి యొక్క వాహనాలను స్వాధీనం చేసుకుంటూ, కర్ఫ్యూ నియమ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విదించినారు.

* కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల సహాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

* గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశాన్ని కొవిడ్‌-19 క్లినికల్‌ మేనేజ్మెం‌ట్‌ ప్రోటోకాల్‌లో చేర్చింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కొవిడ్‌ నియమాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

* నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు తదుప‌రి చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉద‌యం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి ర‌ఘురామ డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఆయ‌న నేరుగా బేగంపేట విమానాశ్రం చేరుకొని దిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

* అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలుకు జగన్‌, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతున్నామని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ సిద్ధంగా ఉంటే మెయిల్‌ ద్వారా సమర్పించవచ్చని.. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ రఘురామను వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్‌ అన్నారు. మరోసారి గడువు ఇవ్వొద్దని.. జరిమానా విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.

* ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీగా జరిమానా విధించారు. గుంటూరు జిల్లాలో 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించినట్టు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. 25 ఆస్పత్రులకు రూ.2లక్షల చొప్పున; 12 ఆస్పత్రులకు రూ.5లక్షల చొప్పున; 15 ఆస్పత్రులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్టు ఆయన వివరించారు.

* వచ్చేనెల 17 నాటికి రాయితీ వేరుశెనగ విత్తనాల పంపిణీ పూర్తవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జులై 8న రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉగాది నాటికి మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని.. పట్టణాలు, నగరాల్లో 17 వేల ఎకరాలు అవసరమవుతున్నట్లు అంచనా వేశామన్నారు. వివిధ కేటగిరీల్లో ప్రభుత్వం, ప్రైవేట్‌ భూములను సేకరించినట్లు సీఎం వివరించారు.

* ఏపీలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు తగ్గుతున్నాయ‌ని.. సానుకూల ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీఎం జగ‌న్ మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్ప‌టికీ కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితి ఇంకా మెరుగుప‌డాల్సి ఉంద‌ని చెప్పారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌గ‌న్.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జిల్లా కలెక్ట‌ర్లు, అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కొవిడ్ పోరాటంలో నిమ‌గ్న‌మైన సిబ్బందికి అభినందన‌లు తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల‌పై ఉభ‌య గోదావ‌రి, చిత్తూరు జిల్లాల క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధ‌న‌లు క‌చ్చితంగా అమలు కావాల‌ని సీఎం అన్నారు.

* తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్ట‌ర్లు(జూడా) చేస్తున్న స‌మ్మెను వెంట‌నే విర‌మించాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు. లేని పక్షంలో చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయన హెచ్చ‌రించారు. స‌మ్మె చేయ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని చెప్పారు. జూడాల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌న్నారు. మ‌రో వైపు త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జూనియ‌ర్, రెసిడెంట్ వైద్యులు ఈ ఉద‌యం చేప‌ట్టిన స‌మ్మెను కొన‌సాగిస్తున్నారు.

* బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత‌ బీసీ జ‌నార్దన్‌రెడ్డి చేసిన త‌ప్పేంటి.. ఎందుకు ఆయ‌న‌ను అరెస్టు చేశారు? అని తెదేపా అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. తెదేపా నేత‌ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ వ‌ర్చువ‌ల్ విధానంలో నిర‌స‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. జనార్దన్‌రెడ్డి ఎప్పుడూ ప్రజా సేవ కోసం ప‌ని చేశార‌న్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముఠా క‌క్ష‌లు, హింస‌ను ప్రేరేపించేలా జ‌నార్దన్‌రెడ్డి ఎప్పుడూ ప‌ని చేయ‌లేద‌ని వివ‌రించారు.

* దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యస్‌ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపానుకు ఇప్పుడు ‘పున్నమి’ కూడా తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు వెల్లడించారు.

* కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్‌ డాక్టర్లు (జూడా) సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్‌ సోమేశ్ కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూడాల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని సీఎం అన్నారు. సమయం, సందర్భం చూడకుండా సమ్మెకు దిగడం సరికాదని చెప్పారు. కరోనా వేళ సమ్మె చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు.