Food

హోటల్ వ్యాపారంలో వింత పొగడలు

హోటల్ వ్యాపారంలో వింత పొగడలు

విజయం సాధించాలంటే భిన్నంగా ఉండాలి. హోటల్‌వ్యాపారంలో ఈ భావనకు మరింత ప్రాధాన్యం ఉంది. మన రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరుల్లో వైవిథ్య ఆహారవ్యాపారం చూస్తే ఆహా అనిపిస్తుంది. పేర్లు, థీమ్స్‌, రుచులు అన్నింటా చూపునిలబెట్టేలా చేస్తున్నారు. కొత్తదనంతో వినియోగదారులపై వల విసురుతున్నారు. ఒకప్పుడు హోటల్స్‌ ముందు ‘భోజనం తయార్‌’. ‘మిలటరీ హోటల్‌’, హైదరాబాదీ బిర్యానీ అనే పేర్లు ఎక్కువగా కనిపించేవి. ఇపుడు కొత్తపేర్లు కనిపిస్తున్నాయి. విజయవాడలో సెకండ్‌ వైఫ్‌ (ఇక్కడ తిని ఇంట్లో చెప్పకండి. పచ్చడైపోతారు) వచ్చితినిపో, రా మావ టిఫిన్‌ చేసేల్దాం, పెసరట్టు కొట్టు, కక్కాముక్క తదితర పేర్లను వైవిధ్యంగా పెడుతున్నారు. గుంటూరులోనూ వైవిథ్యమైన సరికొత్త పేర్లతో ఆహారశాలలు వెలిశాయి.

అల్పాహారం, భోజనం, బిర్యానీ తినేటప్పుడు వాటి రుచితో పాటు పరిసరాలు కూడా విభిన్నంగా ఉంటే వినియోగదారులు ఎక్కువగా సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. విజయవాడ నగర పరిసరాల్లో విమానంలో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. నిజమైన విమానాన్ని కొనుగోలు చేసి అందులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. తెనాలిలో  జైలు మాదిరిగా రెస్టారెంట్‌ పరిసరాలను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్‌కు వెళ్లగానే లాకప్‌ ఊచలు వేసేస్తారు. అలాగే కొద్దిసేపు బేడీలు కూడా వేస్తారు. విజయవాడ బెంజిసర్కిల్‌, గుంటూరు లక్ష్మీపురాల్లో  రల్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. రైలులో మాదిరిగా గోడకు రంగులు, కుర్చీలు వేశారు.

గుంటూరు, విజయవాడల్లో రోబోలు వినియోగదారుల వద్దకు వచ్చి ఆహారపదార్థాలను అందిస్తున్నాయి. మరో చోట ఆహారపదార్థాలను రైలు బండి పెట్టి పంపిస్తున్నారు. అలాగే వాహనాల టైర్లు, డ్రమ్ములపై కూర్చుని  తినేలా మరో చోట ఏర్పాటు చేశారు.  పాత వస్తువులకు రంగులు వేసి ఆకట్టుకునేలా పరిసరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు నీటిలో కూర్చుని తినేలా కూడా విజయవాడలో కొన్ని రెస్టారెంట్‌లు ఉన్నారు. కాళ్లకు నీళ్లు తగిలేలా తీర్చిదిద్దారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తినుబండారాలు, రెస్టారెంట్లతో బ్రాంచీలు ఏర్పాటు చేసిన  ఆహారశాలల్లో పాతతరం సినీ నటుల చిత్రాలు గోడాలపై కనిపిస్తాయి. ఆపాత మధురాలైన పాటలు వినిపిస్తారు. 

కొత్తగా వడ్డింపు.
ఒకప్పుడు పొలం పనులకు చద్ది అన్నం తినివెళ్లేవారు. అప్పట్లో పాఠశాల విద్యార్థులకు అదే ఆహారం. నేటి తరం వారికి చద్ది అన్నం దాదాపుగా తెలీదు. విజయవాడ, గుంటూరుల్లో పెద్దహోటళ్లలో చద్ది అన్నంను మెనూలో ఉంచారు. పుల్లట్టు, దిబ్బరొట్టెలు ఎలా ఉంటుందో తెలియని వాళ్లు వెళ్లి ఆరగించే అవకాశం మరికొన్ని ఆహారశాలలు కల్పిస్తున్నాయి. బాగా డెకరేషన్‌ చేసిన హోటళ్లలో గోలీసోడాలకూ ఫ్లేవర్లు ఇస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ, ఇతర ప్రాంతాల రుచులనూ కొత్తగా సంప్రదాయపద్ధతిలో వడ్డించే హోటళ్లు వెలిశాయి. కుటుంబసమేతంగా రెస్టారెంట్‌కు వెళితే వారిలో ఎవరిదైనా పుట్టినరోజు అని చెబితే కేకును తీసుకుని వచ్చి కట్‌ చేయిస్తున్నారు. రెస్టారెంట్‌లోని సిబ్బంది వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వినియోగదారులు వద్దు అనే వరకు కూడా వడ్డిస్తున్నారు. చెరుకు రసం కూడా ఇస్తున్నారు. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హోటల్‌లో సిబ్బందిని ఆకర్షించేలా ఆహ్వానానికి పెడుతున్నారు. హైదరాబాద్‌లో రైల్‌ రెస్టారెంట్‌లో తిన్నేటప్పుడు వచ్చిన ఆలోచనతో రాష్ట్రంలో మొదటిసారి గుంటూరు లక్ష్మీపురంలో ఏర్పాటు చేశామని బీటెక్‌ చదివిన హోటల్‌ యజమాని హేమభవానీ చెప్పారు. బెంగళూరులో రోబోరెస్టారెంట్‌ చూసి గుంటూరు బృందావన్‌ కాలనీలో ఏర్పాటు చేశానని ఫార్మసీ చదువుకున్న ఎం.గౌతమ్‌ చెప్పారు. కొత్తథీమ్‌ కోసం నెట్‌లో శోధించి జైల్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశామని తెనాలికి చెందిన నజీర్‌హుస్సేన్‌ చెప్పారు.