WorldWonders

మనిషికి పంది కిడ్నీ అమర్చిన న్యూయార్క్ వైద్యులు-తాజావార్తలు

మనిషికి పంది కిడ్నీ అమర్చిన న్యూయార్క్ వైద్యులు-తాజావార్తలు

* బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. బుధవారం ముంబయి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని అతడి తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టుకు వెల్లడించారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఎన్‌సీబీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆర్యన్ పలుమార్లు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ రోజు విచారణలో భాగంగా ఎన్‌సీబీ కోర్టుకు పలు ఆధారాలు సమర్పించింది. ఓ నటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని చెప్పింది. అంతేగాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.

* తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఏంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నిన్న ఏపీలోని తెదేపా కార్యాలయాలపై దాడులు జరగడం.. ఇవాళ ఆ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.

* తెదేపా నేతలు పరుష పదజాలం వాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కావాలనే మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారని అన్నారు. ఉత్తర భారత్‌లో అది ఒక బూతు మాట.. అనకూడని మాట అని పేర్కొన్నారు.

* దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్‌.. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర సంక్షేమ పాలనకు పునాది వేసిందని షర్మిల చెప్పారు. చేవెళ్ల నుంచి ఆమె ఇవాళ చేపట్టనున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.

* వైకాపా సర్కార్‌పై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు. కావాలనే వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధిపొందాలనే ఆరాటం మన రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కోర్టు కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో అందరినీ సంతృప్తి పరిచేలా పాలన చేశానని.. ఇకపైనా అలాగే కొనసాగిస్తానని జగన్‌ వివరించారు.

* సామాజిక మాధ్యమ వేదికల్లో దిగ్గజ కంపెనీగా పేరొందిన ఫేస్‌బుక్‌.. త్వరలోనే తన పేరును మార్చుకోనుందట. ఈ కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్‌ చేయాలని ఫేస్‌బుక్‌ యాజమాన్యం యోచిస్తున్నట్లు ప్రముఖ టెక్‌ పత్రిక ‘ది వెర్జ్‌’ ఓ కథనంలో వెల్లడించింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు మార్పు గురించి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అయితే అంతకంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు పేర్కొంది.

* అమెరికా చట్టసభ భవనం క్యాపిటల్‌పై జరిగిన దాడికి సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తును అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న కమిటీకి వ్యతిరేకంగా ఆయన కోర్టు మెట్లెక్కారు. మరోవైపు తన సన్నిహితుడు, క్యాపిటల్‌పై దాడికి జరిగిన కుట్రలో కీలక పాత్రధారిగా భావిస్తున్న స్టీవ్‌ బానన్‌ను విచారణ విషయంలో కమిటీకి సహకరించకూడదని ట్రంప్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే బానన్‌ ఇప్పటివరకూ కమిటీ నోటీసులను ఖాతరు చేయలేదు. దీంతో ఆయనపై ధిక్కార చర్యలు తీసుకునేందుకు కమిటీ రంగం సిద్ధంచేసింది.

* యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్‌) ముందుకొచ్చింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కిలోలు బంగారాన్ని బహూకరించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించడం ఎంతో పుణ్య కార్యమని.. అందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తామని శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే 6 కిలోల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో సంబంధిత అధికారులకు అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో యాదాద్రి పుణ్యక్షేత్రం మరింత అందంగా రూపుదిద్దుకొని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంఈఐఎల్‌ నిర్మించిందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని దర్శనీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతి గడించిందని వివరించారు.

* వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ.. అవయవాల కొరత వేధిస్తోంది. ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగికి పంది కిడ్నీ అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించడంతో గత నెల ఆపరేషన్‌ నిర్వహించారు. పంది కిడ్నీని రోగి శరీరానికి అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్‌ డా. రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే క్రమంలో గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పందుల అవయవాలపై దృష్టి పెట్టారు. అయితే దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు ఇది సరిపోలడం లేదు. దీంతో ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. పంది కణాల్లో చక్కెర స్థాయిలను తొలగించి, రోగ నిరోధక వ్యవస్థకు దాడిని నివారించేలా జన్యువుల్లో మార్పులు చేశారు. జన్యు పరంగా మార్పులు చేసిన పందులను గాల్‌సేఫ్‌గా పిలుస్తారు. గాల్‌సేఫ్‌లను మాంసం అలర్జీ ఉన్నవారికి ఆహారంగానూ, మానవ చికిత్సలో వనరులుగా వినియోగిస్తున్నారు. వీటికి అమెరికా ఫుడ్‌, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ 2020లో ఆమోదం తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైందని, అవయవ మార్పిడిలో కీలకమైన ముందడుగని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవాల కొరత ఉంది. ఒక్క అమెరికాలోనే లక్ష మందికి పైగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తుండగా.. వీరిలో 90వేల మందికి పైగా కిడ్నీ సమస్య బాధితులే. అమెరికా నెట్‌వర్క్ ఫర్‌ ఆర్గాన్‌ షేరింగ్‌ ప్రకారం.. ఒక మనిషికి కిడ్నీ దొరకేందుకు సగటున మూడు నుంచి ఐదేళ్లు పడుతుందట. దీంతో శాస్త్రవేత్తలు జంతువుల నుంచి అవయవాలను సేకరించి మనిషులకు అమర్చే అంశంపై విస్తృతంగా ప్రయోగాలు జరుపుతున్నారు. నిజానికి జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే అంశంపై 17వ శతాబ్దం నుంచే ప్రయోగాలు జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో కొందరు శాస్త్రవేత్తలు బబూన్‌(ఒకరకమైన కొండముచ్చు) గుండెను ఓ చిన్నారికి అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే.. అవయవాలు దొరికే వరకు తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు జంతువుల అవయవాలను అమర్చి మనుషుల ప్రాణాలు బతికించొచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.