Agriculture

మహబూబాబాద్ జిల్లా రైతు…5ఎకరాల్లో 40రకాల వరి సాగు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం అశోక్‌ ప్రకృతి వ్యవసాయ నిపుణులైన డాక్టర్‌ సుభాష్‌ పాలేకర్‌, విజయ్‌రామ్‌, నారాయణరెడ్డిలతో కలిసి కేరళలోని ఇండియన్‌ కార్డామా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో కొంతకాలం పనిచేశారు. వారి స్ఫూర్తితో 2012 తనకున్న మూడెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని అరుదైన వరి రకాల సాగుకు శ్రీకారం చుట్టారు. బ్లాక్‌ రైస్‌, కాలాబట్టి, నవారా, కుళ్లకార, మైసూర్‌ మల్లిక, సిద్ద సన్నాలు, బహురూపి, కర్పుగౌని తదితర వరి రకాలను పండించారు. అప్పటి నుంచి ఏటా అనేక కొత్త రకాలను సాగు చేస్తూ వచ్చారు. తద్వారా మంచి లాభాలు పొందడమే కాకుండా, మూల విత్తనాలను డెహ్రడూన్‌, దిల్లీ, చండీగఢ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. 2017లో గ్రామస్థుల సహకారంతో 250 రకాల దేశీయ విత్తనాలను అభివృద్ధి చేసి ప్రశంసలు పొందారు. పంటలో వాడాల్సిన వేపపిండి, సేంద్రియ ఎరువులను అశోక్‌ స్వయంగా తయారు చేస్తారు. ‘ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత పరచడమే నా ముందున్న లక్ష్యం. రైతులు మూస విధానాన్ని వీడి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల’ని అంటారు అశోక్‌. ఆ దిశగా రైతులను చైతన్యవంతులను చేయడానికి తన వంతు కృషి చేస్తానంటున్నారీయన.

*** అశోక్‌ తయారు చేసిన అనేక రకాల మూల విత్తనాలు
* రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, వినియోగదారులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొన్నారు అశోక్‌. పంట ఉత్పత్తులను కూడా వాట్సాప్‌ ద్వారానే ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, హనుమకొండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారాయన.
* సోమారంలో డాక్టర్‌ కుందూరి రాజేందర్‌రెడ్డి ఇచ్చిన స్థలంలో 50 గోవులను అశోక్‌-దివ్య దంపతులు పెంచుతున్నారు. ఆవుపేడ, మూత్రంను జీవామృతం తయారీలో ఉపయోగిస్తున్నారు. జింజువా, ఈరమణి రకాలకు చెందిన గడ్డిని మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి ప్రత్యేకంగా తెప్పించి పెంచుతున్నారు. దీని వల్ల అధిక పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు.
* 2017లో రామకృష్ణమఠం, చిన్నజీయర్‌స్వామి ఆశ్రమంలో తొమ్మిది రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిన్నజీయర్‌స్వామి, నిర్మలమాత, పరిపూర్ణానందస్వామి, బాబా రాందేవ్‌లు సన్మానించారు. ఈయన చేస్తున్న సేంద్రియ వ్యవసాయం, గోసంరక్షణను వారు అభినందించారు.