Business

చౌకలో సూపర్ కారు కావాలంటున్న భారతీయులు…అందుకే ఫోర్డ్ బంద్-వాణిజ్యం

చౌకలో సూపర్ కారు కావాలంటున్న భారతీయులు…అందుకే ఫోర్డ్ బంద్-వాణిజ్యం

* ‘భారత్‌లో వ్యాపారం చేసేటప్పుడు భారతీయుడిలానే అలోచించాలి’ అన్న విషయాన్ని మన ఆటోమొబైల్‌ మార్కెట్‌ మరోసారి విదేశీ కంపెనీలకు గుర్తు చేసింది. అమెరికా కంపెనీలు భారతీయుడి నాడి పట్టుకోలేకపోతున్నాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నేళ్లలోనే పోటీ నుంచి తప్పుకొంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో అమెరికా దిగ్గజం ఫోర్డు కూడా చేరింది. గత ఐదేళ్లలో ఫోర్డుతో కలిపి ఆరు కంపెనీలు భారత్‌ను వీడాయి. వీటిల్లో జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌, హార్లీడెవిడ్‌సన్‌,యూఎం మోటార్‌ సైకిల్స్‌ అమెరికావే కావడం గమనార్హం. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి విదేశీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. కియా వంటి కొత్త కంపెనీలు వేగంగా భారతీయులను ఆకట్టుకోగా.. ఎంతో అనుభవం ఉన్న ఫోర్డ్‌ తయారీని నిలిపివేసింది. పశ్చిమ దేశాల వారితో పోలిస్తే భారతీయులు కార్ల విషయంలో కొంత భిన్నంగా ఆలోచిస్తారు. ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. ఆదాయాల్లో తేడా కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా చూడాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంత ప్రజల వాహన అవసరాలు .. గ్రామీణ ప్రాంత అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. పశ్చిమ దేశాలతో పోలిస్తే సొంత కారు యజమానుల సంఖ్య కూడా తక్కువే. 2018 నాటికి ప్రతి 1000 మందిలో కేవలం 22 మందికి మాత్రమే సొంత కార్లు ఉన్నట్లు నీతిఆయోగ్‌ చీఫ్‌ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాలో ఈ సంఖ్య 980, బ్రిటన్లో 850గా ఉన్నాయి. కానీ 2040 నాటికి భారత్‌లో సొంతకార్లు ఉన్న వారి సంఖ్య ప్రతి 1000 మందిలో 175కు చేరుతుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ లెక్కగట్టింది. 130 కోట్ల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో కార్ల కొనుగోళ్లు వెల్లువెత్తనున్నాయి. ఇటీవల కాలంలో మధ్య తరగతి ప్రజలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపడం పెరిగింది. చాలా దేశాలతో పోలిస్తే తలసరి ఆదాయం కూడా తక్కువే. జపాన్‌ కంపెనీ సుజుకీ, దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్‌లు భారతీయుల నాడిని పట్టాయి. హ్యూందాయ్‌ అనుబంధ సంస్థ కియా కూడా వేగంగా భారత్‌లో మంచి మార్కెట్‌ వాటాను దొరకబట్టుకోవడానికి కారణం ఇదే. సుజుకీ కంపెనీ భారత్‌లో మారుతీతో చేతులు కలపడం కలిసొచ్చింది. భారతీయుల అభిరుచులకు తగ్గట్లు కార్లను తయారుచేసింది. మధ్యతరగతి వారు అందుబాటు ధరలో ఉన్న కార్లకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో వారు మైలేజ్‌, లుక్స్‌, ఫీచర్స్‌ బాగున్న కంపెనీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సర్వీసింగ్‌ను కూడా భారతీయులు పరిగణనలోకి తీసుకొంటారు. తక్కువ ధరకు పలు ఫిచర్స్‌ ఇచ్చి.. లుక్స్‌ ఆకట్టుకోకపోయినా భారతీయులు మొగ్గుచూపరు. దీనికి మంచి ఉదాహరణ జనరల్‌ మోటార్స్ (షవర్లే) కంపెనీ తయారు చేసిన బీట్‌ కారు. భారతీయులను ఆకట్టుకొనేందుకు ‘బీట్‌’ చిన్నకార్లలో డీజిల్‌ వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీనిలో ఫీచర్లు, మైలేజీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. పైగా అంతర్జాతీయ బ్రాండ్‌ జనరల్‌ మోటార్స్ పేరు ఉండనే ఉంది. కానీ, ఈ కారు జీఎం మార్కెట్‌ షేరులో పెనుమార్పును తీసుకురాలేకపోయింది. ఈ ప్రయోగం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ కారు మరీ చిన్నదిగా కనిపిస్తుండటంతో కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అమెరికన్‌ కంపెనీలు కొత్త ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తెచ్చే విషయంలో కూడా వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణకు భారత్‌లో సబ్‌కాంపాక్ట్‌ మార్కెట్‌ మంచి జోరుమీదుంది. ఇది గమనించిన మారుతీ బ్రెజా,ఎస్‌క్రాస్‌,ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ వంటి మోడళ్లను రంగంలోకి దించింది. హ్యుందాయ్‌ కూడా క్రెటా, వెన్యూ వంటి కార్లను మార్కెట్లోకి తెచ్చింది. నిస్సాన్‌ అత్యధిక ఫీచర్లతో తక్కువ ధరకు మాగ్నైట్‌ను పరిచయం చేసి విజయం సాధించింది. కానీ, ఫోర్డ్‌ ఇదే సమయంలో ఒక్క ఎకోస్పోర్ట్‌ తప్ప మరో మోడల్‌ తీసుకురాలేదు. పైగా అమెరికన్‌ కంపెనీలు భారత్‌ను దృష్టిలోపెట్టుకొని కార్లను తయారు చేయవనే అపప్రద ఉంది. 2018 చివరి నుంచి ఆటోమొబైల్‌ మార్కెట్‌ మందగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొవిడ్‌ దెబ్బ తగలడంతో మార్కెట్‌కు మరిన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20శాతం పెరుగుదల ఉంటుందని అంచనా.. అదే సమయంలో 2018తో పోల్చి చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది’’ అని ఎంజీ మోటార్స్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ చాబా ఇటీవల అన్నారు. మరోపక్క మారుతీ సుజుకీ ఎండీ కెన్చీ అయుకవా కూడా ఇటీవల సియాం 61వ వార్షిక సదస్సుల్లో భారత మార్కెట్‌ మందగించిందని వ్యాఖ్యానించారు. దీనికి కొన్ని కారణాలు కూడా ఆయన వెల్లడించారు. కొవిడ్‌-19, సెమీ కండక్టర్ల కొరత, ముడి సరుకు ధరలు పెరగడం, బీఎస్‌-6 ఫేజ్‌ 2 నిబంధనల అమలు, షిప్పింగ్‌ కంటైనర్ల కొరత, దిగుమతి నిబంధనలు వంటి అంశాలు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఫోర్డ్‌ వ్యాపారం గత పదేళ్లుగా ఆశాజనకంగా లేదు. ఈ కాలంలో 2 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. మరో 800 మిలియన్‌ డాలర్ల నిరర్ధక ఆస్తులను పక్కనపెట్టాల్సి వచ్చింది. దీనికి కొవిడ్‌ సెగ కూడా తోడైంది. ఈ ఏడాది జూన్‌లో కేవలం 2,790 కార్లను మాత్రమే విక్రయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్లాంట్లను నిర్వహిస్తూ భారత్‌లో కొనసాగడం ఆర్థిక భారంగా మారింది. ఫోర్డ్‌కు టాటామోటార్స్‌, హ్యుందాయ్‌, కియా నుంచి బలమైన పోటీ ఎదురవుతోంది.

* వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జియో ఫోన్ నెక్ట్స్‌’ రాక మరింత ఆలస్యం కానుంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినాయక చవితిని పురస్కరించుకుని నేటి నుంచి మార్కెట్లోకి తీసుకొస్తామని గతంలో రిలయన్స్‌ జియో ప్రకటించింది. అయితే ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. దీపావళి పండగ సీజన్‌ నాటికి ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ శుక్రవారం రాత్రి వెల్లడించింది.

* రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల విలీన ఒప్పందం విషయంలో ఫ్యూచర్‌ రిటైల్‌ ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్‌ అత్యవసర మధ్యవర్తిత్వ కోర్టు(ఈఏ) ఇచ్చిన తీర్పు అమలుకు సంబంధించి, దిల్లీ హైకోర్టు ముందున్న ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు 4 వారాల పాటు స్టే విధించింది. రిలయన్స్‌, ఫ్యూచర్‌ విలీనాన్ని సవాలు చేసిన అమెజాన్‌.. సుప్రీంకోర్టు ఆదేశాలను సమ్మతించింది. విలీన ఒప్పందానికి సంబంధించి తదుపరి నాలుగు వారాల పాటు ఎటువంటి తుది ఉత్తర్వులను జారీ చేయరాదని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), సెబీలకు సైతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇరు పక్షాల (ఫ్యూచర్‌, అమెజాన్‌) మధ్య ఏకాభిప్రాయ సాధనతోనే ఈ పరస్పర సమ్మతి ఆదేశాలను(కన్సెంట్‌ ఆర్డర్‌) అత్యున్నత న్యాయస్థానం వెలువరచింది.

* ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా వృత్తి నిపుణులకు శుభవార్త. ఐటీ రంగంలో 2-5 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళల కోసం మెగా ఉద్యోగ మేళాను ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రారంభించింది. ‘నైపుణ్యం, సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళా వృత్తి నిపుణులు తమదైన ముద్ర వేసే అవకాశాన్ని టీసీఎస్‌ కల్పిస్తోంది. ఈ కార్యక్రమం మహిళల ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికే కాదు.. నచ్చిన విభాగంలో మరిన్ని ప్రత్యేక నైపుణ్యాలపై పట్టు సాధించేందుకూ ఉపయోగపడుతుందని తెలిపింది. ‘సులభమైన ఒకే విడతలో అయిపోయే ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేసి.. మంచి హోదాలు పొందవచ్చ’ని టీసీఎస్‌ వివరించింది. నియామక ప్రక్రియ- అర్హతలు ఇలా..: దేశవ్యాప్తంగా నియామకాలు జరుగుతాయి. డిగ్రీ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, 2-5 ఏళ్ల అనుభవం కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు వారి రిజిస్టర్డ్‌ ఇ-మెయిల్‌కు వస్తాయి. ఈ నైపుణ్యాలు అవసరం..: ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ డీబీఏ, లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌, మెయిన్‌ఫ్రేమ్‌ అడ్మిన్‌, ఆటోమేషన్‌ టెస్టింగ్‌, పర్‌ఫెర్మాన్స్‌ టెస్టింగ్‌ కన్సల్టెంట్‌, యాంగ్యులర్‌ జేఎస్‌, ఒరాకిల్‌ డీబీఏ, సిట్రిక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, జావా డెవలపర్‌, డాట్‌నెట్‌ డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, ఐఓఎస్‌ డెవలపర్‌, విండోస్‌ అడ్మిన్‌, పైథాన్‌ డెవలపర్‌, పీఎల్‌ ఎస్‌క్యూఎల్‌.