Health

మధుమేహుల్లో గుండె జబ్బుకు ఈ ప్రొటీనే కారణం.. భారత శాస్త్రవేత్తల పరిశోధన!

మధుమేహుల్లో గుండె జబ్బుకు ఈ ప్రొటీనే కారణం.. భారత శాస్త్రవేత్తల పరిశోధన!

మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బు ముప్పును పెంచే ఒక ప్రొటీన్‌ను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔషధాలతో దీని చర్యలను నియంత్రించడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని వారు పేర్కొన్నారు. తిరువనంతపురంలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ధమనుల గోడలపై పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ పూడికలు చిట్లిపోయినప్పుడు.. మరమ్మతు యంత్రాంగం క్రియాశీలమవుతుంది. దీనివల్ల అక్కడ రక్తం గడ్డలు ఏర్పడతాయి. అయితే అది గుండె కండరానికి రక్త ప్రవాహం చేరకుండా పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంది. ఫలితంగా గుండె పోటు వస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు కొలెస్ట్రాల్‌ ఛిద్రమయ్యే ముప్పు ఎక్కువ. వారిలో ఈ ఇబ్బందిని అధికం చేయడంలో సైక్లోఫిలిన్‌ ఎ అనే ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు ఆర్‌జీసీబీ శాస్త్రవేత్త సూర్య రామచంద్రన్‌ తెలిపారు. గుండె జబ్బులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో జరిగే పరిణామాల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.