Business

మనుషుల సలహాలు వద్దంటున్న ఐటీ ఉద్యోగులు-వాణిజ్యం

మనుషుల సలహాలు వద్దంటున్న ఐటీ ఉద్యోగులు-వాణిజ్యం

* ఉద్యోగంలో పైకి రావాలని అందరికీ ఉంటుంది. దాని కోసం వారు చేయని ప్రయత్నమూ ఉండదు. నైపుణ్యాలు పెంచుకోవడం, తమ రంగాలకు చెందిన సీనియర్ల సలహాలు తీసుకోవడం, అనుభవజ్ఞులను ఆశ్రయించడం, తెలిసిన వారి మద్దతు కోరడం… ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటికి ఇప్పుడు ఒక కొత్త మార్గం కనిపిస్తోంది. అదేమంటే… రోబోల సహాయం తీసుకోవడం. ఆశ్చర్యంగా ఉన్నా… ఇదే నిజం. కరోనా మహమ్మారి తెచ్చిన అనూహ్యమైన మార్పుల్లో ఇది ఒకటి. అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఒరాకిల్‌ కార్పొరేషన్‌, వర్క్‌ప్లేస్‌ ఇంటెలిజెన్స్‌ అనే హెచ్‌ఆర్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ సంస్థతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘ఏఐ ఎట్‌ వర్క్‌’ అనే పేరుతో వెల్లడించిన ఈ అధ్యయన నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశాలెన్నో ఉన్నాయి. దీని ప్రకారం.. ఉద్యోగంలో వృద్ధి చెందేందుకు మనుష్యుల కంటే రోబోలు ఇచ్చే సూచనలే ఎంతో మేలు చేస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా 82% మంది విశ్వసిస్తున్నారు. తమ భవిష్యత్తును నిర్మించుకోవటానికి టెక్నాలజీ సాయం తీసుకోవాలని 85% మంది భావిస్తున్నారు.

* ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ ఇప్పుడు ఈ-మోటార్‌ సైకిళ్లపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవేష్‌ అగర్వాల్‌ ధ్రువీకరించారు. వచ్చే ఏడాది నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లు, చౌకగా స్కూటర్ల అభివృద్ధిపై దృష్టిపెట్టనున్నట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించిన ఒక ఆర్టికల్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘యస్‌ నెక్స్ట్‌ ఇయర్‌’ అని పేర్కొన్నారు. గతంలో ఆయన తన బ్లాగ్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కంపెనీ ఉత్పత్తులను ఈ-మోటార్‌ సైకిళ్ల నుంచి ఈ-కార్ల వరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

* హరియాణలోని సోనిపత్‌ వద్ద మారుతీసుజుకీ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. ఖర్‌కొండ ప్రాంతంలోని 900 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని క్లియర్సెన్‌లను ఇచ్చినట్లు ఖట్టర్‌ వెల్లడించారు. భారత్‌లో ఆటో మొబైల్‌ రంగం వేగంగా ఎదిగేందుకు మారుతీ కొత్త ప్లాంట్‌ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ 15ఏళ్లపాటు రీఎంబర్స్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

* జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.68 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో రూ.89.76 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.828.47 కోట్ల నుంచి తగ్గి రూ.731.90 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ.822.73 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలోని రూ.704.95 కోట్లతో పోలిస్తే వ్యయాలు పెరగడం గమనార్హం.

* సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ రూ.7.89 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.4.52 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 74 శాతం అధికం. మొత్తం ఆదాయం 35 శాతం పెరిగి రూ.242.15 కోట్లకు చేరింది. లావాదేవీల ఆదాయం 32 శాతం, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 43 శాతం, ఒపెన్‌ బ్యాంక్‌ ఆదాయం 35 శాతం పెరిగాయి.