Sports

రసవత్తరంగా న్యూజీల్యాండ్ పరిస్థితి

రసవత్తరంగా న్యూజీల్యాండ్ పరిస్థితి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ అయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(49; 117 బంతుల్లో 5×4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(44; 132 బంతుల్లో 1×4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మూడోరోజు ఆటను భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ప్రారంభించగా మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. మరో ఎండ్‌లో ఇతర పేసర్లు సైతం పదునైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. దాంతో భారత్‌ చివరికి 217 పరుగులకు ఆలౌటైంది. జేమీసన్‌ 5/31, నీల్‌ వాగ్నర్‌ 2/40, బౌల్ట్‌ 2/47 మెరుగైన ప్రదర్శన చేశారు. ఆదివారం ఆట ప్రారంభమైన కాసేపటికే జేమీసన్‌…..కోహ్లీ, పంత్‌(4)ను స్వల్ప వ్యవధిలో ఔట్‌చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అనంతరం రహానె, జడేజా కాసేపు వికెట్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, పరుగుల వేగం పెంచే క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అర్ధశతకానికి ఒక్క పరుగు ముందు నీల్‌వాగ్నర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 182/6గా నమోదైంది. అనంతరం అశ్విన్‌(22; 27 బంతుల్లో 3×4) ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 200 దాటాక సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 211/7తో భోజన విరామానికి వెళ్లింది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఇషాంత్‌(4), బుమ్రా(0), జడేజా(15) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.