Business

తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం

తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం

* ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు దిగి వస్తున్నాయి. గురువారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.339లు తగ్గి 48,530కి చేరింది. గత ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 48,869వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు తగ్గడం వల్లే ఈ తగ్గుదల నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. మరోవైపు, వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై రూ.475లు తగ్గడంతో ప్రస్తుతం రూ.70,772గా ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి 71,247వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1893డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండిధర 27.79డాలర్లుగా ఉంది.  మరోవైపు, హైదరాబాద్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50500 (అన్ని పన్నులతో కలిపి)లకు పైగా ట్రేడవుతోంది.

* అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరానికిగానూ జీతం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ వేతనం ‘సున్నా’ అని రిలయన్స్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం మతన వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ గతేడాది జూన్‌లోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

* జర్మనీకి చెందిన ఫోక్స్‌వేగన్‌ సంస్థ పోలో కారులో కంఫర్ట్‌లైన్‌ ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.8.51లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ప్రీమియం వేరియంట్లకు మాత్రమే ఉండేది. వాటి ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 9.45 లక్షలుగా ఉండేది. దానితో పోలిస్తే కొత్త వేరియంట్‌ ధర లక్షరూపాయలు చౌక. దీంతోపాటు ఈ సరికొత్త కారులో ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌,బ్లూపంక్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ను అందిస్తోంది.