ScienceAndTech

ఆకాశ మార్గంలో నిఘా పెంచనున్న ఇండియా-తాజావార్తలు

ఆకాశ మార్గంలో నిఘా పెంచనున్న ఇండియా-తాజావార్తలు

* తెలంగాణలో రాగల 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది.

* ప్రతి ఒక్క మతాన్ని, మత విశ్వాసాలను గౌరవించాలని.. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాలు సైతం అందుకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడే శాంతి, సౌభాగ్యం సాధ్యమని చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన గణేశ్‌ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికాయి.

* నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. చంపాపేట నుంచి సాగర్‌ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

* బిహార్‌ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓ గ్రామంలో మహిళలకు ఆయన డబ్బులు పంచుతున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. దీనిపై అధికార జేడీయూ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఆర్జేడీ పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందంటూ దుయ్యబట్టింది.

* గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని, మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ అనుమతిచ్చారు. వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చారు

* పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక కోసం దీదీ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే మమతకు పోటీగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను భాజపా బరిలోకి దించుతోన్న విషయం తెలిసిందే.

* ఆకాశ మార్గంలో నిఘా ఏర్పాట్లపై భారత్‌ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ మరో కీలక ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రూ.11 వేల కోట్ల వ్యయంతో రక్షణ రంగ పరిశోధన శాలలు (డీఆర్‌డీవో) ఆరు ఎయిర్‌ బొర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్స్‌ను అభివృద్ధి చేయడానికి అనుమతి మంజూరు చేసింది.

* అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటు ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలు మొదలు కాగా.. ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడ్డ రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడే చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది (2022) నాటికి అఫ్గాన్‌లో 97శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.

* ‘భారత్‌లో వ్యాపారం చేసేటప్పుడు భారతీయుడిలానే అలోచించాలి’ అన్న విషయాన్ని మన ఆటోమొబైల్‌ మార్కెట్‌ మరోసారి విదేశీ కంపెనీలకు గుర్తు చేసింది. అమెరికా కంపెనీలు భారతీయుడి నాడి పట్టుకోలేకపోతున్నాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నేళ్లలోనే పోటీ నుంచి తప్పుకొంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో అమెరికా దిగ్గజం ఫోర్డు కూడా చేరింది. గత ఐదేళ్లలో ఫోర్డుతో కలిపి ఆరు కంపెనీలు భారత్‌ను వీడాయి.

* ఇంగ్లాండ్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా 17వ సీడ్‌ గ్రీస్‌ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది.

* తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌ను అలాగే ఒంటరిగా వదిలేస్తే.. అక్కడి ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ హెచ్చరించారు. అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌ వైపు సానుకూల విధానాన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న స్పెయిన్‌ విదేశాంగ మంత్రితో సమావేశమైన అనంతరం సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో షా మహ్మద్‌ ఈ పిలుపునిచ్చారు.

* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్‌ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈమేరకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. ఓటీపీఆర్‌ ద్వారా వచ్చే యూజర్‌ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. మరోవైపు 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1.34 ల‌క్షల మంది ఉద్యోగుల‌కు ప్రోబెషన్ పూర్తి కావటంతో శాఖాపరమైన పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

* ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 10వేల పేజీలతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో సస్పెండ్‌కు గురైన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని ఎన్‌ఐఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ గురించి కూడా కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ కేసులో పరమ్‌ బీర్‌.. బాలాజీ కుర్‌కురే పేరుతో నిందితులతో మాట్లాడినట్లు తెలిసింది. అంబానీకి బెదిరింపుల కేసులు, వ్యాపారి మన్‌సుఖ్‌ హీరేన్‌ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే సహా పలువురు నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ నిందితులతో ఎవరెవరు రహస్య చర్చలు చేశారన్న దానిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ‘బాలాజీ కుర్‌కురే’ అనే ఫేస్‌టైం ఐడీ పేరు బయటికొచ్చింది. ఈ ఐడీతోనే ముంబయికి చెందిన ఓ అనుమానిత వ్యక్తి నిందితులతో రహస్యంగా చాట్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఎన్‌ఐఏ కూపీ లాగకా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫేస్‌టైం ఐడీని ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరమ్‌బీర్‌ ఓ కొత్త ఫోన్‌ కొనుగోలు చేశారు. ఆ ఫోన్‌ ఇవ్వడానికి పరమ్‌బీర్‌ ఆఫీస్‌కు వచ్చిన వ్యక్తి అందులో ఫేస్‌టైంని యాక్టివేట్‌ చేశారు. ఐడీ పేరు ఏం పెట్టాలా అని చూస్తున్న సమయంలో అక్కడే టేబుల్‌పై ఉన్న బాలాజీ కుర్‌కురే ప్యాకెట్‌ను చూశాడు. దీంతో ఆ పేరుతోనే ఐడీని క్రియేట్‌ చేసినట్లు ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి చెప్పారని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ ఫేస్‌టైం ఐడీతోనే పరమ్‌బీర్‌.. సచిన్‌ వాజే సహా పలువురు నిందితులతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.

* నవశకం నియంతగా పేరు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ మళ్లీ బహిరంగ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజుల తర్వాత కనిపించిన కిమ్‌ శరీరాకృతి మారింది. ఇంతకుముందు బొద్దుగా కనిపించే కిమ్‌ ఈసారి చాలా సన్నబడి కనిపించాడు. ఒక్కసారిగా అతడి మార్పు చర్చనీయాంశమైంది. చివరిసారి కనిపించినప్పుడు అతడి తలపై ఉన్న ఒక గుర్తు గురించి సర్వత్రా చర్చ జరగ్గా ఇప్పుడు కిమ్‌ బక్కగా అవ్వడం ఆసక్తికరంగా మారింది. 73వ మిలిటరీ పరేడ్‌ సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్‌ కపించాడు. గతానికి కన్నా భిన్నంగా చలాకీగా.. హుషారుగా.. నవ్వుతూ కనిపించాడు. ఈ సందర్భంగా అతడి లుక్స్‌ వైరల్‌గా మారాయి. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సుంగ్‌ మాదిరి హెయిర్‌ స్టైల్‌లో కనిపించాడు. కొన్ని నెలలుగా ఆయన సన్నబడడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బరువు తగ్గేలా కసరత్తులు చేశారు. సన్నబడిన అనంతరం కనిపించడం ఇదే తొలిసారి. సైనిక పరేడ్‌లో ఎప్పుడూ లేని విధంగా కిమ్‌ కనిపించాడు. ఇద్దరు పిల్లలతో కలిసి దరహాసం చేస్తూ ముందుకు కదిలాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా సైనికులకు అభివాదం చేస్తూ ముందుకుసాగాడు.

* ఇండియన్‌ మార్కెట్‌లో తనకు తిరుగు లేదని మరోసారి మారుతి నిరూపించుకుంది. మార్కెట్‌లో ఇతర కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి మారుతి బ్రాండ్‌ నుంచి వస్తోన్న కార్లు. తాజాగా సెడా​న్‌ సెగ్మెంట్‌ అమ్మకాల్లో మారుతి సియాజ్‌ సంచలనం సృష్టించింది. గత దశాబ్ధం కాలంగా ఇండియన్‌ మార్కెట్‌లో ఎస్‌యూవీ వెహికల్స్‌కే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ లెవల్‌ కార్లను మినహాయిస్తే ఎస్‌యూవీలోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక సెడాన్‌ సెగ్మెంట్‌కి సంబంధించిన అమ్మకాల్లో ఎలాంటి మెరుపులు ఉండటం లేదు. అలాంటి తరుణంలో మారుతి మిడ్‌రేంజ్‌ సెడాన్‌ సియాజ్‌ సానుకూల ఫలితాలు సాధించింది.

* దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. కోవిడ్‌ కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్‌ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి కూడా.