Politics

పీవీ మార్గ్‌గా మారిపోయిన నెక్లెస్‌రోడ్-తాజావార్తలు

పీవీ మార్గ్‌గా మారిపోయిన నెక్లెస్‌రోడ్-తాజావార్తలు

* పీవీ ఘాట్‌లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు శతజయంతి ముగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముందుగా సీఎం కేసీఆర్‌, గవర్నర​ తమిళిసై పీవీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభమని అభివర్ణించారు. పీవీ నరసింహారావు చరిత్ర అందరికీ ఆదర్శం, ఆయన చాలా పటిష్టంగా భూ సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెక్లెస్‌ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.

* కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దల్‌(సెక్యులర్‌) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సోమవారం లేఖ రాశారు. కేరళలోని కాసరగాడ్‌ జిల్లాలో కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మళయాలంలోకి మార్చడాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. వాటి పేర్లను మార్చినప్పటికి అర్థం మారదని, పాత పేర్లతోనే వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘కేరళలో నివసిస్తున్న కన్నడిగుల సంప్రదాయాలను కాపాడటం కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రుల బాధ్యత.

* బీజేపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మీటింగ్‌కు వెళ్లకుంటే యాంటీ దళిత ముద్ర పడేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్‌ మీటింగ్‌కు వెళ్లడం వల్లనే బీజేపీ బతికిందన్నారు. ఏనాడు ఇంత సమయం వెచ్చించి ఇలాంటి సమావేశం జరగలేదని.. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు.

* పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాంగం సమష్టి చర్యలు చేపడుతోంది. మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తాలను సైతం ఖరారు చేసింది. మెగా వ్యాక్సినేషన్‌ స్ఫూర్తితో రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యంతో రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల పేదల ఇళ్లను గ్రౌండింగ్‌ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జూలై 1, 3, 4 తేదీల్లో యజ్ఞంలా నిర్మాణాలను ప్రారంభించేలా సీఎం కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాకో జాయింట్‌ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నియమించారు.

* ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు సారధి విరాట్‌ కోహ్లీని బాధ్యున్ని చేస్తూ జరుగుతున్న రాద్దాంతంపై పాక్‌ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ స్పందించాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘన చరిత్ర కలిగిన కోహ్లీని కేవలం ఒక్క మ్యాచ్‌ ఓటమి వల్ల ఈ స్థాయిలో నిందించడాన్ని ఆయన తప్పుపట్టాడు. కోహ్లీ సాధించిన విజయాలపై అవగాహన లేని వాళ్లే ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారని దుయ్యబట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఒక్క కోహ్లీని మాత్రమే తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని, కోహ్లీ స్థానంలో మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశాడు. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలని, ఫైనల్‌ ఫోబియా వీడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు.

* కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని.. అందుకే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన స్పందిస్తూ.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే ఎల్లో మీడియా ఉద్దేశమన్నారు.

* గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్‌’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో కార్యక్రమం జరగనుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్‌ గొల్లపూడి వెళ్లనున్నారు. ఈ క్రమంలో గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లపై ఆయన డీఐజీ పాల్‌రాజ్‌ (టెక్నికల్‌ సర్వీస్‌), దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్, డీసీపీ–2 విక్రాంత్‌ పాటిల్, విజయవాడ వెస్ట్‌ ఏసీపీ డాక్టర్‌ కె. హనుమంతరావులతో చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలోనే ఆయన స్వయంగా యాప్‌ డౌన్‌ లోడ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రఘురాం వివరించారు. ఎంపీడీఓ సునీత, రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాస నాయక్, భవానీపురం సీఐ జె. మురళీకృష్ణ, గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

* అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే.

* తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3644 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1417 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 6,04,093 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.