Politics

సొంత గ్రామంలో ఓడిన గెల్లు. 11వేల మెజార్టీతో ఈటల హవా-TNI స్పెషల్

సొంత గ్రామంలో ఓడిన గెల్లు. 11వేల మెజార్టీతో ఈటల హవా-TNI స్పెషల్

* హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉప పోరులో ఉత్కంఠ ఫలితాలు వచ్చాయి. ఎనిమిదో రౌండ్‌ వరకు దూకుడు మీదున్న భాజపా అభ్యర్థి ఈటలకు బ్రేకులు వేసిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ముందుకు దూసుకొచ్చారు. ఆ వెంటనే మరో రౌండ్‌లో అంతే వేగంగా వెనుదిరిగారు. గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు ఆయనకు షాకిచ్చారు. ఇక్కడ గెల్లు శ్రీనుకి 358 రాగా, ఈటల రాజేందర్‌కి 549 ఓట్లు పోలయ్యాయి. గెల్లు అత్తగారి గ్రామం హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లెలోని ఓటర్లు కూడా ఆయనకు హ్యాండ్‌ ఇచ్చారు. ఇక్కడ ఈటలకే 76 ఓట్ల అధిక్యం వచ్చింది. యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న వెంకటరావుపల్లెతో పాటు సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు తెరాసను ఆదరించలేదు. తెరాస ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ స్వగ్రామమైన సింగాపూర్‌లో కూడా ఇదే పరిస్థితి గులాబీ పార్టీకి ఎదురైంది.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపా ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఉప ఎన్నిక ఫలితాలపై అభినందనలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వల్లే హుజూరాబాద్‌లో ఈ ఫలితాలు వస్తున్నాయని అన్నారు.

* హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో 15వ రౌండ్‌లోనూ భాజపా ఆధిక్యం కొనసాగింది. తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థిపై ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ రౌండ్‌ ముగిసిన తర్వాత ఆయన 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

* హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ ఉప ఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు 2,05,236 కాగా.. ఇప్పటి వరకూ లెక్కించినవి 1,17,199 ఓట్లు. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 88,037గా ఉన్నాయి.

* హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 13 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. అయితే తెరాస మాత్రం 8, 11 వ రౌండ్లలో మాత్రమే ఆధిక్యం కనబరిచింది. మిగతా అన్ని రౌండ్లలో భాజపా దూసుకెళ్లింది. 13 రౌండ్లు ముగిసే సరికి భాజపాకు మొత్తం 58,333 ఓట్లు రాగా.. తెరాసకు 49,945 ఓట్ల వచ్చాయి. ఈటల 8,388 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ భాజపా ఆధిక్యం కనబరిచిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతో తెరాస పతనం ప్రారంభమైందన్నారు. ఆత్మగౌరవం, అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవం గెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు.