WorldWonders

జైలు అధికారులకు నెలకు కోటి రూపాయిలు లంచం

జైలు అధికారులకు నెలకు కోటి రూపాయిలు లంచం

ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.200కోట్ల మోసం కేసులో అరెస్టయిన సుఖేశ్‌.. ప్రస్తుతం దిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా రూ.కోటి లంచం ఇస్తున్నాడని తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం జైలు సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. జైల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగించేందుకు 15 రోజులకు రూ.60-75లక్షలు ఇచ్చినట్లు సదరు కథనాలు తెలిపాయి. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రతి నెలా రూ.కోటి వరకు ఇచ్చినట్లు తెలిసింది.