Politics

విశాఖ నుండి ఏపీ ప్రభుత్వ పాలన-తాజావార్తలు

విశాఖ నుండి ఏపీ ప్రభుత్వ పాలన-తాజావార్తలు

* త్వరలోనే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో కలిసి బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు అతి త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు.

* నగరంలోని నెక్లెస్‌రోడ్‌ ఇక నుంచి పీవీ నరసింహారావు మార్గ్‌గా మారనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్‌రోడ్‌లో పీవీ నరసింహారావు మార్గ్‌ బోర్డులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 1998 మే 28న ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెక్లెస్‌రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్‌రోడ్‌.. పీవీ నరసింహారావు మార్గ్‌గా మారనుంది.

* దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఓ వైపు కేంద్రం చెబుతుంటే.. అవన్నీ అబద్ధపు మాటలని అంటున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అదంతా ఓ బూటకంగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలు సరఫరా చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. ‘‘డిసెంబర్‌ నాటికి అర్హులందరికీ వ్యాక్సిన్‌ ప్రకటన ఓ బూటకం. కేంద్రం ఇలానే చెబుతుంటుంది. బిహార్‌ ఎన్నికలకు ముందూ ఇలానే చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని! కానీ, అక్కడ అలాంటిదేమీ లేదే’’ అని మమత అన్నారు. ఇప్పుడున్న వ్యాక్సిన్ల మధ్య వ్యవధి ప్రకారం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరమైనా పడుతుందన్నారు. రాష్ట్రంలో 10 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ల కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తే ఇప్పటి వరకు వచ్చింది కేవలం 1.4 కోట్ల డోసులేనని మమత వివరించారు.

* కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే సతమతమవుతున్న భారత్‌కు మూడో అల (థర్డ్‌ వేవ్‌) ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పారిశ్రామిక వర్గాలను అప్రమత్తం చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రొటోకాల్‌ చెక్‌లిస్ట్‌ను సిద్ధం చేసుకోవాలని కోరారు. అలాగే, థర్డ్‌వేవ్‌లో వైరస్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులకు సాయం చేయాలని పారిశ్రామిక సంఘాలకు సూచించారు.

* దేశంలో ఉచిత వ్యాక్సిన్‌ అంశంపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా కీలకమని వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్‌ అమలు విధానంలో చాలా లోపాలు ఉన్నాయనీ, వెంటనే వాటిని సమీక్షించి, నివృత్తి చేసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

* తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) శ్రీనివాసరావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. డీహెచ్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఇవాళ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డీహెచ్‌ శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. మూడోదశ కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

* ఆంధ్రప్రదేశ్‌ కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. కొత్తగా 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్‌ పరీక్షించగా 12,768మంది కరోనా బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 15,612మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది. ఇక గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 98మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 11,132 మంది కన్నుమూశారు. ఇప్పటివరకూ 17,17,156మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్‌ కేసులున్నాయి.

* తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) శ్రీనివాసరావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. డీహెచ్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఇవాళ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డీహెచ్‌ శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. మూడోదశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సల లైసెన్స్‌లు రద్దు చేశామని డీహెచ్‌ హైకోర్టుకు వెల్లడించారు.

* ‘జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు – భూ ర‌క్ష స‌ర్వే’ ఆల‌స్యం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. భూ స‌ర్వేపై ఇవాళ స‌మీక్ష నిర్వహించిన జ‌గ‌న్‌.. కొవిడ్ పరిస్థితుల వ‌ల్ల మంద‌గ‌మ‌నంలో ఉన్న ఈ పథ‌కాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని సూచించారు. నిర్దేశించిన స‌మ‌యంలోగా ల‌క్ష్యాన్ని చేరాల‌న్నారు. స‌ర్వేను పూర్తి చేయ‌డానికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతూ.. అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సర్వేకు సిగ్న‌ల్స్‌ అందక సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటాయ‌న్న సీఎం.. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు.

* అమ‌ర వీరుల ఆశ‌య సాధ‌న‌కు విరుద్ధంగా తెలంగాణ‌లో కేసీఆర్‌ పాల‌న సాగుతోంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్ప‌డ్డ నాటి నుంచి క‌ల్వ‌కుంట్ల‌, ఒవైసీ కుటుంబాలే ల‌బ్ధి పొందాయ‌ని మీడియాతో నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో ఆయ‌న ఆరోపించారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివ‌రాల‌ను పూర్తిగా సేక‌రించామ‌ని.. ఇప్ప‌టికే తెరాస‌కు సంబంధించిన 18 మంది ముఖ్య‌నేత‌ల‌పై న్యాయ‌ప‌ర‌మైన స‌లహాలు తీసుకున్నామ‌ని బండి సంజయ్‌ చెప్పారు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వారం రోజుల్లో భాజపాలో చేరే అవకాశం ఉంద‌ని సంజ‌య్ అన్నారు.

* ఆరున్న‌ర ద‌శాబ్దాల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చిన ఘ‌నత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ద‌క్కుతుంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న గాంధీభ‌వన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఇచ్చినందుకు సోనియాగాంధీకి ప్రజల తరపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌న్నారు. ఏడేళ్లుగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించారు. విభ‌జ‌న హామీల అమలుపై కేంద్రాన్ని ప్ర‌శ్నించే ధైర్యం కేసీఆర్‌కు లేద‌న్నారు. కొవిడ్ క‌ట్ట‌డి విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు.

* అంతరిక్షంలో ఆశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు నిత్యం ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. ఇలా ఆకాశంలో అత్యంత అరుదుగా కనిపించే వృత్తాకార వలయాలు, ఇంద్రధనస్సు వంటి దృగ్విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా తెలంగాణలోనూ పలుచోట్ల సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయాలను ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే, ఇటువంటి వలయాలు సాధారణమైనవేనని.. వీటిని 22డిగ్రీ వృత్తాకార వలయాలుగా పేర్కొంటారని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

* కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలోని మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఇటీవల పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా 3,207 మంది మహమ్మారికి బలయ్యారు.

* దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని.. టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘నో వ్యాక్సినేషన్‌.. నో సాలరీ’కి సంబంధించి జిల్లా కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చర్చిత్‌ గౌర్‌ చెప్పారు.

* కరోనా వైరస్‌పై సమష్టి పోరుకు టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికాల ప్రతిపాదనకు అయిదు దేశాలతో కూడిన బ్రిక్స్‌ మద్దతిచ్చింది. ప్రపంచ దేశాలన్నిటికీ టీకాలను సమంగా అందుబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సిన్ల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని ఆ ప్రతిపాదన పేర్కొంది. కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంపై బ్రిక్స్‌ సమావేశం విస్తృతంగా చర్చించింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగింది. ఆతిథ్య దేశ హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ భేటీకి అధ్యక్షత వహించారు.

* దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటో, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను సూచీలు పూడ్చుకోగలిగాయి. ఉదయం 51,817 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఒక దశలో 450కి పైగా పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌.. చివరికి 85.40 పాయింట్ల నష్టంతో 51,8498.48 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.30 పాయింట్ల లాభంతో 15,576 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.08గా ఉంది.