Politics

వచ్చే ఎన్నికల్లో 100శాతం గెలుపు మనదే-చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో 100శాతం గెలుపు మనదే-చంద్రబాబు

రాష్ట్రంలో మత్తుమందుల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, అఫ్గానిస్థాన్‌ నుంచి వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ దిగుమతవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్‌లో పట్టుబడిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోని టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో దిగుమతయిందని.. దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు తెరిచి సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చిపెట్టి ప్రజల్ని మళ్లీ మోసం చేయొచ్చని జగన్‌ భావిస్తున్నారని, మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మనం గెలవడం నూటికి నూరుశాతం ఖాయమని.. ఈ దిశగా మనం ప్రజల్ని సన్నద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల తెలుగు రైతు విభాగం నాయకులతో ఆయన మాట్లాడారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌.. ఇప్పుడు సర్దుబాటు (ట్రూ అప్‌ ఛార్జీల) పేరుతో ప్రజలపై రూ.11 వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. దేశంలో చెత్తకు పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌దేనని విమర్శించారు. ‘జగన్‌ పాలనలో ప్రభుత్వ సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలకూ కొరతే. రైతుభరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తానని.. రూ.7,500 మాత్రమే ఇచ్చి రైతుల్ని మోసగించారు. అయిదో విడత రుణమాఫీ సొమ్ము ఎగ్గొట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని మేం రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తే.. వైకాపా వచ్చాక వీటిని నాశనం చేశారు’ అని మండిపడ్డారు.