DailyDose

నేటి తాజా వార్తలు – 22/01/2022

నేటి తాజా వార్తలు – 22/01/2022

*కాపు నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో డబ్బు కట్టించుకోవడం న్యాయబద్దం కాదని లేఖలో ముద్రగడ హితవు పలికారు. ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకోండని 1978లో అప్పటి ప్రభుత్వమే చెప్పిందన్నారు. డబ్బు కట్టాలని అప్పుడు ఏ అధికారీ అనలేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

*పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం హైకోర్టు విచారణకు చేపట్టింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించారంటూ కోర్టులో జేఏసీ నేత కేవీ కృష్ణయ్య పిటిషన్‌ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని కృష్ణయ్య పేర్కొన్నారు. సెక్షన్ 78(1)కి విరుద్ధంగా ఉన్న జీవో1ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు.. కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

*కేంద్రం తీసుకున్న మానిటైజేషన్‌ పైపులైన్‌ విధానం తపాల శాఖ మనుగడను దెబ్బ తీసేవిధంగా ఉండడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సమ్మెలోకి వెళ్లబోతున్నారు. ఈ సమ్మె నోటీసును విజయవాడలోని చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ)కి ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ శుక్రవారం అందజేసింది.  

*విరుదునగర్‌ జిల్లా సాత్తూరు వద్ద మంజల్‌ ఓడైపట్టి గ్రామంలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో బుధవారం ఉదయం సంభ వించిన పేలుడులో నలుగురు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

*కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతిలోని దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లికొడుకులైన షేక్ అలీఫ్ (19), షేక్ మీరమ్మ (42)లను సమీప బంధువే హత్య చేశాడు. ఈ ఘటన అంబటి వారిపాలెంలో కలకలం సృష్టిస్తోంది. మీరమ్మ కుటుంబానికి దగ్గరి బంధువైన రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల కారణంగానే రబ్బానీ ఈ దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని పీఏసీ కమిటీ పేర్కొంది. ఈ విషయం పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బనకచర్ల హెడ్రెగ్యులేటర్ సముదాయాన్ని పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. తెలుగుగంగ ఆయకట్టు కింద ఉన్న రైతులకు రబీ సీజన్‌లోని పంటలకు సాగునీరు అందించాలని రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రాజెక్టుల పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కమిటీ ఛైర్మన్ కేశవ్ కోరారు.

*రోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది ఐపీఎల్‌లో రెండో సగం మ్యాచ్‌లు యూఏఈకి తరలిపోగా, అంతకుముందు ఏడాది కూడా యూఏఈ వేదికగానే ఐపీఎల్ జరిగింది. అయితే, ఈసారి మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ, ఐపీఎల్ జరిగే సమయానికి పరిస్థితులు అనుకూలించకుంటే కనుక టోర్నీని ఏ దేశానికి తరలించాలన్న దానిపైనా బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రణాళిక వేసుకున్నట్టుగా సమాచారం.

* రైతులకు ధాన్యం డబ్బుల అంశంపై కేసీఆర్‌ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కొన్న వడ్లకు పైసలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని తెలంగాణ సర్కారుపై విజయశాంతి మండిపడ్డారు.

* ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండేరోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.