Politics

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభం

దేశ, విదేశాలకు చెందినవారు ఆర్బిట్రేషన్‌ కోసం ఇక నుంచి హైదరాబాద్‌ ఐఏఎంసీ వైపు చూస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల(ఏడీఆర్‌) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. అంతర్జాతీయ కేంద్రాలకు దీటుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం(ఐఏఎంసీ) శనివారం ఘనంగా ప్రారంభమైంది. నానక్‌రాంగూడలోని ఫీనిక్స్‌ వీకే టవర్స్‌లోని 21, 22 అంతస్తులలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని కేంద్రమంతా కలియ తిరుగుతూ వసతులను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐఏఎంసీ కార్యాలయానికి సంబంధించిన పత్రాలను సీఎం సీజేఐకి అందజేశారు. కేంద్రం వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐఏఎంసీ సీఈవో సితేష్‌ ముఖర్జీ, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతరులు పాల్గొన్నారు. ఐఏఎంసీ ప్రారంభం అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశ, విదేశ పార్టీలు విదేశీ కేంద్రాలైన సింగపూర్‌, లండన్‌ల వైపు చూస్తున్నాయి.. ఇకపై హైదరాబాద్‌ కేంద్రం మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ విషయంలో దేశం, ఆసియాతోపాటు ప్రపంచానికి ఈ కేంద్రం బాటలు వేయగలదు. హైదరాబాద్‌ ఐఏఎంసీ సింగపూర్‌ కేంద్రం కంటే మెరుగైనది.” అని అన్నారు.