DailyDose

TNI తాజా వార్తలు

TNI  తాజా వార్తలు

* రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ స్కీం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..

ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద కేంద్రం రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో మంజూరు చేయనున్న కిసాన్ నిధి కింద సుమారు 22 వేల కోట్లు రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబ‌ర్‌-మార్చ్ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కిసాన్ స‌మ్మాన్ నిధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 1.57 లక్షల కోట్లను కేటాయించింది. డిసెంబ‌ర్ 15 నుంచి 25 మ‌ధ్య 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం సమాయత్తమైందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. ఈ సారి కిసాన్‌ పథకంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని 15 లక్షల మంది రైతుల్ని కూడా క‌ల‌ప‌నున్నారు. దీంతో ఈ స్కీమ్ కింద ల‌బ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 11కోట్లు దాటనుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎం కిసాన్ పథకానికి 65వేల కోట్ల బడ్జెట్‌ను ఉపయోగించనున్నారు. ఈ సారి నుంచి బెంగాల్ రైతులను కూడా కలపనుండటంతో.. నిధుల సంఖ్య మరింత పెరిగే సూచనలున్నాయని పేర్కొంటున్నారు. కాగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఇప్పట్లో మర్చడం లేదని కేంద్రం ఇటీవల స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

కాగా.. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు మూడు విడతల్లో నగదును జమ చేస్తూ వస్తోంది. మూడు త్రైమాసికాల్లో రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది.

* తిరుపతి,

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుప‌తి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

21 పరదాలు విరాళం

హైదరాబాదుకు చెందిన శ్రీ పి.శ్రీ‌ధ‌ర్‌నాయుడు, శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌క్ష్మీ దంప‌తులు ఈ సంద‌ర్భంగా ఆలయానికి 21 పరదాలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

* వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది.

మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు .

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కడప జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దీప్తి

ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుకు నిరసనగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన దీప్తి.

* సోమిరెడ్డి కామెంట్స్

దీప్తి రాజీనామా వైసీపీ నాయకుల తీరుకు చెంపదెబ్బ

నెలకు రూ.40వేలకు పైగా జీతం, కుటుంబ భవిష్యత్తును కూడా ఖాతరు చేయకుండా సాటి మహిళకు జరిగిన అవమానానికి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు

దీప్తికి మంచి భవిష్యత్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు ప్రతీ మహిళ కన్నీరు పెట్టుకుంటోంది

అయినా మంత్రులు ఇంకా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.

అమరావతి కోసం పోరాడే మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయడం దుర్మార్గం

వైసీపీ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది.

* ప్రెటోల్ రేట్లును దాటేసినా టమాటా ధర హైదరాబాద్ : సామాన్యుడిని టమాట రేట్లు ఠారెత్తిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు.

హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. టమాట వెరైటీలకు ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది. ఇవాళ ఉదయం నుంచి సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది.

టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టమాట చట్నీకి రాంరాం చెప్పారు. పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.

ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు వేరే కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.

* ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న చదువులతల్లి ప్రియ…

ఓవైపు నిరుద్యోగం….మరోవైపు కటిక దారిద్య్రం…ఇంకో వైపు చెల్లెలి అనారోగ్యం… భారీ వర్షాలకు ఇళ్ళు ఉరుస్తుండటంతో మొన్ననే దాతలు ఇచ్చిన ఇంటిలో కాపురం…. తన కోసం తల్లిదండ్రుల కష్టాలు చూడలేక…… ఏమనుకుందో ఏమో కాని ఆ చిట్టితల్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గుడుపల్లిలో జరిగింది.

జానకిరామ్, నాగలక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రియ(24), మరో కుమార్తె ఝాన్సీ….

ప్రియ కార్వేటినగరంలో TTC చేసి dsc లో క్వాలిఫై అయ్యింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది…..ఈ లోపు RRB రాసి ఒక్క మార్కులో పోయింది. ఇదిలావుండగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి సచివాలయంలో అయినా ఉద్యోగం రాకపోదా అనే గంపెడాశతో ఆదివారం తిరుపతిలో ప్రాక్టికల్ పరీక్ష రాసి గుడుపల్లికి చేరుకుంది. సోమవారం రాత్రి ఏమైందో ఏమో తెలియదు గానీ రైలుకింద పడి తనువు చాలించింది. ఈమేరకు కుప్పం రైల్వే ఎస్సై కె.బలరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….

* దిగ్విజయంగా ద్వితీయ పర్వం…. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

పెద్ద ఎత్తున హాజరైన గులాబీ శ్రేణులు

నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా, నిజామాబాద్ కలెక్టరేట్ లో కవిత నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ, రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారన్న ఎమ్మెల్సీ కవిత, ఈ సంవత్సర కాలంలో సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉండగా, దాదాపు 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ గారు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి ఇచ్చిన అవకాశాన్ని జయప్రదం చేసేవిధంగా స్థానిక సంస్థల సభ్యులంతా సహకరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత గారు ఖరారు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుండి నిజామాబాద్ బయలుదేరారు. కామారెడ్డి టేక్రియాల్ దగ్గర స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్సీ కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాణసంచా పేళుళ్లు, డప్పు చప్పులతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇందల్ వాయి టోల్ ప్లాజా, డిచ్ పల్లి వద్ద సైతం నాయకులు, కార్యకర్తులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

నిజామాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి దారిపోడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. కార్యకర్తలు అడుగడుగునా తమ అభిమాన నాయకురాలిపై పూల వర్షం కురిపించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత కలెక్టరేట్ వైపు ముందుకు సాగారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచేండం, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవిత మరోసారి మండలి అభ్యర్థిగా ఎంపిక కావడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదాన్న గారి విఠల్, కామారెడ్డి జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీల్, గంప గోవర్ధన్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* కుమారుడి కంటి చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న ప్రియాంక గాంధీ
నాలుగున్నరేళ్ల క్రితం రైహాన్ కంటికి గాయం
క్రికెట్ ఆడతుండగా గాయపడిన వైనం
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఎయిమ్స్ వైద్యులు
అప్పట్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స
మరోసారి చికిత్స కోసం వస్తున్న రైహాన్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాబాదులోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అప్పట్లో హైదరాబాదులో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

* శ్రీ సంతోష్ మెహ్రా, IPS, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), నేషనల్ హమ్నా రైట్స్ కమీషన్ (NHRC), న్యూఢిల్లీ తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, హైదరాబాద్‌ని సందర్శించారు.

కేసుల తీర్పు ప్రక్రియను, ముఖ్యంగా కోర్టు వ్యవహారాలను ఆయన గమనించారు. అలాగే కోర్టు హాళ్లను, కమిషన్‌లోని అన్ని విభాగాలను కూడా వీక్షించారు. చివరకు, పార్టీలను నేరుగా విని, న్యాయనిర్ణేతగా కోర్టు విధానాన్ని అనుసరిస్తుంది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దేశవ్యాప్తంగా ఏకైక కమీషన్ అని పేర్కొన్నారు.

అతను తన పరిశీలనలను NHRC చైర్‌పర్సన్ ముందు ఉంచుతానని మరియు అటువంటి పబ్లిక్ హియరింగ్ సిస్టమ్ అన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సూచించబడాలని సిఫారసు చేస్తానని పేర్కొన్నాడు.

గౌరవ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ జి చంద్రయ్య, గౌరవ సభ్యుడు (judicial) శ్రీ ఎన్ ఆనందరావు మరియు గౌరవ సభ్యుడు (నాన్ జ్యుడీషియల్) శ్రీ ఇర్ఫాన్ మొయినుద్దీన్‌తో పాటు కమిషన్ అధికారులు అనగా సెక్రటరీ శ్రీ విద్యాధర్ భట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ షహాబుద్దీన్, పౌరసంబంధాల అధికారి శ్రీ పి. శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వరరావు మరియు డిఎస్పీ శ్రీ సత్తయ్య వార్ల ముందు అతిధి కి పూల గుంచం మరియు శాలువా తో సత్కరించారు.

* పత్రికా ప్రకటన

రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, హైదరాబాద్

తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు, రాజ్యాంగ దినోత్సవం పై ఫోటో ఎగ్జిబిషన్

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. అనేక పోరాటాలు జరిపారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎందరో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవాల’లో భాగంగా ఆ మహనీయుల త్యాగాలు, వారి వీరోచిత పోరాటాల గురించి నేటి తరానికి తెలియచేయాలనే సంకల్పంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠిలోని యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలుగు స్వాతంత్ర్య సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధల జీవిత విశేషాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో వుంచారు.

భారత రాజ్యాంగ విలువలను దేశ ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబర్ 26 వ తేదిన రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకోవాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 19 నవంబర్ 2015న నోటిఫై చేసింది. అప్పటి నుండి మనం ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకుంటున్నాం.

ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియచేసే ఫోటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసారు.

నవంబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్న ఈ ఛాయాచిత్ర ప్రదర్శన, నవంబరు 26వ తేదీ వరకు (మూడు రోజులపాటు) కొనసాగుతుంది.

* హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు..

రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తా అంటున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరన్నారు. ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు.

* హైదరాబాద్: ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్ నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు, 131 ఆస్తులను అటాచ్ చేశారు.

హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను కూడా అటాచ్ చేశారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరిరెడ్డి, పద్మ, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులను జప్తు చేశారు. మనీలాండరింగ్ యాక్ట్ 200 ప్రకారం ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.

* ఏపీకి రూ.3,847.96 కోట్లు … తెలంగాణకు రూ.1,998.62 కోట్లు విడుదల

హైదరాబాద్‌ : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.  దేశంలోని వివిధ రాష్ట్రాలకు మొత్తం రూ.95,082 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో  కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998.62 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,847.96 కోట్లు విడుదలయ్యాయి.  ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం వెల్లడించింది.

* కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర పురస్కారం

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర.