Business

ఇండియాలో లెక్సస్ సరికొత్త కారు విడుదల-వాణిజ్యం

ఇండియాలో లెక్సస్ సరికొత్త కారు విడుదల-వాణిజ్యం

* జపాన్‌కు చెందిన టయోటా విలాస కార్ల విభాగమైన లెక్సస్‌, తమ కొత్త ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ లెక్సస్‌ ఈఎస్‌ 300హెచ్‌ను భారతీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.56.65 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ) కాగా, లగ్జరీ వేరియంట్‌ రూ.61.85 లక్షలుగా ఉంది. ఈ కారును దేశీయంగానే రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా లెక్సస్‌ను 1989లో ప్రవేశపెట్టగా.. 2017లో భారత్‌కు పరిచయం చేశారు. ఈ కంపెనీ ప్రధాన మోడళ్లలో ఈఎస్‌ ఒకటి. అంతర్జాతీయంగా 80కి పైగా దేశాల్లో ఇప్పటి వరకు 26.5 లక్షల కార్లను విక్రయించారు. కొత్త ఈఎస్‌ 300 హెచ్‌ బ్యాటరీ 8 ఏళ్ల వారెంటీతో లభిస్తుందని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

* ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు. ఈ విమానయాన సంస్థ నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో భారత్‌లో వ్యాపార వాతావరణం పునర్‌వైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా.. ప్రైవేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ టేకోవర్‌ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్‌వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా టేకోవర్‌ను స్వాగతిస్తూ టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ ఎన్‌ టాటా చేసిన ట్వీట్‌ను ఆనంద్‌ మహీంద్రా తన ట్వీట్‌కు జత చేశారు.

* ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష మదుపర్లను మెప్పించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 60000 పాయింట్ల ఎగువకు చేరింది. కీలక రేట్లను యథాతథంగా ఉంచడం, సర్దుబాటు ధోరణిని కొనసాగించడం కలిసొచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు తగ్గి 74.99 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, టోక్యో లాభపడగా.. సియోల్‌ నష్టపోయింది. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

* గంటల వ్యవధిలో రూ.కోట్ల సంపదను సృష్టించడం ప్రముఖ మదుపరి, ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకే సాధ్యమనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పెట్టుబడులు ఉన్న టైటన్‌ కంపెనీ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 9.32 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17,700 కోట్లకు చేరింది. ఈ సంస్థలో ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖాకు కలిపి 4.81 శాతం వాటాలున్నాయి. దీంతో వారి వాటాల విలువ ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో రూ.854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్‌ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ లాభాలను గడిస్తున్న ఈ బిగ్‌బుల్‌.. ఏదో ఒక సమయంలో లాభాలను స్వీకరించేందుకు స్టాక్స్‌ను అమ్మాల్సిందే కదా..! మరి ఆయన స్టాక్స్‌ను ఏ ఆధారంగా విక్రయిస్తారో తాజాగా జరుగుతోన్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో వెల్లడించారు.

* దసరా పండుగ వేళ ఇళ్లకు వెళ్లే వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ఇటు ఆర్టీసీ అటు ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలు పెంచేయడంతో సొంతిరికి ప్రయాణం భారంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆం‍ధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీలు స్పెషల్‌ బస్సుల పేరుతో యాభై శాతం ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ బస్సుల్లో రెగ్యులర్‌ ఛార్జీలే ఉన్నా స్పెషల్‌ బస్సుల్లో మాత్రం అధికం తప్పడం లేదు. మరోవైపు పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపించే రైల్వేశాఖ కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గతేడాది నుంచి ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడిపించడం లేదు. దీంతో ఎక్కువ మంది బస్సుల్లోనే సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది.